డైరెక్టర్ దశరథ్ అప్పుడు చాలా భయపడిపోయాడట!

Update: 2021-05-31 08:30 GMT
దర్శకుడు దశరథ్ తెరకెక్కించిన చిత్రాలలో 'సంతోషం ఒకటి. నాగార్జున - శ్రియ జంటగా నటించిన ఈ సినిమా, 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా స్క్రీన్ ప్లేలో త్రివిక్రమ్ పాలుపంచుకున్నారు. కథాకథనాల పరంగా .. ఆర్పీ పట్నాయక్ అందించిన సంగీతం పరంగా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. వసూళ్లపరంగా కొత్త రికార్డులను సృష్టించిన ఈ సినిమా, నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

అలాంటి ఈ సినిమాకి నిర్మాతగా కె.ఎల్.నారాయణ వ్యవహరించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాను గురించి ప్రస్తావించారు. 'సంతోషం' సినిమాను నేను దశరథ్ దర్శకత్వంలో నిర్మించాను. ఆయనకి అదే మొదటి సినిమా. ఆయనను వెంటబెట్టుకుని నాగార్జునగారి దగ్గరికి తీసుకెళితే లైన్ చెప్పాడు. కథ విన్న తరువాత మీరే డైరెక్ట్ చేయవచ్చుగదా అని ఆయనతో నాగార్జున అన్నారు .. నేను కూడా అదే అన్నాను. అంతే .. ఆ తరువాత దశరథ్ నాకు వారం రోజులపాటు కనిపించలేదు.

ఆ తరువాత నెమ్మదిగా ఓ రోజున నా దగ్గరికి వచ్చాడు .. "ఏంటయ్యా కనిపించకుండా వెళ్లిపోయావ్" అని అడిగితే, "సార్ నాకు భయమేసింది .. నేను ఎప్పుడూ ఎక్కడా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేయలేదు. నన్నే డైరెక్ట్ చేయమనేసరికి ఏం చేయాలో నాకు తోచలేదు. ఈ విషయాన్ని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకుని మళ్లీ మీ దగ్గరికి రావడానికి నాకు ఇంత సమయం పట్టింది" అన్నాడు. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ అందించిన సహాయ సహకారాలను కూడా నేను ఎప్పుడూ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు.    
Tags:    

Similar News