తాగ‌ను..తిన‌ను..కాల్చ‌ను నాకెందుకు పార్టీ!

Update: 2022-05-28 23:30 GMT
డ్యాషింగ్ డైరెక్ట‌ర్ తేజ నైజం గురించి తెలిసిందే. ముక్కుసూటి మ‌న‌స్త‌త్వం గ‌ల‌వారు. పైకి ఒక‌లా..లోప‌ల మ‌రోలా ఉండే టైపు కాదు. మ‌న‌సులో ఏమ‌నుకుంటే దాన్ని నిర్మొహ‌మాటంగా బ‌య‌ట పెడ‌తారు. వాడు ఏదో అనుకుంటాడు?  వీడు ఇంకెదో అనుకుంటాడు?   అలా కెలికించుకోవ‌డం ఎందుకు? అన్న టైప్ కాదు. ఒక‌రిపై విమ‌ర్శ‌లు చేయ‌రు. త‌న‌పై విమర్శ‌లొచ్చే లా ప్ర‌వ‌ర్తించ‌రు.

అన‌వ‌స‌రంగా మీడియాలో అస్స‌లు క‌నిపించ‌రు. త‌న సినిమాకి సంబంధించి   ఏదైనా ప్ర‌మోష‌న్ ఈవెంట్ ఉంటే త‌ప్ప‌! ఇంకెప్పుడు  తేజ మీడియా మైక్ ముందు కూడా క‌నిపించ‌రు. వ్య‌క్తిగ‌త ఇంట‌ర్వ్యూలు వంటివి కూడా చాలా అరుదుగానే ఇస్తుంటారు. ఆ ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తి కూడా బాగా త‌న‌కి తెలిసిన‌వారు అయితేనే ఫ్రీగా మాట్లాడ‌గ‌లన‌ని...లేక‌పోతే ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌లేని చెప్పేస్తారు.

తేజ లో ఈ క్వాలిటీ ఆయ‌న ఫిలిం ఇండ‌స్ర్టీకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నేటికి అలాగే ఉంది. విజ‌యాలు వ‌చ్చిన‌ప్పుడు ఒక‌లా...ప‌రాజ‌యాలు ఎదురైన‌ప్పుడు మ‌రోలా రియాక్ట్ అవ్వ‌డం ఎప్పుడూ చూడలేదు. అత‌నికి రెండు స‌మాన‌మే అన్న ధోర‌ణే క‌నిపిస్తుంది.   తేజ‌లోని  కొన్ని ల‌క్ష‌ణాలు  త‌న గురువు రాంగోపాల్ వ‌ర్మ‌కి ద‌గ్గ‌ర‌గాను ఉంటాయి అనిపిస్తుంది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తేజకి ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. ఇండ‌స్ర్టీ క‌ల్చ‌ర్ కి ఎందుకు దూరంగా ఉంటారు?  సినిమా ఫంక్ష‌న్స్ లో  క‌నిపించ‌రు?  స‌క్సెస్ పార్టీల‌కు హాజ‌ర‌వ్వ‌రు?  ఇవ‌న్నీ మీ క్యారెక్ట‌ర్ లో భాగ‌మా?  లేక మీ పొగ‌ర్లో భాగ‌మా? అంటూ సూటి ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. దీనికి తేజ కూడా అంతే సూటిగా స‌మాధానం ఇచ్చారు.

"పార్టీకి వెళ్తే బోర్ కొడుతుంది. నేను తాగ‌ను..సిగ‌రెట్టు కాల్చ‌ను. స‌రిగ్గా తిన‌ను. మీర అంత ఫుడ్డీ కాదు. అమ్మాయిలు కోసం వెళ్లాల‌నిపించ‌దు. సినిమా అంటేనే ఇంట్రెస్ట్. పార్టీకి వెళ్లినా..సినిమా ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా వీట‌న్నింటికి మించి మ‌రో పెద్ద స‌మ‌స్య ఉందండోయ్. ఆహ్వానించిన వారికి అక్క‌డ భ‌జ‌న చేయాలి. మ‌న‌కి ఇష్టం లేక‌పోయినా న‌వ్వాలి. ఆయ‌న గ్రేట్..ఈయ‌న గ్రేట్ అంటూ  పొగ‌డాలి.

వాళ్లు ఎవరో మ‌న‌కి పూర్తిగా తెలియ‌క‌పోయినా అలా మాట్లాడాల్సి వ‌స్తుంది. మ‌న‌ది కాదు అన్న దానికి వెళ్తే.. ఇవ‌న్నీ చేయాలి. అవ‌స‌ర‌మా మ‌న‌కిదంతా?   నాప‌ని నేను చేసుకుంటా...నా తంటాలు నావి.  ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి నా గోల నాదిగానే ఉంటాను" అని అన్నారు. దీంతో తేజ వ్యాఖ్య‌లు  నెట్టింట వైర‌ల్ గా మారాయి.  నెటి జ‌నులు సెటైర్లు గుప్పిస్తున్నారు.

నువ్వు ఇలా ఉన్నావ్ కాబ‌ట్టే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఎవ‌రూ  సినిమా ఫంక్ష‌న్ల‌కు పిల‌వ‌రు. నీ మాట‌లు వింటుంటే జూనియ‌ర్ ఆర్జీవీలా త‌యారాయ్యావ్ అనిపిస్తుంద‌ని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. తేజ‌కి యాటిట్యూడ్ ఎక్కువ‌..త‌న‌కు తానే గొప్ప అనే ఫీలింగ్ లో ఉంటాడు? అందుకే వెనుక‌బ‌డి ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.  


ఇక తేజ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం 'అహింస' అనే సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించి నెల‌లు గ‌డుస్తుంది. కానీ మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. దాదాపు  మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత చేస్తోన్న చిత్ర‌మిది. ఆయ‌న చివ‌రిగా నిర్మాత బెల్లంకొండ త‌న‌యుడు సాయి శ్రీనివాస్ హీరోగా 'సీత' చిత్రాన్ని తెర‌కెక్కించారు.

కానీ ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని సాధించ‌లేదు. ఆ త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈలోపు క‌రోనా రావ‌డంతో  కొత్త ప్రాజెక్ట్ మ‌రింత ఆల‌స్య‌మైంది.  మ‌రి అహింస ఎంత వ‌ర‌కూ వ‌చ్చింద‌న్న‌ది ఆయ‌న క్లారిటీ ఇస్తే గాని సంగ‌తేంటి? అన్న‌ది తేల‌దు.

Full View

Tags:    

Similar News