తేజ ఆ ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టేశాడా?

Update: 2022-10-03 23:30 GMT
డి. సురేష్ బాబు త‌న‌యుడు, రానా సోద‌రుడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ తెర‌కెక్కిస్తున్న ప్రేమ‌క‌థ చిత్రం 'అహింస‌'. అనంది ఆర్ట్స్ బ్యాన‌ర్ పై జెమిని కిర‌ణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ ఈ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవుతోంది. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో ర‌జ‌త్ బేడీ, బిందు చంద్ర‌మౌళి, స‌మీర్ గోస్వామి త‌దిత‌రులు న‌టిస్తున్నాయి. మ‌ధ్యప్ర‌దేశ్ లోని మూరుమూల ప్రాంతాల్లో షూటింగ్ చేశారు.

షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుక తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు తేజ ప్లాన్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ తో చేసిన 'సీత‌' మూవీతో భారీ ఫ్లాప్ ని సొంతం చేసుకున్న తేజ 'అహింస‌'తో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ కావాల‌నే ప్ర‌య‌త్నాల్లో వున్నారు. ఫైన‌ల్ అవుట్ పుట్ పై గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్న తేజ ఎలాగైనా ఈ మూవీతో స‌క్సెస్ ని త‌న ఖాతాలో వేసుకుంటాన‌ని చెబుతున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత తేజ హీరో రానాతో ఓ భారీ మూవీకి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో రానా హీరోగా 'నేనే రాజు నేనే మంత్రి' మూవీతో సూప‌ర్ హిట్ ని సొంతం చేసుక‌ని మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ఈ సారి అదే పంథాలో రానాతో మ‌రో సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకోవాల‌నే ఆలోచ‌న‌ల్లో వున్నార‌ట‌. ఈ ప్రాజెక్ట్ ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి. సురేష్ బాబు నిర్మించ‌నున్నార‌ని తెలిసింది.

రీసెంట్ గా ఫైన‌ల్ స్క్రిప్ట్ ని తేజ నిర్మాత సురేష్ బాబుకు వినిపించార‌ట‌. న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని తెలిసింది. గ‌తంలో రానా హీరోగా 'రాక్ష‌స రాజు రావ‌ణాసురుడు' పేరుతో తేజ ఓ మూవీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో ఈ ప్రాజెక్ట్ ని చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ అది కార్య‌రూపం దాల్చ‌లేదు. తాజాగా ఆ ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టి తేజ కొత్త క‌థ‌తో రానా హీరోగా సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నార‌ట‌. 'అహింస‌' రిలీజ్ త‌రువాతే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని స‌మాచారం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News