మెగా హీరో కోసం 21కోట్లు పెట్టాడు

Update: 2015-09-04 07:25 GMT
మెగా హీరో వ‌రుణ్‌ తేజ్ న‌టించిన కంచె రిలీజ్‌ కి రెడీ అవుతోంది. గ‌మ్యం ఫేం క్రిష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రెండో ప్ర‌పంచ యుద్ధం నాటి ప‌రిస్థితుల్ని, అప్ప‌టి ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ని ఈ సినిమాలో చూపిస్తున్నాడు క్రిష్‌. అయితే ఆ నాటి వాతావ‌ర‌ణం తెర‌పై క‌నిపించేలా చేయాలంటే అంత సులువేం కాదు. దీనికో్సం ఏకంగా జార్జియా లోని మిల‌ట‌రీ బేస్ క్యాంపుల వ‌ర‌కూ వెళ్లి అక్క‌డ సినిమా షూటింగ్ చేశాడు. అయితే ఇంత సాహ‌సం చేశారు క‌దా.. ఖ‌ర్చు ఎంత అయ్యింది? అన్న ప్ర‌శ్న‌కు క్రిష్ ఏం చెప్పారంటే..

క‌థ డిమాండ్ మేర‌కు లిమిటేష‌న్స్ లేకుండా ఖ‌ర్చు చేశాం. లెక్క‌లు వేసుకుంటే అయ్యే ప‌ని కాదు.  ఈ సినిమాకి 21 కోట్ల బ‌డ్జెట్ ఖర్చ‌య్యింది. అంతా నా పెట్టుబ‌డే అని క్రిష్ చెప్పారు. అస‌లు ఆ క్యారెక్ట‌ర్‌ కి వ‌రుణ్‌ తేజ్‌ నే ఎందుకు ఎంచుకున్నారు? అన్న ప్ర‌శ్న‌కు .. అత‌డి లుక్‌. రెండో ప్ర‌పంచ యుద్ధంలో ఓ సోల్జ‌ర్ అత‌డిలో క‌నిపించాడు. అత‌డి అమాయ‌క‌మైన లుక్ ఆక‌ట్టుకుంది. వ‌రుణ్‌ తేజ్ క‌ళ్లు అంటే నాకు చాలా ఇష్టం. పైగా కాలేజ్ విద్యార్థిలా క‌నిపించాలి. అందుకే అత‌డిని ఎంచుకున్నా. క‌థ కు స‌రిపోయే హీరో అనిపించి సెలెక్ట్ చేసుకున్నా అన్నారు.

అస‌లు సినిమా క‌థేంటి? అన్న ప్ర‌శ్న‌కు 1945లో రెండో ప్ర‌పంచ యుద్ధం ముగిసింది. అప్ప‌టికి దేశాల మ‌ధ్య యుద్ధాలు, స‌రిహ‌ద్దుల ద‌గ్గ‌ర భ‌యాన‌క వాతావ‌ర‌ణం ఉంది. అంతేకాదు మ‌నుషుల హృద‌యాల్లోనూ ముక్క చెక్క‌లైన ప‌రిస్థితి. వాట‌న్నిటినీ సినిమాగా చూపించే ప్ర‌య‌త్నం చేశాను. అంద‌మైన ప్రేమ‌క‌థ , అదీ యుద్ధ వాతావ‌ర‌ణంలో ప్రేమ‌క‌థ‌ని చూపించాల‌నుకున్నా... అని క్రిష్ వివ‌రించారు.
Tags:    

Similar News