'లింగా' కష్టాలపై సెటైరిక్‌ ఫిలిం

Update: 2015-06-28 09:39 GMT
గత ఏడాది తన పుట్టిన రోజు నాడు విడుదలైన 'లింగ' సినిమా తన కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని ఆశించారు రజినీకాంత్‌. కానీ ఆయన అనుకున్నదొక్కటి. అయ్యిందొకటి. ఓ తీపిగురుతుగా నిలుస్తుందనుకున్న ఆ సినిమా ఓ చేదుజ్ఞాపకంగా మారింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు రోడ్డుకెక్కి రజినీ, నిర్మాత కలిసి తమను మోసం చేశారని ఆరోపిస్తూ ఆందోళనలు చేసే పరిస్థితి వచ్చింది. రజినీ గతంలో తన సినిమాలకు నష్టం వచ్చినపుడు డిస్ట్రిబ్యూటర్లను సొంత డబ్బుతో ఆదుకున్నారు. మరోసారి అలాంటి ప్రయత్నమే చేశారు కానీ.. నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ సహకరించకపోవడంతో ఆయన ప్రయత్నం ఫలించలేదు.

'లింగ' సినిమా విడుదలై ఆరు నెలలు దాటుతున్నా దాని తాలూకు తలనొప్పి ఇంకా తగ్గలేదు రజినీకి. మొన్నటిదాకా రకరకాల మార్గాల్లో ఆందోళన చేసిన లింగా డిస్ట్రిబ్యూర్లు ఇప్పుడు కొత్త మార్గం ఎంచుకున్నారు. తమిళంలో మన సంపూర్ణేష్‌ తరహాలో స్పూఫ్‌ కామెడీలు చేసే పవర్‌ స్టార్‌ శ్రీనివాసన్‌ను పెట్టి 'లింగ' మీద సెటైరిక్‌ ఫిలిం తీయడానికి రెడీ అవుతున్నారు డిస్ట్రిబ్యూర్లు. లింగ బాధితుల సంఘానికి నాయకత్వం వహించిన సింగారవేలన్‌ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. మొత్తం లింగ సినిమానే స్పూఫ్‌ చేసే ప్రయత్నం జరగబోతోంది. మరి ఈ సినిమా మీద రజినీ ఫ్యాన్స్‌ ఎలా స్పందిస్తారో.. దీని మీద ఎన్ని గొడవలు జరుగుతాయో చూడాలి.

Tags:    

Similar News