ఇండ‌స్ర్టీ పెద్ద దిక్కుపై తేజ మార్క్ పంచ్!

Update: 2022-01-09 07:30 GMT
టాలీవుడ్ కి  ఇప్పుడు బాస్ ఎవరో తేల‌డం లేదు. `పెద్ద దిక్కు` అన్న టాపిక్ కొన్ని నెల‌లుగా చ‌ర్చ‌నీయాశంగా మారిన సంగ‌తి  తెలిసిందే. కెప్టెన్ కుర్చీ కోసం ప‌లువురు సీనియ‌ర్ హీరోలు రేసులో ఉన్న‌ట్లు మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. ఎవ‌రికి వారే బాస్ గా ఫీలైపోతున్న‌ట్లు తెర‌పైకి వ‌చ్చింది. ద‌ర్శ‌క‌త‌ర్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు త‌ర్వాత ఆ స్థానం మెగాస్టార్ చిరంజీవికే ద‌క్కుతుంద‌ని.. అంత‌టి గొప్ప స్థానం.. స్థాయి ఆయ‌న‌కి మాత్ర‌మే ఉన్నాయ‌ని కొంత మంది బాహాటంగా ప్ర‌క‌టిస్తున్నా.. మెగాస్టార్ ఫ్యామిలీ అలాంటి ప‌ద‌వులు త‌మ‌కు వ‌ద్ద‌ని అంతే విన‌యంగా తిర‌స్క‌రించింది.

ఈ విష‌యంపై  మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు క్లారిటీ ఇవ్వ‌గా...పెద రాయుడు పోస్ట్ త‌నికి వ‌ద్ద‌ని.. కానీ క‌ష్టం స‌మ‌స్యతో వ‌స్తే.. త‌న దృష్టికి తెస్తే క‌చ్చితంగా అక్క‌డ ఉంటాన‌ని చిరంజీవి వెల్ల‌డించారు. ఇక  క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు పెద్ద‌రాయుడు పాత్ర పో షించ‌డానికి సిద్ధంగా ఉన్నారంటూ మీడియాలో పంచింగ్ క‌థ‌నాలు అంతే హీటెక్కించాయి. విష్ణు..న‌రేష్..మోహ‌న్ బాబు వ్యాఖ్య‌ల ద్వారా ఆ ప‌ద‌వి పై ఆస‌క్తి క‌న‌బ‌రిచిన‌ట్లు క‌నిపించిందని కొన్ని మీడియాలు ఉటంకించాయి. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు కూడా ప‌రిశ్ర‌మ గుర్తించి ఇవ్వాలి త‌ప‌న్ప‌.. ఎవ‌రికి వారు అనేసుకుంటే అయిపోతుందా? అయినా ప‌ద‌వి అన్న‌ది ముళ్ల కిరీటం లాంటింద‌ని త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చారు.

తాజాగా ఇదే అంశంపై  ద‌ర్శ‌కుడు తేజ త‌న‌దైన శైలిలో స్పందించారు. ``దాస‌రి లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. క‌రోనా స‌మ‌యంలో ఆయ‌న ఉంటే  కొన్ని స‌మ‌స్య‌ల‌కు త్వ‌రగా ప‌రిష్కారం దొరికేది. ఆయ‌న సూప‌ర్....సింహం లాంటోడు. రాయ‌ల్ గా ఉంటారు. గ్రేట్ ప‌ర్స‌నాల్టీ. దాస‌రి ద‌గ్గ‌ర లైట్ బోయ్ కూడా వెళ్లి సర్ నాకు ఇలా జ‌రిగింద‌ని చెప్ప‌గ‌లిగే అంత చ‌నువు ఉంటుంది. ఏదైనా సమ‌స్య ఉంద‌ని చెబితే చిట్టీ పైకి వెళ్లేది..వెంట‌నే ఆయ‌న పై నుంచి కింద‌కు దిగొచ్చి ఎంట్రా ఇది అని మాట్లాడేవారు. చూడ‌గానే కాళ్ల మీద ప‌డాల‌నిపించేది.  పెద్ద మ‌నిషి త‌ర‌హా తీరు ఆక‌ట్టుకునేది.

సీఎంతో..పీఎంలతో..మంత్రుల‌తో అంద‌రితోనూ సింహంలా దాస‌రి ఫోన్లోనే  మాట్లాడేవారు.  అలాంటి వాళ్లు పుట్టాలి. మ‌ధ్య‌లో రాదు. నేను వెళ్లి  ఫ‌లానా ఆయ‌న వ‌స్తే బాగుండు ? అని నేను అనుకోవ‌డం కాదు.  ఇండ‌స్ట్రీ అంతా అంగీక‌రించాలి.  ఎన్టీఆర్..ఎస్వీఆర్ షూటింగ్ ల‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇండ‌స్ట్రీని  చూస్తున్నా.  ఎవ‌రున్నా?  లేక‌పోయినా  ఇండ‌స్ట్రీ న‌డిచిపోతుంది. ఇది ప‌ర్మినెంట్. నాలాంటి వాళ్లు వ‌స్తుంటారు. పోతుంటారు. ప‌రిశ్ర‌మ మాత్రం రూపం మార్చుకుని ముందుకు వెళ్తూనే ఉంటుంది. మ‌ధ్య‌లో  కొంత మంది వ‌చ్చి నా వ‌ల్లే ఇండ‌స్ట్రీ న‌డుస్తోంద‌ని హ‌డావుడి చేసే వాళ్లు చాలా మందే ఉంటారు. ఎన్టీఆర్..ఏఎన్నార్.. సావిత్రి ఎవ‌రు పోయినా ప‌రిశ్ర‌మ మాత్రం న‌డుస్తూనే ఉంది. అంత‌క‌న్నా గొప్ప న‌టులు గానీ..ద‌ర్శ‌కుల గానీ  ఇప్పుడు ఎవ‌రూ లేరు. ఉన్న గొప్పవాళ్లు ఎవ‌రంటే విశ్వ‌నాధ్ గారు..రాఘ‌వేంద్ర‌రావు గారు...వీరంతా సూప‌ర్ డైరెక్ట‌ర్లు`` అని అన్నారు. తేజ తెలివిగా మాట్లాడారు. ఎక్క‌డా చిరంజీవి పేరును కానీ మోహ‌న్ బాబు .. ముర‌ళీ మోహ‌న్ వంటి ప్ర‌ముఖ పెద్ద‌ల పేర్ల‌ను ప్ర‌స్థావించ‌లేదు సుమీ! పంచ్ లు వేయ‌డంలో ఆర్జీవీది ఒక శైలి అనుకుంటే ఆయ‌న శిష్యుడే అయిన తేజ‌ది ఇంకో త‌ర‌హా అని ఇప్పుడు అర్థ‌మ‌వుతోంది.
Tags:    

Similar News