‘తొలి ప్రేమ’ లాంటి సెన్సేషనల్ హిట్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కరుణాకరన్. కానీ ఆ సినిమాకు దీటైన సినిమా తర్వాత ఒక్కటి కూడా తీయలేకపోయాడు. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’.. ‘డార్లింగ్’ లాంటి హిట్లున్నా కూడా అవి ‘తొలి ప్రేమ’కు సాటి వచ్చేవి కావు. ఐతే ఆ తర్వాత కనీసం ఈ స్థాయిలో కూడా సినిమాలు తీయలేకపోయాడు కరుణాకరన్. తీసిన సినిమాలే ఇటు తిప్పి అటు తిప్పి తీస్తున్నాడని.. కొత్తగా ఏమీ చేయలేకపోతున్నాడని విమర్శలు వ్యక్తమయ్యాయి అతడిపై. కరుణాకరన్ నుంచి వచ్చిన కొత్త సినిమా ‘తేజ్ ఐ లవ్యూ’ చూసిన వాళ్లు కూడా దీన్ని కరుణాకరన్ గత సినిమాలతో పోలుస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన కరుణాకరన్ కు మీడియా నుంచి ఇలాంటి ఓ ప్రశ్న ఎదురైంది.
ఈ సినిమా క్లైమాక్సును ఎయిర్ పోర్టులో తీయడాన్ని ప్రస్తావిస్తూ ‘తొలి ప్రేమ’కు ఇది అనుకరణా అని ప్రశ్నించాడు ఓ విలేకరి. ఈ ప్రశ్నతో కరుణాకరన్ కు కోపం వచ్చేసింది. ‘తొలి ప్రేమ’లో ఎయిర్ పోర్ట్ సీన్ తీస్తే మళ్లీ తీయకూడదా అంటూ ఆగ్రహంగా స్పందించాడుకరుణాకరన్. ‘తొలి ప్రేమ’లో నేపథ్యం వేరని.. ఇక్కడి నేపథ్యం వేరని అతను చెప్పాడు. అందులో హీరో హీరోయిన్లు ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకోరని.. కానీ ఇక్కడ చెప్పుకుంటారని.. ఈ రెండు కథల్లోనూ వైరుధ్యం ఉందని కరుణాకర్ తెలిపాడు. ఈ సినిమా గురించి ఎవరేం రాసినా.. ప్రేక్షకుల నుంచి మాత్రం అద్భుతమైన స్పందన వస్తోందని.. అంతిమంగా ప్రేక్షకుల ఈలలే ముఖ్యమని కరుణాకరన్ అన్నాడు. తాను మళ్లీ ‘తొలి ప్రేమ’ లాంటి సినిమా తీయలేకపోవడంపై స్పందిస్తూ.. ఒక విద్యార్థి పదో తరగతిలో డిస్టింక్షన్ సాధిస్తాడని.. మళ్లీ అతడి నుంచి ప్రతిసారీ అదే ఫలితం ఆశిస్తున్నారని చమత్కరించాడు కరుణాకరన్.