'బావుంటేనే చూస్తారు' లేకపోతే ఖతం: దిల్‌రాజు

Update: 2015-06-08 09:30 GMT
మినీథియేటర్లు, 2కోట్లలో సినిమాలు, థియేటర్ల గుత్తాధిపత్యం, 14మంది నిర్మాతల సిండికేట్‌ .. ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో నలిగిన అంశాలివి. వీటన్నిటినైనా అగ్రనిర్మాత దిల్‌రాజు ఇచ్చిన క్లారిటీ ఇది..

=కేవలం కోటి రూపాయలతోనే సినిమ తీసేస్తాం అని అనుకున్నా.. చూసేదెవరు? ఎంత బడ్జెట్‌తో సినిమా తీసినా అది జనాలకు నచ్చాలి. అప్పుడే ఆదరణ దక్కుతుంది. థియేటర్లకు వస్తారు. కేరింత సగం షూటింగ్‌ చేశాక జనాలకు నచ్చదనిపించి రీషూట్‌ చేశాం. అప్పటికే 2కోట్లు ఖర్చు చేసి ఉంటాం. అంతిమంగా ప్రేక్షకుడికి నచ్చేలా తీయగలిగాం.

=ఓ మై ఫ్రెండ్‌ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించలేదు. అందుకే అదే తరహా కథతో కేరింత తీయకూడదని అనుకున్నాం. కథ కోసం కావాల్సినంత సమయం తీసుకుని పూర్తిగా కొత్త కథతో ఈసారి వస్తున్నాం. పెద్దలు, పిల్లలు ఎవరైనా ప్రతి ఒక్కరికీ ఓ బ్యాచ్‌ ఉంటుంది. ఆ బ్యాచ్‌లో ఒక్కరు మంచి వాళ్లున్నా వారి ఆలోచనల ప్రభావం అందరిపైనా ఉంటుందని చెబుతున్నాం. 12న వస్తున్న కేరింత అందరికీ నచ్చే సినిమా.

= ఆ నలుగురిలో నేనూ ఒకడినే. కాదని అనను. అయితే మావల్లే సినిమా రిలీజవ్వలేదంటే ఒప్పుకోను. సినిమా బావుంటే, ప్రేక్షకులకు నచ్చేలా తీస్తే ఏ సినిమాకీ థియేటర్ల సమస్య ఉండదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలకే థియేటర్ల సమస్య వస్తుంది. అంతెందుకు కేరింత రెండు నెలల క్రితమే రెడీ అయినా థియేటర్లలోకి రిలీజ్‌ చేయలేకపోయా. నా సినిమాకే సమస్య వచ్చింది కదా!

= కొందరు నిర్మాతలు ఏకమై ఓ కంపెనీ స్థాపించాం. అయితే ప్రచారం పేరుతో అనవసర ఖర్చు తగ్గించుకోవాలన్నదే కంపెనీ రూల్‌. అయితే ఈ కంపెనీ ద్వారాన వాణిజ్య ప్రకటనలు ఇవ్వాలని మిగతా నిర్మాతల్ని బలవంతం చేయడం లేదు. ఈ కంపెనీ చేసే ప్రయత్నం కేవలం చిన్న నిర్మాతలకు మేలు చేసేది మాత్రమే. ఈ కంపెనీ నిర్మాతల మండలిని వ్యతిరేకించేది కాదు. ప్రత్యేక వ్యవస్థ మాత్రమే. అర్థం చేసుకోవడం లేదంతే.

=నిర్మాతల మండలి పరిధిలో ఈ కంపెనీని ప్రారంభించడం కుదరదు. ఎందుకంటే మండలిలో 900మంది సభ్యులుంటే అందులో సినిమాలు తీసేది 60మంది మాత్రమే. సినిమాలు తీయనోళ్లంతా అది అలా కాదు, ఇది ఇలా కాదు అని జనరల్‌ బాడీ మీటింగుల్లో అడ్డుపుల్ల వేస్తారు. అందుకే మండలి ద్వారా ఏదీ కుదరదని అనుకుని ప్రారంభించాం. సినిమాలు తీసేవాళ్లకే ప్రస్తుత సమస్యలేంటో తెలిసేది. అలాంటివాళ్లే మాట్లాడాలి. అలాగే సినిమాలు తీయకపోతే మూడేళ్ల తర్వాత నామాట కూడా మండలిలో, బాడీ  మీటింగ్స్‌లో వినాల్సిన పనేలేదు.

=సినిమాలు తీసే నిర్మాతలంతా ఏకమైతే అద్భుతాలు సృష్టించవచ్చు. నిర్మాణ వ్యయం అదుపులో పెట్టడానికి బోలెడన్ని ప్రణాళికలున్నాయి. అంతా ఒక్కటైతే అద్భుతాలే.

=మినీ థియేటర్లు అన్న ఆలోచన బావుంది. మండల పరిధిలో వీటిని తేవొచ్చు. అప్పుడు కూడా బావుండే సినిమా తీయాలి. నచ్చకపోతే జనాలు థియేటర్లకు రారు. అదీ సంగతి.

Tags:    

Similar News