'డీజే టిల్లు' ది మామూలు టైమింగ్ కాదు

Update: 2022-02-12 07:08 GMT
గ‌త కొన్ని వారాలుగా థియేట‌ర్ల‌లో బిగ్ సినిమా సంద‌డి కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌లోనూ వ‌రుస‌గా సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇందులో తెలుగు చిత్రాల‌దే అగ్ర‌స్థానం. ఈ వీకెండ్ లో విడుద‌లైన చిత్రాల్లో అత్య‌ధిక భాగం తెలుగు చిత్రాల‌దే హంగామా. ఓటీటీలో మూడు.. థియేట‌ర్ల‌లో నాలుగు సినిమాలు విడుద‌ల‌య్యాయి. అయితే ఇందులో ఏ మూవీ కూడా ప్రేక్ష‌కుల్ని ఆశించిన స్థాయిలో మెప్పించ‌లేక‌పోయింది.

అయితే ఈ వారంతంలో గురు, శుక్ర‌వారాల్లో భారీగానే సినిమాలు ఓటీటీ, థియేట‌ర్ల‌లో దండ‌యాత్ర‌కు దిగాయి. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన `ఖిలాడీ`నే భారీ చిత్రం.  ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేసిన మూవీ కావ‌డం, ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జ‌ర‌గ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీకి భారీ హైప్ క్రియేట్ అయింది. ర‌మేష్ వ‌ర్మ డైరెక్ష‌న్ లో కోనేరు స‌త్య‌నారాయ‌ణ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కానీ ఆశించిన ఫ‌లితాన్ని మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోయింది.

`క్రాక్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత వ‌స్తున్న సినిమా అంటూ హైప్ క్రియేట్ అయినా సినిమాలో ద‌మ్ములేక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద గ‌ట్టి పోటీని ఇచ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. మొత్తానికి  మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డ‌ట‌మే క‌ష్టం అంటున్నారు. ఇదే రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన `ఎఫ్ ఐ ఆర్‌` కు ప్రేక్ష‌కుల నుంచి ఎలాంటి స్పంద‌న ల‌భించ‌డం లేదు. సీరియ‌స్ సినిమా కావ‌డం, విష్ణు విశాల్ పెద్ద‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం లేక‌పోవ‌డం ఈ సినిమాకు మైన‌స్ గా మారింది. ఇక కొత్త హీరో చేసిన `సెహ‌రి` గురించి ప‌ట్టించుకునే వారే లేరు.

ఇక ఓటీటీల్లో విడుద‌లైన `మ‌హాన్‌` ప‌రిస్థితి కూడా అంతంత మాత్రంగానే వుంది. క‌థ‌లో ద‌మ్ము లేక‌పోవ‌డంతో ఈ సినిమా కూడా తేలిపోయింది. ప్రియ‌మ‌ణి న‌టించిన `భామా క‌లాపం` అంచ‌నాల‌ని అందుకోలేక‌పోయింది. సుమంత్ న‌టించిన `మ‌ళ్లీ మొద‌లైంది` చిత్రానికి నెగెటివ్ టాక్ వ‌చ్చింది. దీంతో ఈ వారం విడుద‌లైన చిత్రాల్లో ఏ సినిమాకు పెద్ద స్కోప్ లేక‌పోవ‌డం `డీజే టిల్లు`కు బాగా క‌లిసొస్తోంది. సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన ఈ చిత్రం ఈ శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

 పైన చెప్పిన సినిమాలేవీ ఆశించిన విధంగా లేక‌పోవ‌డం, `డీజే టిల్లు` రిలీజ్ కు ముందు నుంచే అంచ‌నాలు నెల‌కొన‌డం.. టాక్ కూడా పాజిటివ్ గా వుండ‌టంతో `డీజే టిల్లు` ది మామూలు టైమింగ్ కాదు అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊహించ‌ని స్థాయిలో జ‌ర‌గ‌డంతో ఓపెనింగ్స్ తో పాటు యుఎస్ ప్రీమియ‌ర్స్ కి హ్యూజ్ రెస్సాన్స్ ల‌భించింది.

ఏకంగా 100 కె ప్ల‌స్ డాల‌ర్స్ రాబ‌ట్ట‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. `డీజే టిల్లు` టాక్ తో పాటు సినిమా పై పెరుగుతున్న క్రేజ్ చూస్తుంటే వ‌సూళ్ల ప‌రంగా రికార్డులు సృష్టించేలా క‌నిపిస్తోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News