186 సెక‌న్ల డైలాగుతో బ‌ర్నింగ్ స్టార్ ఇర‌గ‌దీశాడ‌ట‌!

Update: 2018-10-22 10:03 GMT
అంద‌రూ రూల్స్ బ్రేక్ చేయ‌టం సాధ్యం కాదు. కానీ.. కొంద‌రుంటారు వారికి రూల్స్ లాంటివి అస్స‌లు ఉండ‌వు. చెల‌రేగిపోతారు. లేక‌పోతే.. టాలీవుడ్లో హీరోల‌న్న మాట‌కు  క‌నిపించే రూపానికి భిన్నంగా.. ఇత‌డు హీరోనా?  కామెడీ చేస్తున్నారా? అంటూ సీరియ‌స్ అయ్యే రూపానికి పేరు పెడితే సంపూర్ణేష్ బాబుగా చెప్పాలి. బ‌ర్నింగ్ స్టార్ ఇమేజ్ తో తెలుగు తెర మీద సంచ‌ల‌నం సృష్టించిన సంపూర్ణేష్ తాజాగా న‌టించిన చిత్రం కొబ్బ‌రిమ‌ట్ట‌.

సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఇంట‌ర్వెల్ బ్యాంగ్ గా ఏదైనా పాయింట్ ఉంటే బాగుంటుంద‌ని ఆలోచించిన ద‌ర్శ‌కుడు సాయి రాజేశ్‌.. ర‌చ‌యిత ర‌ఘురామ్ శ్రీ‌పాద సాయంతో ఒక  భారీ డైలాగును సిద్ధం చేశార‌ట‌.

ఎనిమిది గంట‌ల పాటు కుస్తీ ప‌డి.. శ‌బ్ద‌ర‌త్నార‌కాన్ని మ‌థించి మ‌రీ డైలాగు రాశార‌ట‌. రాసినోళ్లకే దాన్ని ప‌ల‌క‌టం చేత‌కాలేద‌ట‌. దాన్ని సంపూకి పంపితే త‌న వ‌ల్ల కాలేద‌న్నాడ‌ట‌. దీంతో సాయి రాజేశ్ కు కోపం వ‌చ్చి మాట్లాడ‌టం మానేశాడ‌ట‌. రెండు రోజుల త‌ర్వాత ఉద‌యాన్నే వాట్సాప్ లో వీడియో మెసేజ్ వ‌చ్చింద‌ని.. అది చూస్తే.. తాము పంపిన సుదీర్ఘ డైలాగును ఊపిరి తీసుకోకుండా సంపూ చెప్పిన తీరుతో షాక్ త‌గిలిన‌ట్లైంద‌ని పేర్కొన్నాడు.

దాదాపు మూడు నిమిషాల ఆరు సెక‌న్లు.. అంటే 186 సెక‌న్ల ఉండే ఈ డైలాగును సంపూ చెబుతుంటే.. ఎక్క‌డ హృద‌య కాలేయం? ఎక్క‌డ కొబ్బ‌రిమ‌ట్ట‌ సంపూ..? అన్న భావ‌న క‌లిగింద‌ట‌. ఈ డైలాగు రాసిన ర‌ఘురామ్ శ్రీ‌పాద‌కు థ్యాంక్స్ చెప్పిన ద‌ర్శ‌కుడు.. సంపూ టాలెంట్‌ను తెగ పొగిడేస్తున్నాడు. ఈ డైలాగు త‌ర్వాత సంపూను మీరు సంపూర్ణంగా ప్రేమిస్తార‌ని అంటున్నాడు ద‌ర్శ‌కుడు. మ‌రీ సుదీర్ఘ  డైలాగు వెండితెర మీద ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా విడుద‌ల‌య్యే వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News