సూపర్ స్టార్ ను నమ్మి మునిగిపోయారు

Update: 2018-12-25 01:30 GMT
కింగ్ ఖాన్.. బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ ను అభిమానులు ఇచ్చిన బిరుదులివి. ఒకప్పుడు ఆయన సినిమాలు ఆ బిరుదులకు న్యాయం చేసేవి. షారుఖ్ ఖాన్ ఒకవైపు.. మిగతా హీరోలందరూ ఒక వైపు అన్నట్లుండేది పరిస్థితి. హిందీ సినిమాలు ఆడాలంటే.. అందులో షారుఖ్ అయినా ఉండాలి లేదంటే సెక్స్ అయినా ఉండాలి అంటూ ఒకప్పుడు జోక్స్ కూడా వేసేవాళ్లు జనాలు. దీన్ని బట్టే షారుఖ్ పాపులారిటీ.. బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

కానీ గత దశాబ్దంలో మొత్తం కథ మారిపోయింది. వరుసగా రొడ్డ కొట్టుడు సినిమాలు చేసి మార్కెట్ అంతా దెబ్బ తీసుకున్నాడు షారుఖ్. ఓవైపు తన సమవుజ్జీలైన అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ల మీద బ్లాక్ బస్టర్లు కొడుతూ వసూళ్లలో కొత్త శిఖరాల్ని చూస్తుంటే.. షారుఖ్ మాత్రం కనీస స్థాయి హిట్ కూడా లేకుండా అల్లాడిపోయాడు. ఇంతకుముందులాగా రొడ్డ కొట్టుడు సినిమాలు వదిలేసి కొత్తగా ట్రై చేస్తున్నా కూడా ఫలితం ఉండట్లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘జీరో’ కూడా అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చేలా ఉంది.

షారుఖ్ ఎంతో సాహసించి మరగుజ్జు పాత్ర చేసిన సినిమా ‘జీరో’. ‘తను వెడ్స్ మను’.. ‘తను వెడ్స్ మను రిటర్న్స్’.. ‘రాన్ జానా’ లాంటి మంచి సినిమాలు తీసిన ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్ సహా అన్ని ప్రోమోలూ బాగుండటంతో బయ్యర్లు భారీ రేటు పెట్టి సినిమాను కొన్నారు. షారుఖ్ మళ్లీ తన బాక్సాఫీస్ స్టామినా చూపిస్తాడని వాళ్లు నమ్మారు. కానీ బ్యాడ్ టాక్ రావడంతో ‘జీరో’ తొలి రోజే వీక్ అయిపోయింది.

తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.60 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. వీకెండ్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. తర్వాత ఎలా ఉంటుందో చెప్పేదేముంది? ఈ చిత్రం పెట్టుబడిలో నాలుగో వంతు కూడా రాబట్టలేదు. ఫుల్ రన్లో బయ్యర్ల పెట్టుబడి సగమైనా వెనక్కి వస్తుందా అన్నది సందేహంగానే ఉంది. ‘జీరో’ను నమ్ముకుని షారుఖ్.. అతడిని నమ్ముకుని బయ్యర్లు నిలువునా మునిగినట్లే ఉన్నారు.


Tags:    

Similar News