విలుకాడికి సిక్స్ ప్యాక్ అవసరమా అన్నారు: 'లక్ష్య' డైరెక్టర్

Update: 2021-12-01 17:30 GMT
యువ కథానాయకులలో నాగశౌర్య ఇప్పుడు తన దూకుడు చుపిస్తున్నాడు. వరుస సినిమాలను పట్టాలెక్కించి ఆయన, అదే ఆర్డర్లో ఇప్పుడు వాటిని థియేటర్లకు తీసుకుని వస్తున్నాడు. ఇటీవలే 'వరుడు కావలెను' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, పెద్దగా గ్యాప్ లేకుండానే 'లక్ష్య' సినిమాను థియేటర్లకు తీసుకుని వస్తున్నాడు. నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమాతో, దర్శకుడిగా సంతోష్ పరిచయమవుతున్నాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

ఈ వేదికపై దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ .. "ప్రాచీన కాలంలో ఎన్నో విద్యలు ఉన్నాయి .. వాటిలో విలువిద్య ఒకటి. ఈ  క్రీడా నేపథ్యంలో నేను కథ రాసుకున్నప్పుడు నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాను నూటికి నూరు శాతం వరకూ శౌర్య గారు తీసుకుని వెళ్లాడు. ఆయన లేకపోతే ఈ సినిమానే లేదు. ఈ సినిమాను ఆయన మరో స్థాయికి తీసుకుని వెళ్లారు. నిర్మాణ విలువల పరంగా నిర్మాతలు నాకు ఒక అద్భుతాన్ని ఇస్తే, పార్థు పాత్రలో నాగశౌర్య పరకాయ ప్రవేశం చేశాడు.

నన్ను చాలామంది అడిగారు .. ఒక విలుకాడికి సిక్స్ ప్యాక్ అవసరమా? అని. విలుకాడు బాడీ కూడా ఒక విల్లు మాదిరిగానే ఉండాలి. అందుకోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. కేతిక శర్మ ఈ సినిమాలో 'రితిక' అనే పాత్రను పోషించింది. హీరోకి సపోర్టివ్ గా ఉండే పాత్రను తను చాలా బాగా చేసింది. 'వాడు నిన్ను తప్పించి గెలవాలని అనుకున్నాడు .. నువ్వు తప్పుచేసి గెలవాలని అనుకున్నావు' అనే సీన్లో ఆమె చాలా అద్భుతంగా చేసింది. జగపతిబాబుగారు .. సచిన్ ఖేడేకర్ గారు నుంచి ప్రతి ఒక్కరూ తమకి ఇచ్చిన పాత్రలను గొప్పగా చేశారు.

ఈ సినిమాకి కాలభైరవగారు చాలా మంచి సంగీతం ఇచ్చారు. అప్పుడప్పుడు నేను కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ, ఆయన  చాలా ఓపికతో చేశారు. అందుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. టెక్నీషియన్స్ అంతా కూడా ఎంతో అంకితభావంతో పనిచేసి, ఆశించినస్థాయిలో అవుట్ పుట్ వచ్చేలా చూశారు. ఈ సినిమా మా అందరిలో రెండున్నరేళ్ల కష్టం. వాళ్లందరి గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతాను" అంటూ చెప్పుకొచ్చారు.  
Tags:    

Similar News