ఫస్టాఫ్ ఫాస్టుగా తీయడం నాకు తెలియదా?: వివేక్ ఆత్రేయ

Update: 2022-06-13 14:35 GMT
వివేక్ ఆత్రేయ కథలు .. ఆయన టైటిల్స్ విభిన్నంగా ఉంటాయి. ఆయన స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ఆయన సినిమాలు .. అందులోని మలుపులు సామాన్య ప్రేక్షకులకు చాలా తేలికగా అర్థమవుతాయి. 'బ్రోచేవారెవరురా' సినిమా ఆ విషయాన్ని నిరూపిస్తుంది.

ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి 'అంటే .. సుందరానికీ' వచ్చింది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. సాధారణంగా ఇలాంటి టైటిల్స్ ఈవీవీ పెట్టేవారు. అలా టైటిల్ తోనే ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసింది. ఇక నాని లుక్ కూడా ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఫస్టాఫ్  కాస్త సాగదీసినట్టుగా అనిపించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా టీమ్ 'ఎంజాయ్ మెంట్ సెలబ్రేషన్స్' ను నిర్వహించింది. ఈ స్టేజ్ పై వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ .. "ఈ సినిమా సక్సెస్ లో సగభాగం నేను నానీగారికి .. మిగతా సగభాగం నిర్మాతలకు ఇస్తాను.

ఎందుకంటే వాళ్లు ఒప్పుకోకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఫస్టు కాపీ చూసినప్పుడే మంచి సినిమా తీశామని మేమంతా అనుకున్నాము. ఈ సినిమా ఓ పది పదిహేను రోజులు థియేటర్లో ఉండిపోయే సినిమా కాదు.  ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ ఉండిపోయే సినిమా.

ఎప్పుడు చూసినా ఈ సినిమా నచ్చుతూనే ఉంటుంది .. నవ్విస్తూనే ఉంటుంది .. అదే ఈ సినిమా ప్రత్యేకత. ఈ సినిమా చూసి ఇందులో ఏమీ లేదు కదా అనుకోవడం చాలా తేలికే. నాని ఎంతో సహజంగా నటించడం వలన మీకు అలా అనిపించింది. నిజానికి ఆయన పోషించినది చాలా కష్టతరమైన పాత్ర. అలాగే నజ్రియా గారు కూడా లీల పాత్రలో అద్భుతంగా చేశారు. అందరూ తమ పాత్రల్లో అంతగా ఒదిగిపోవడం వల్లనే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది.

ఈ సినిమా ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుందనీ .. సెకండాఫ్ ఫాస్టుగా వెళుతుందని కామెంట్స్ వినపడుతున్నాయి. సెకండాఫ్ ఫాస్టుగా తీయడం తెలిసిన నాకు ఫస్టాఫ్  తీయడం తెలియక కాదు. సెకండాఫ్ కి మీరు కనెక్ట్ కావాలంటే ఫస్టాఫ్ అలా వెళ్లాల్సిందే. ఫస్టాఫ్ ను అలాగే చూడాలి .. అలాగే ఎంజాయ్ చేయాలి. హీరో హీరోయిన్స్ ఫ్లాష్ బ్యాక్ ను మాంటేజ్ షాట్స్ లో చూపించకుండా, చిన్నప్పటి నుంచి వాళ్ల గ్రోత్ ను చూపిస్తూ రావడం వలన అలా అనిపించి ఉండొచ్చు. ఆ నిడివిని తగ్గించే ఆలోచన లేదు" అంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News