రివ్యూయర్లకు మారుతి పంచ్ వేశాడుగా..

Update: 2018-05-10 11:57 GMT
సినీ పరిశ్రమకు.. మీడియాకు గట్టిగా వార్ నడుస్తున్న సమయమిది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల వల్ల మునుపెన్నడూ లేని ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ రెండు వర్గాల మధ్య. ఇంతకుముందు మీడియాతో ఎందుకు అనుకున్న వాళ్లు కూడా ఇప్పుడు విమర్శలు గుప్పించడానికి వెనుకాడట్లేదు. టోటల్ మీడియాను కాకుండా.. సినిమాలపై సమీక్షలు రాసే వాళ్లను టార్గెట్ చేయడం కూడా కొంత కాలంగా జరుగుతోంది. అల్లు అర్జున్.. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లు సమీక్షకులపై గతంలో విమర్శలు చేశారు. తాజాగా అల్లు అర్జున్ సమక్షంలో అతడికి సన్నిహితుడైన డైరెక్టర్ మారుతి రివ్యూయర్లపై సెటైర్లు వేశాడు. బన్నీ కొత్త సినిమా ‘నా పేరు సూర్య’ ప్రమోషన్లలో భాగంగా బన్నీ-వక్కంతం వంశీ కలిసి కొందరు దర్శకులతో చర్చా కార్యక్రమానికి వచ్చారు.

ఇందులో భాగంగా మారుతి మాట్లాడుతూ.. తాను ‘నా పేరు సూర్య’ సినిమాను రెండుసార్లు చూశానన్నాడు. ఒకసారి మామూలుగా తొలి రోజు ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్‌ లో 8.45 షో చూశానన్నాడు. ఇంకోసారి సినీ మ్యాక్స్‌ లో రెండు రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి షో చూశానన్నాడు. ఐతే ఐమాక్స్ లో తొలి రోజు చూసిన షోతో జెన్యూన్ టాక్ తెలియలేదన్నాడు. ఇందుకు కారణం రివ్యూయర్లే అని చెప్పాడు. రివ్యూయర్లను జడ్జిలుగా పేర్కొన్న మారుతి.. ఆ షోకు ఎక్కువమంది వాళ్లే ప్యాడ్లు పట్టుకుని వస్తారన్నాడు. ప్రతి సీన్ గురించి చకచకా రాసేస్తుంటారని.. ఇది బాగుంది.. ఇది బాగా లేదు అంటూ అక్కడే రివ్యూ చేసేస్తారని మారుతి చెప్పాడు. దాని వల్ల ఒరిజినల్ టాక్ తెలియదన్నాడు. కానీ రెండు రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్తే ఒరిజినల్ టాక్ తెలిసిందని.. పిల్లలు ఈ చిత్రాన్ని చాలా ఇష్టపడ్డారని అన్నాడు మారుతి. అంతా ఓకే కానీ.. రివ్యూయర్లు తమ బాధ్యత మేరకు తమ పనేదో తాము చేసుకుంటున్నపుడు మారుతికి దాంతో సంబంధం ఏముంది? తన పాటికి తాను సినిమా చూసి తన జడ్జిమెంటేదో తాను ఇవ్వొచ్చుగా. అయినా థియేటర్ 500-600 మంది రివ్యూయర్లే ఉండరు కదా. మరి మారుతి ఎందుకంత ప్రభావితం అవుతున్నట్లో!
Tags:    

Similar News