ఆ 27 గంటల నరకంపై దిల్ రాజు..

Update: 2017-04-17 05:46 GMT
శతమానం భవతి.. నేను లోకల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో తన ప్రయాణం అద్భుతంగా సాగిపోతున్న తరుణంలో పెద్ద విషాదాన్ని ఎదుర్కొన్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఆయన సతీమణి అనిత గత నెలలో హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మరణం రాజును బాగా కుంగదీసింది. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన భార్య మరణం గురించి స్పందించాడు. తాను అమెరికాలో ఉండగా భార్య మరణం గురించి తెలిసిందని.. అక్కడి నుంచి ఇంటికి చేరుకోవడానికి 27 గంటలు పట్టిందని.. ఈ 27 గంటలు తాను నరకం చూశానని రాజు అన్నాడు.

‘‘అనిత చనిపోయిందనే కబురు వచ్చాక అమెరికా నుంచి నాకు ఇక్కడికి రావడానికి 27 గంటలు పట్టింది. ఆ రోజు నా జీవితంలో వరస్ట్ డే. అన్ని గంటల్లో నాకు కంటి మీద కునుకు రాలేదు. ఎన్నెన్నో జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడాయి. కన్ను మూత పడనివ్వలేదు. అనిత చనిపోయిన సంగతి మా అల్లుడు అర్చిత్‌ చెప్పాడు. అప్పుడు అమెరికాలో తెల్లవారుజామున ఐదున్నర అవుతోంది. ఆ న్యూస్‌ వినగానే 10 నిమిషాల పాటు బ్లాంక్‌ అయిపోయాను. నా ఆలోచన అంతా మా పాప గురించే. కాసేపటికి హరీష్‌ శంకర్‌ ఫోన్‌ చేశాడు. పాపను చూడలేకపోతున్నామని.. త్వరగా రమ్మని చెప్పాడు. ఫ్లైట్‌ ఎక్కాక మాకు ఫోన్‌ కాల్స్‌ లేవు. వాట్సాప్‌ లో టచ్‌ లో ఉన్నారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత కుప్ప కూలిపోతానని మా పాపకు తెలుసు. అందుకే తనను తాను సంభాళించుకుని.. తాను స్ట్రాంగ్ అయి.. నన్ను సముదాయించింది. నేను ఇంటి దగ్గర కారు దిగగానే తనే బయటకు వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్లింది.

నా జీవితంలో మంచి.. చెడు రోజులు చాలా ఉన్నాయి. కానీ నా భార్య మరణాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయాను. నేను ఎప్పుడైనా అర్ధరాత్రి దాటాక ప్రయాణం చేయాల్సి వస్తే.. తనను నిద్ర లేవొద్దని చెప్పేవాడిని. తను కూడా లేచేది కాదు. కానీ తను చనిపోవడానికి ముందు రోజు రాత్రి రెండు గంటలకు ఎయిర్‌ పోర్టుకి బయల్దేరితే.. తనే నిద్ర లేచి సాగనంపింది. ఆ రోజు ఉదయం పావ్‌ బాజీ చేసి తినిపించింది. ఆమె చేతుల మీదగా తిన్న చివరి ఫుడ్‌ అదే. తను వెళ్లిపోయాక డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని భోంచేస్తుంటే ఏదో వెలితి. ఆమె కూర్చునే కుర్చీ ఖాళీగా కనిపిస్తుంటే ఏదో బాధ. ప్రతిరోజూ ఆ కుర్చీని చూస్తున్నా. వద్దంటున్నా కొసరి కొసరి వడ్డించేది. ఆ జ్నాపకాలు వెంటాడుతున్నాయి. ఇప్పట్లో తేరుకోవడం అంటే కష్టమే. కానీ కచ్చితంగా ఓవర్‌ కమ్‌ అవ్వాలి. అది అంత సులభం కాదని తెలుసు’’ అని రాజు అన్నాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News