సెంటిమెంట్ తో సేఫ్ సైడ్

Update: 2018-05-29 10:21 GMT
కథలు దర్శకులను ఎంచుకోవడంలో  తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుని  నిర్మాతగా సక్సెస్ ఫార్ములా బాగా వంటబట్టించుకున్న దిల్ రాజు కొత్త సినిమా శ్రీనివాస కళ్యాణం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. నితిన్ రాశి ఖన్నా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ మూవీకి వేగ్నేశ సతీష్ దర్శకుడు. దిల్ రాజుకే శతమానం భవతి లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో నిర్మాణం నుంచే దీని మీద మంచి ఆసక్తి నెలకొంది. ఆ సినిమాను డీల్ చేసిన తీరు ఫామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసాలా చేసిన టేకింగ్ ఇవన్నీ అతనికి పెద్ద ప్రమోషన్ ఇచ్చాయి. ఇప్పుడు తీస్తున్న శ్రీనివాస కళ్యాణం కూడా అదే బాటలో పూర్తిగా ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తూ తీస్తున్నట్టు టాక్. శతమానం భవతిలో యాంత్రిక జీవనంలో పడి విదేశాల్లో ఉంటూ అమ్మానాన్నలను నిర్లక్ష్యం చేసే పిల్లల గురించి చూపించిన వేగ్నేశ సతీష్ ఈసారి వివాహం నేపధ్యంలో మానవ సంబంధాలు చూపించబోతున్నట్టు టాక్.

మనిషికి డబ్బుంటే చాలు అన్ని అవే సమకూరుతాయి అని నమ్ముతూ నార్త్ లో సెటిల్ అయిన  పెద్ద మనిషి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తుండగా  తెలుగింట పెళ్ళికి వచ్చి అనుబంధాల గొప్పదనం  తెలుసుకునే క్రమం సెకండ్ హాఫ్ లో ఉంటుందట. నితిన్ రాశిల మధ్య కెమిస్ట్రీ ఊహించిన దాని కన్నా బాగా వచ్చిందని నిత్యం మనం చూసే పెళ్లిళ్లలో ఉండే సందడి చిన్నా చితకా గొడవలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరు ఒక తాటి మీదకు రావడం ఇవన్నీ హార్ట్ టచింగ్ గా రూపొందించినట్టు తెలిసింది. గతంలో ఇదే టైటిల్ తో ముప్పై ఏళ్ళ  క్రితం వెంకటేష్ హీరోగా ఒక సినిమా వచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఆ మూవీ అప్పట్లో పెద్ద హిట్టు. ఇది కూడా అదే దారిలో దిల్ రాజుకు  మరో ఫామిలీ సక్సెస్ ఇస్తుందనే నమ్మకం ట్రేడ్ వ్యక్త పరుస్తోంది.
Tags:    

Similar News