మూవీ రివ్యూ : దిల్ బేచారా

Update: 2020-07-25 07:10 GMT
చిత్రం : 'దిల్ బేచారా'

నటీనటులు: సుశాంత్ సింగ్ రాజపుత్ - సంజన సంఘీ - సైఫ్ అలీ ఖాన్ - సాహిల్ వైద్ - శాశ్వత ఛటర్జీ - స్వస్తిక ముఖర్జీ తదితరులు

సంగీతం: ఏఆర్ రెహమాన్

ఛాయాగ్రహణం: సత్యజిత్ పాండే

నిర్మాణం: ఫాక్స్ స్టార్ స్టూడియోస్

రచన: శశాంక్ ఖైతాన్, సుప్రోతిమ్ సేన్ గుప్త

దర్శకత్వం: ముఖేష్ చాబ్రా

దివంగత యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ చివరి సినిమాగా రూపొందింది 'దిల్ బేచారా'. బాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ డైరెక్టరు గా పనిచేసిన ముఖేష్ చాబ్రా ఈ సినిమాతో దర్శకుడి గా పరిచయం అయ్యాడు. ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెర కెక్కిన దిల్ బేచారా.. ప్రస్తుతం థియేటర్స్ అన్నీ మూతపడటంతో డిస్నీ హాట్ స్టార్ లో విడుదల చేసారు. ఈ మూవీ హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కి రీమేక్. ఇదివరకే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్, పాటలకు మంచి ఆదరణ లభించడంతో 'దిల్ బేచారా' ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొల్పింది. ఇంతకుముందే ప్రపంచంలోనే దిల్ బేచారా ట్రైలర్ అత్యధిక వ్యూవర్ షిప్ దక్కించుకొని రికార్డు సృష్టించింది. ప్రముఖ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందిన 'దిల్ బేచారా' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి దిల్ బేచారా విశేషాలేంటో చూద్దాం రండి.

కథ:

కిజి బాసు(సంజన సంఘీ) థైరాయిడ్ కాన్సర్ పేషెంట్. కాలేజీకి వెళ్తూ తనకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ పాటలు వింటూ కాలం గడిపేస్తూ ఉంటుంది. ఇక రెగ్యులరుగా హాస్పిటల్ కూడా వెళ్తుంది. ఇక కాలేజీ, హాస్పిటల్, హోమ్, మ్యూజిక్ ఇవే కిజి ప్రపంచం. ఇమ్మానుయేల్ రాజకుమార్ జూనియర్ ఉరఫ్ మ్యాని (సుశాంత్ సింగ్) కాన్సర్ పేషెంట్. కానీ అవేం పట్టించుకోకుండా ఆకతాయిగా, హ్యాపీగా గడిపేస్తుంటాడు. అనుకోకుండా కిజితో ప్రేమలో పడతాడు. మ్యాని అల్లరిని భరించలేక మొదట్లో కిజి నో చెబుతుంది. కానీ ఆ తర్వాత మెల్లగా మ్యానితో ప్రేమలో పడిపోతుంది. ఇక ప్రియురాలి ఇష్టాలను, కోరికలను తెలుసుకొని మ్యాని ఒక్కొక్కటిగా తీరుస్తుంటాడు. అలా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్న టైంలో మ్యాని హాస్పిటల్ బారిన పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. కిజి - మ్యానిల లైఫ్ ఎటు మలుపు తిరిగింది అనేది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

'జంషెడ్ పూర్'లో కిజి తల్లిదండ్రులతో ఉంటుంది. డైలీ కాలేజీ, హాస్పిటల్, సాంగ్స్ ఇవే ఆమె ప్రపంచం. అప్పుడప్పుడు వేరే వాళ్ల అంత్యక్రియలకు పాల్గొంటుంది. ప్రేమించిన వారు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందా.. అని తెలుసుకోవడానికి అలా చేస్తుంది. డైలీ కాలేజీ దగ్గరికి తల్లి(స్వస్తిక ముఖర్జీ) వచ్చి రిక్షాలో తీసుకెళ్తుంది. కిజితో పాటు ఎప్పుడు 'పుష్పిందర్' అనే ఆక్సిజన్ సిలిండర్ భుజాన వేసుకొని తిరుగుతుంది. అన్నట్లు పుష్పిందర్ లేకపోతే కిజి కాసేపు కూడా బతకలేదు. అందుకే ఎప్పుడు బరువైనా బతకడానికి మోస్తుంది. ఇక ఇమ్మానుయేల్ రాజకుమార్ జూనియర్ ఉరఫ్ మ్యాని, తన ఫ్రెండ్ జేపీ(సాహిల్ వైద్) గ్లూకోమా పేషెంట్ తో కలిసి సూపర్ స్టార్ రజినీ లాంటి మూవీ తీయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఓరోజు కాలేజీ ఫంక్షన్ టైంలో కిజిని చూసి మ్యాని ప్రేమలో పడతాడు. అప్పటి నుండి కిజి వెంటపడుతూ అల్లరి చేస్తుంటాడు. మొదట్లో కాదని చెప్పినా తర్వాత రోజు తన బైక్ పై డ్రాప్ చేసే వరకు వస్తుంది. ఇక మెల్లగా దగ్గరవుతూ కిజి వాళ్ల ఇంటికి వెళ్తాడు మ్యాని. అక్కడ కిజి తల్లికి నచ్చకపోయినా తండ్రి(శాశ్వత్ ఛటర్జీ)కి నచ్చుతాడు మ్యాని. ఫ్రెండ్ జేపీతో తీయబోయే షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ పాత్రకోసం కిజిని అడుగుతారు. అలా ఇలా మాటలు చెప్పి కిజిని హీరోయినుగా ఓకే చేయిస్తాడు మ్యాని. షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు.

ఆ టైంలోనే జేపీ కంటిచూపు పూర్తిగా కోల్పోతాడు. షార్ట్ ఫిల్మ్ మధ్యలో ఆగిపోతుంది. మ్యాని పూర్తి చేస్తానని మాటిస్తాడు. ఒకరోజు కిజి తన ఫేవరెట్ సాంగ్ (మై తుమరా) సాంగ్ మ్యానికి వినిపిస్తుంది. పూర్తిగా లేని ఆ సాంగ్ మొదట్లో మ్యాని బోరింగ్ ఫీల్ అవుతాడు. తర్వాత మళ్లీ విని అడిక్ట్ అయిపోతాడు. ఎలాగైనా ఆ సాంగ్ ఎందుకు పూర్తి చేయలేదో మ్యూజిక్ డైరెక్టర్ అభిమన్యు వీర్ (సైఫ్ అలీ ఖాన్)ను అడుగుతానని మెయిల్ పెడతారు కిజి - మ్యాని. తర్వాత ఒకరోజు కిజి మెయిల్ కి అభిమన్యు వీర్ నుండి రిప్లై వస్తుంది. ఆ సాంగ్ గురించి తెలుసుకోవాలని ఉంటే పారిస్ వచ్చి కలువుమని చెప్తాడు. ఆ మెయిల్ చూసి కిజి ఎగిరి గంతేస్తుంది. తన డ్రీమ్ నిజం కాబోతుందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. విషయం మ్యానితో చెప్పడంతో వెంటనే పారిస్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాడు. కానీ వీరిద్దరితో పాటు కిజి తల్లి కూడా వెళ్తుంది. కూతురు మ్యానితో కలిసి ఎక్కడ తన వర్జినిటి కోల్పోతుందేమో అని టెన్షన్ పడుతుంది. మొత్తానికి పారిస్ వెళ్తారు. అక్కడ అభిమన్యుని కలుస్తారు కానీ ఆయన మాటలు కాస్త అర్థంకాక అక్కడినుండి వెళ్ళిపోతారు. అయితే ఆ సాంగ్ కూడా మ్యాని పూర్తిచేస్తా అని కిజికి మాటిస్తాడు. ఆ తర్వాత కిజి, మ్యాని, తల్లి ముగ్గురు కలిసి పారిస్ అంతా చక్కర్లు కొడతారు. ఇండియాకి తిరిగొచ్చాక మ్యాని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఇక చనిపోయే రెండురోజుల ముందు ఫ్రెండ్ జేపీని, కిజిని చర్చికి పిలిచి తను చనిపోతే ఏమనుకుంటారో చెప్పమంటాడు. వాళ్లు కాస్త ఎమోషనల్ అయి మ్యాని గురించి చెప్తారు. తర్వాత రెండు రోజులకు మ్యాని చనిపోతాడు. తర్వాత మ్యాని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పాటు కిజి ఫ్యామిలీతో కలిసి మ్యాని - జేపీ తీసిన షార్ట్ ఫిల్మ్ చూస్తారు. అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు.


నటీనటులు:

సినిమా చూసిన ప్రతి ఒక్కరికి సుశాంత్ మరణం తప్పకుండా గుర్తొస్తుంది. సినిమాలో ఉంది మ్యాని లైఫ్ అయినా సుశాంత్ లైఫ్ అలాగే అసంపూర్ణంగా ముగిసిందని గుర్తు చేస్తుంది. ఇక ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా సుశాంత్ ఎంత మంచి నటుడో అర్ధమవుతుంది. మ్యాని అలియాస్ ఇమ్మానుయేల్ రాజకుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. ప్రతి సీన్లో తన బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. రజినీకాంత్ వీరాభిమానిగా మెప్పించాడు. కానీ ఓ ఎమోషనల్ ఎండింగ్ సినిమాలోనే అనుకుంటే నిజజీవితంలో కూడా ఎండింగ్ ఇచ్చేసాడు. ఆకతాయిగా అందరినీ నవ్విస్తూ ఏడిపిస్తూ వెళ్ళిపోయాడు. ఇక హీరోయిన్ సంజన సంఘీ ఫస్ట్ సినిమా అయినా తన బాగా నటించింది. కిజి బాసుగా కామెడీ, రొమాంటిక్, ఎమోషనల్ సన్నివేశాలలో ఆకట్టుకుంది. ఇక మ్యాని ఫ్రెండ్ జేపీగా సాహిల్ వైద్ తన పరిధిలో బాగా మెప్పించాడు. ముఖ్యంగా బ్లైండ్ సీన్స్. ఇక కిజి తల్లి, మిసెస్ బాసు క్యారెక్టర్ లో స్వస్తిక ముఖర్జీ.. కూతురు కోసం కేర్ తీసుకునే తల్లిగా మంచి నటన కనబర్చింది. కిజి తండ్రి మిస్టర్ బాసుగా శాశ్వత్ ఛటర్జీ పరవాలేదనిపించాడు.

సాంకేతికవర్గం:

ఈ సినిమాను డైరెక్టర్ ముఖేష్ చాబ్రా చాలా తెలివిగా తెరకెక్కించాడు. స్టోరీ చూస్తే పాతదే అనిపిస్తుంది కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా నెట్టుకురావడం విశేషం. అదికూడా ఫస్ట్ సినిమానే ఓ పెయిన్ ఫుల్ ఎమోషనల్ స్టోరీ ఎంచుకోవడం మెచ్చుకోవాలి. ఎమోషనల్ సీన్స్, పారిస్ సన్నివేశాలతో పాటు సుశాంత్ ని అన్నీవిధాలుగా చూపించేసాడు. 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' నవల నుండి తీసుకున్న దిల్ బేచారా స్టోరీని రచయితలు  శశాంక్ ఖైతాన్, సుప్రతిమ్ సేన్ గుప్తాలు స్క్రిప్ట్ ఎక్కడ కూడా స్లో కాకుండా రాసారు. తక్కువ నిడివి గల ఈ మూవీ స్క్రిప్ట్ లో ఎక్కడ కూడా అనవసరం అనిపించే సీన్స్ రాయలేదు. స్క్రిప్ట్ పరంగా వాళ్లిద్దరూ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. కానీ తెలుగులో ఆల్రెడీ మణిరత్నం గీతాంజలి కాపీ అనిపించవచ్చు. కథనం కొత్తగా ట్రై చేశారు. ఇక ఈ సినిమాకి సుశాంత్ తర్వాత ప్రాణం పోసింది ఏఆర్ రెహమాన్ సంగీతం. సినిమా అంతా కూడా సంగీతం సాగుతూనే ఉంటుంది. వినసొంపైన బాణీలతో, నేపథ్య సంగీతంతో సినిమాను మరో లెవెల్ లోకి తీసుకెళ్లాడని చెప్పవచ్చు. సినిమా చూస్తున్నంత సేపు అలా రెహమాన్ సంగీతం హమ్ చేస్తారు. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ సత్యజిత్ పాండే సన్నివేశాలను చాలా ప్లీజెంట్ గా తీశారు. ముఖ్యంగా సుశాంత్, సంజనలను బాగా కాప్చర్ చేశారు. సన్నివేశాలను ఛాయాగ్రహణం తెరపై పర్ఫెక్ట్ కన్వె చేశారు. కెమెరా పనితనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. చివరగా నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్.. సినిమా చూస్తే వారు ఎంత క్వాలిటీగా నిర్మించారో అర్ధమవుతుంది. సినిమాలో నిర్మాణ విలువలు కనిపిస్తాయి.

చివరగా: రెండు భావోద్వేగ హృదయాల ముగింపు కథ!
 
రేటింగ్- 3.25/5
Tags:    

Similar News