శివ‌కార్తికేయ‌న్ బౌన్స‌ర్‌ కి డ‌కౌటైన సింగ్ గారు!

Update: 2022-05-15 06:35 GMT
బ్యాక్ టు బ్యాక్ అర‌డ‌జ‌ను పాన్ ఇండియా సినిమాల‌తో సౌత్ సినిమా బాలీవుడ్ మీద జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. బాహుబ‌లి- బాహుబ‌లి 2- సాహో- పుష్ప‌- ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 చిత్రాలు ఉత్త‌రాదిన సంచ‌ల‌న వ‌సూళ్ల‌ను సాధించి పాన్ ఇండియా స్టార్ డ‌మ్ అంటే ఏంటో ప్ర‌పంచానికి చూపించాయి. దీంతో ఇప్పుడు మీడియాలో క‌థ‌నాల వంట‌కం కూడా అంతే ఇదిగా మారిపోయింది. బాలీవుడ్ పై సౌత్ స‌వారీ ఇదిగో ఇలా సాగుతోంది! అన్న కొత్త క‌థ‌నాల‌కు ఊతం ల‌భించింది. అవ‌తార్ రిలీజ్ త‌ర్వాత .. బాహుబ‌లి రిలీజ్ త‌ర్వాత‌.. పుష్ప‌- ఆర్.ఆర్‌.ఆర్- కేజీఎఫ్ 2 త‌ర్వాత పుంఖానుపుంఖాలుగా క‌థ‌నాలు వెలువ‌రించేందుకు రైట‌ర్ల‌కు ఆస్కారం ల‌భించింది.

అదే కోణంలో చూస్తే .. ఇప్పుడు ఓ ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య‌ పోలిక ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇందులో ఒక‌రు సౌత్ హీరో శివ‌కార్తికేయ‌న్ కాగా మరొక‌రు బాల‌వుడ్ స్టార్ హీరో ర‌ణ‌వీర్ సింగ్. తాజాగా రిలీజైన సినిమాల్లో శివ‌కార్తికేయ‌న్ కి 10 కోట్ల ఓపెనింగ్ ద‌క్కితే ర‌ణ‌వీర్ సింగ్ కి కేవ‌లం 3 కోట్ల మేర ఓపెనింగ్ ద‌క్కింది. ఇక్క‌డ కేవ‌లం ఒక రాష్ట్రంలో ఆడుతుంది. అక్క‌డ ఉత్త‌రాది రాష్ట్రాల‌న్నిటా బొమ్మ ప‌డుతుంది. కానీ ఈ వ‌సూళ్ల లెక్కేమిటీ? అన్న‌ది అంతు తేల‌డం లేదు.

శివ‌కార్తికేయ‌న్ న‌టించిన‌ డాన్ ఈ శుక్ర‌వారం విడుద‌లై మొదటి రోజు  ఈ చిత్రం ఇండియాలో 10 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించింది. డాన్ బాక్సాఫీస్ వద్ద చాలా మంచి ప్రారంభం సాధించింది. మొదటి రోజు దాదాపు 10 కోట్లు వ‌సూలు చేయ‌గా... ఇందులో రూ.8.50 కోట్లు తమిళనాడు నుండి వ‌సూలు చేసింది. 520కి పైగా లొకేషన్ లలో సినిమా ఆడుతోంది. ఇది శివ నటించిన రెండవ అత్యధిక ఓపెనింగ్ డే నంబర్ య‌గా రికార్డుకెక్కింది. అతని 2018 విడుదలైన సీమరాజా తర్వాత డాన్ మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో బీస్ట్- వాలిమై - RRR తర్వాత తమిళనాడులో ఈ సంవత్సరం నాల్గవ బెస్ట్ గా నిలిచింది.  

ఈ చిత్రానికి సంబంధించి తొలి ప్రేక్షకుల రిపోర్ట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. రెండో రోజు ప్రీ సేల్స్ ఓపెనింగ్ డే కంటే మెరుగ్గా ఉన్నాయి కాబట్టి వాక్-ఇన్ లు అనుకున్నట్లుగా జరిగితే తమిళనాడులో శనివారం ఆదివారం నాడు వ‌సూళ్లు పెరిగే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో పెద్ద సినిమాల విషయంలో ఒక రోజు రెండు రోజుల త‌ర్వాత‌ గ్రోత్ అనేది చాలా అరుదైన దృశ్యం. ఈ సినిమా విషయంలో అలా జరిగితే అది చాలా ఆకట్టుకుంటుంది. తమిళనాడులో వారాంతంలో రూ. 25 కోట్లు పైగా వ‌సూలు చేస్తుంద‌ని. ఇత‌ర చోట్ల క‌లుపుకుని రూ. 27-28 కోట్లు తెస్తుంద‌ని అంచ‌నా. తమిళనాడు వెలుపల కర్ణాటకలో ఈ చిత్రం రూ. ప్రారంభ రోజు 75 లక్షలు వ‌సూలు చేసింది. డాన్ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రాదేశిక వివరాలు ఇలా ఉన్నాయి:

తమిళనాడు - రూ. 8.50 కోట్లు
AP/TS - రూ. 50 లక్షలు
కర్ణాటక - రూ. 75 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 20 లక్షలు
మొత్తం - రూ. 10 కోట్లు

రణ్ వీర్ సింగ్ నటించిన జయేష్ భాయ్ జోర్దార్ మే 13న విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులపై ప్రభావం చూపడంలో విఫలమైంది. రణవీర్ సింగ్-నటించిన చిత్రం ఒక సామాజిక సందేశంతో తెర‌కెక్క‌డంతో మ‌సాలా అంశాలు మిస్స‌య్యి బాక్సాఫీస్ వ‌ద్ద పేలవమైన ప్రారంభం లభించింది. రణ్‌వీర్ సింగ్ గుజరాతీ వ్యక్తిగా నటించ‌గా.. ఈ చిత్రం విమర్శకులు - అభిమానుల నుండి మిశ్రమ సమీక్షలను పొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో విఫలమైంది.

బాక్సాఫీస్ ఇండియా నివేదిక ప్రకారం.. జయేష్ భాయ్ జోర్దార్ ప్రారంభం చూస్తుంటే కొంతవరకు రన్ వే మరియు జెర్సీ తరహాలో ఉంది. ఇదిలా ఉంటే రన్‌వే 34 విడుదలైన మొదటి రోజు రూ. 3 కోట్లు వసూలు చేసింది ..జెర్సీ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రూ.4 కోట్లు వసూలు చేసింది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ జయేష్‌భాయ్ జోర్దార్ యొక్క మొదటి-రోజు సంపాదనను పంచుకున్నారు మరియు ``#JayeshbhaiJordaar 1వ రోజు... 2వ రోజు మరియు 3వ రోజు చాలా కీలకమైనది... శుక్రవారం 3.25 కోట్లు. #India biz (sic)`` అని రాశారు.

ఆస‌క్తిక‌రంగా  జయేష్‌భాయ్ జోర్దార్ చిత్రంలో హీరో అంటే ఏమిటో చెబుతూ హీరోయిజం కి కొత్త బ్రాండ్ ను అందించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెర‌కెక్కింది. జయేష్‌భాయ్ జోర్దార్ లో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే నాయిక‌. ఇది ఆమె బాలీవుడ్ అరంగేట్ర సినిమా. ఈ చిత్రానికి దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వం వహించారు. ఇది మే 13న థియేటర్లలో విడుదలైంది. కానీ ఆశించిన ఓపెనింగుల‌ను ద‌క్కించుకోలేక‌పోయింది.

కార‌ణం ఏదైనా కానీ ఒక సౌత్ హీరోతో పోల్చిన‌ప్పుడు ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌తాపం మ‌రో రేంజులో ఉండాల్సింది. కానీ అది క‌నిపించ‌డం లేదు. ఇక‌పైనా ఈ సినిమా ఉద్ధ‌రించేది ఏమీ ఉండ‌ద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల చ‌ర‌ణ్ - తార‌క్ - బ‌న్నీ బాలీవుడ్ స్టార్ల‌కు ఊపిరాడ‌నివ్వ‌లేదు. మొన్న‌టికి మొన్న కేజీఎఫ్ స్టార్ య‌ష్ దెబ్బ‌కు కుమార్ లు క‌పూర్ లు ఐపు లేకుండా పోయారు. ఇక‌నైనా బాలీవుడ్ హీరోలు సౌత్ హీరోల ముందు దిగ‌దుడుపేన‌ని అంగీక‌రించే రోజు వ‌స్తుందేమో!
Tags:    

Similar News