మెర్స‌ల్ సినిమాపై మ‌ద్రాస్ హైకోర్టు వ్యాఖ్య‌లివే!

Update: 2017-10-27 09:11 GMT
అయితేగియితే మోడీని ఆకాశానికి ఎత్తేసేలా పొగిడేయాలే కానీ.. ప‌ల్లెత్తు మాట అన‌కూడ‌దు. ఒక‌వేళ అంటే ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయో మెర్స‌ల్ సినిమాకు ఎదురైన ప‌రిస్థితులు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. జీఎస్టీ.. పెద్ద నోట్ల ర‌ద్దు మొద‌లు ప‌లు సామాజిక అంశాల‌పై వ్యంగ్య వ్యాఖ్య‌లు.. సీరియ‌స్ డైలాగులు చెబుతూ సాగిన ఈ సినిమాపై మోడీ బ్యాచ్ ఎంత ఆగ‌మాగం చేస్తుందో తెలిసిందే.

ఈ చిత్రంలో ప్ర‌భుత్వాన్ని కించ‌ప‌రిచేలా డైలాగులు ఉన్నాయ‌ని.. అందుకే ఈ మూవీని బ్యాన్ చేయాలంటూ మ‌ద్రాస్ హైకోర్టులో ఒక పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచార‌ణ శుక్ర‌వారం ఉద‌యం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మెర్స‌ల్ చిత్రాన్ని బ్యాన్ చేయాల‌న్న పిటిష‌న్ ను మ‌ద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

మెర్స‌ల్ అన్న‌ది ఒక క‌ల్పిత క‌థా చిత్ర‌మ‌ని.. అదేమీ నిజ జీవితంగాథ కాదుగా? అన్న న్యాయ‌మూర్తి.. స‌మాజంపై ఈ చిత్రం ప్ర‌భావం చూపుతుంద‌న‌టం అర్థ‌ర‌హిత‌మ‌ని వ్యాఖ్యానించారు.

ధూమ‌పానం.. మ‌ద్య‌పానం హానిక‌రమంటూ ప్ర‌క‌ట‌న‌లు జారీ చేసే చిత్రాల కంటే మెర్స‌ల్ అంత డేంజ‌రా? అంటూ పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాదిని హైకోర్టు న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించారు.  అంతేకాదు.. సినిమా న‌చ్చ‌కుంటే చూడ‌టం మానేయాల‌ని.. అంతేకానీ ఇలాంటి పిటిష‌న్లు వేసే కోర్టు స‌మ‌యాన్ని వృధా చేయొద్ద‌న్నారు.

వివాదాల‌తో సినిమాకు ఉచిత ప్ర‌చారం ల‌భించింద‌న్న న్యాయ‌మూర్తి.. సినిమాలోని డైలాగులు ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించేలా ఉంద‌న్న పిటిష‌న్ ను కొట్టేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. మ‌రోవైపు ఈ సినిమాలోని డైలాగులు అభ్యంత‌ర‌కంగా ఉన్నాయంటూ కొన్ని హిందుత్వ సంఘాలు నిర‌స‌న‌లు నిర్వ‌హించ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News