తెలుగు - తమిళ బిగ్ బాస్ లు ముగిసిన తర్వాత హిందీ బిగ్ బాస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షో ప్రారంభానికి ముందు సోషల్ మీడియా సెలబ్రిటీ ధించక్ పూజ ...బిగ్ బాస్-11 లో పాల్గొనబోతోందంటూ వార్తలు వచ్చాయి. కానీ, నిర్వాహకులు ఆమెను ఎంపిక చేయలేదు. అయితే, త్వరలో పూజను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే వివాదాలతో ప్రారంభమైన బిగ్ బాస్ లో ధించక్ పూజ ఎంట్రీతో మరిన్ని వివాదాలు తప్పేలా లేవు. తాను షోలో అడుగుపెట్టబోతున్నానంటూ బిగ్ బాస్ సల్మాన్ కు ఓ వీడియో మెసేజ్ పెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హిందీ బిగ్ బాస్ కోసం ధించక్ పూజ చేసిన ఆడిషన్ టేప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బిగ్ బాస్ షోలో మంట పుట్టించడానికి వస్తున్నా... సిద్ధంగా ఉండు సల్మాన్ ఖాన్.. అని పూజ ఆ వీడియోలో చెప్పింది. తనకు పాజిటివ్ గా ఉండే వాళ్లంటే ఇష్టమని, బిగ్ బాస్ హౌజ్ లో కూడా తన ప్రవర్తన ఇలాగే ఉంటుందని చెప్పింది. బిగ్ బాస్ కి సంబంధించి ఆమె చేసిన ర్యాప్ ఈ వీడియోలో చూడొచ్చు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. యూట్యూబ్ లోనే తనను తట్టుకోలేకపోతున్నామని, ఇక ప్రతిరోజు బిగ్ బాస్ లో తనను ఎలా చూడగలమని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, నిన్న రాత్రి ధించక్ పూజ తన కర్ణ కఠోరమైన గొంతుతో ఓ కొత్త పాట విడుదల చేసింది. `ఆఫ్రీన్ ఫాతిమా బెవఫా హై` అనే పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఆ పాట పెట్టిన 15 గంటల్లోనే దాదాపు 75 వేల మంది వీక్షించడం విశేషం. ఆమె సూపర్ హిట్ వైరల్ పాటలైన `సెల్ఫీ మైనే లేలే ఆజ్` - `దిల్లోంకా స్కూటర్` పాటల కంటే ఇది ఇంకా కర్ణకఠోరంగా ఉంది. అయినప్పటికీ నెటిజన్లు ఆ వీడియోను చూసి కామెంట్లు చేస్తున్నారు.