తెలుగులో ఇలాంటి సినిమానా అన్నారట

Update: 2018-02-02 02:30 GMT
దర్శకుడిగా తన తొలి సినిమాకు నాని లాంటి నిర్మాత.. పెద్ద స్థాయి నటీనటులు దొరకడం తన అదృష్టం అంటున్నాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. నాని గురించి తాను ఎంత చెప్పినా తక్కువే అని.. తానేదో తక్కువ బడ్జెట్లో చిన్న స్థాయిలో ‘అ’ సినిమాను చేసుకుందాం అనుకుంటే.. నాని దాన్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లిపోయాడని అతనన్నాడు. నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడని.. ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు చెబితే.. చాలా భయపెట్టేశారని.. నాని చాలా ఇన్వాల్వ్ అయిపోతాడని.. ఇబ్బంది పెట్టేస్తాడని అన్నారని.. కానీ అతను అలా ఏమీ చేయలేదని చెప్పాడు.

నిర్మాణాత్మకమైన సలహాలు.. మార్పులు చెప్పాడే తప్ప ఇంకే రకంగానూ జోక్యం చేసుకోలేదని ప్రశాంత్ తెలిపాడు. తాను చెప్పిన బడ్జెట్లో ‘అ’ సినిమా పూర్తి కాలేదని.. ఎక్కువ ఖర్చయిందని.. ఆ ఎక్కువ ఎంత అన్నది కూడా తనకు తెలియదని.. నాని ఏమాత్రం రాజీ లేకుండా సినిమాను నిర్మించాడని అతనన్నాడు. ఇక ఈ సినిమా కథను సీనియర్ నటి రోహిణికి చెప్పినపుడు.. తెలుగులో ఇలాంటి సినిమా తీస్తున్నారా అని ఆశ్చర్యపోయినట్లు అతను తెలిపాడు. కాజల్ అగర్వాల్ కూడా ఇలాగే ఆశ్చర్యపోయిందని.. ఈ చిత్రాన్ని హిందీలో చేయమని చెప్పిందని ప్రశాంత్ వెల్లడించాడు. ఐతే తాను తెలుగులోనే చేయాలనుకున్నానని.. నాని వల్లే ఈ సినిమా సాధ్యమైందని ప్రశాంత్ తెలిపాడు. తాను ఈ సినిమా కథను నటీనటులకు కూడా చెప్పలేదని అతను వెల్లడించడం విశేషం.
Tags:    

Similar News