సంగీత ప్ర‌పంచానికి రాక్ స్టార్‌!

Update: 2022-08-02 09:34 GMT
సంగీత ప్ర‌పంచంలో దేవి శ్రీ‌ప్ర‌సాద్ ఓ రాక్ స్టార్‌. ఇది ప్ర‌తీ హీరో చెప్పే మాట‌. అంతా త‌న‌దైన మార్కు ట్యూన్ ల‌తో యువ సంగీత సంచ‌ల‌నంగా మారారు. మంగ‌ళ‌వారం ఆగ‌స్టు 2 దేవిశ్రీ‌ప్ర‌సాద్ పుట్టిన రోజు. 20 ఏళ్ల వ‌య‌సులోనే సంగీత ద‌ర్శ‌కుడిగా తెరంగేట్రం చేసిన దేవిశ్రీ‌ప్ర‌సాద్ `దేవి` సినిమాతో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఆనందం, సొంతం వంటి చిత్రాల‌తో సంగీత ద‌ర్శ‌కుడిగా త‌న‌కు తిరుగులేద‌నిపించాడు. చిన్న వ‌య‌సులోనే సంగీత ప్ర‌పంచంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఆ అంటే అమ‌లా పురం అంటూ వెండితెర‌పై ఐట‌మ్ సాంగ్ ల‌కు మాస్ట‌ర్ గా నిలిచారు. రాక్ స్టార్ అనిపించుకున్నారు.

స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎం.ఎస్‌.రాజు 1999లో నిర్మించిన `దేవి` సినిమాతో దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీత ప్ర‌స్థానం మొద‌లైంది. కోడిరామ‌కృష్ణ గ్రాఫిక‌ల్ వండ‌ర్ గా తెర‌కెక్కించిన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి దేవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్ర‌భాస్ తో చేసిన `వ‌ర్షం` త‌న‌ని మ‌రో మెట్టుపైకి ఎక్కించి టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ల స‌ర‌స‌న చేర్చింది. ఇక అక్క‌డి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా 100కు పైడి సినిమాల‌కు సంగీతం అందించారు. దేవిశ్రీ‌ప్ర‌సాద్ కు ఆ పేరు తాత‌య్య అమ్మ‌ల వ‌ల్ల వ‌చ్చింది. వారి పేర్ల‌ని క‌లిపి దేవిశ్రీ‌ప్ర‌సాద్ గా నామ‌క‌ర‌ణం చేశార‌ట‌.

దేవి తండ్రి ప్ర‌ముఖ ర‌చ‌యిత స‌త్య‌మూర్తి. ఆయ‌న దాదాపు వంద సినిమాల‌కు పైగా క‌థ‌, మాట‌లు అందించారు. దేవ‌త‌, అభిలాష‌, ఛాలెంజ్‌, ఖైదీనం.786, పెదారాయుడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలున్నాయి. ఇక‌ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో క‌లిపి 100 చిత్రాల‌కు పైగా సంగీతం అందించిన దేవి గాయ‌కుడిగా 60 పాట‌లు పాడాడు. అంతే కాకుండా దాదాపు 20 పాట‌ల‌కు సాహిత్యాన్ని కూడా అందించాడు. దేవీ ఖాతాలో 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఐదు సైమా, ఒక నంది పుర‌స్కారం వున్నాయి.

ఇక సుకుమార్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన `కుమారి 21 ఎఫ్‌` మూవీలోని `బ్యాంగ్ బ్యాంగ్ .. ` అంటూ సాగే పాట‌కు సంగీతం అందించ‌డ‌మే కాకుండా ఆల‌పించి కొరియోగ్ర‌ఫీ చేశారు. ఇలా ఓ సినిమాకు వ‌ర్క్ చేయ‌డం ఇదే తొలిసారి. ఇక కొన్ని స్టార్ హీరోలు న‌టించిన కొన్ని సినిమాల్లోని పాట‌ల్లో గెస్ట్ క్యారెక్ట‌ర్స్ చేశారు. మాండ‌రిన్ శ్రీ‌నివాస్ వ‌ద్ద శిష్య‌రికం చేసిన దేవికి బాగా న‌చ్చిన సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా. న‌చ్చే సింగ‌ర్ మైఖేల్ జాక్స‌ర్‌..ఈ  మూగ్గురు ఎప్పుడూ త‌న‌కు ప్ర‌త్యేక‌మే.  

దేవి ప‌నిత‌నం న‌చ్చి మెగాస్టార్ చిరంజీవి `శంక‌ర్ దాదా ఎంబీ బీఎస్` సినిమాకు గానూ దేవికి వాచీ బ‌హుమ‌తిగా అందించారు. అది ఇప్ప‌టికీ త‌న‌వ‌ద్ద భ‌ద్రంగా వుంద‌ట‌. 2000 - 2010 మ‌ధ్య కాలంలో అత్య‌ధిక‌చిత్రాల‌కు సంగీతం అందించిన సంగీత ద‌ర్శ‌కుడిగా రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఒక ద‌శ‌లో సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న సంగీత ద‌ర్శ‌కుడిగా రికార్డుల కెక్కారు. దేశ విదేశాల్లో స్పెష‌ల్ కాన్సెర్ట్ ల‌తో అల‌రించారు.

సినిమాల‌కు సంగీతం అందించ‌డ‌మే కాకుండా త‌మిళంలో ఓ ఛాన‌ల్ లో నిర్వ‌హిస్తున్న స్పెష‌ల్ షోకు దేవి హోస్ట్ గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో `రంగ రంగ వైభ‌వంగ‌`, వాల్తేర వీర‌య్య‌, పుష్ప ది రైజ్‌.. హిందీలో స‌ర్క‌స్ (రెండు పాటల‌కు మాత్ర‌మే), క‌భీ ఈద్ క‌భి దివాళీ` వంటి చిత్రాల‌కు సంగీతం అందిస్తున్నాడు. గ‌తంతో పోలిస్తే కొంత జోరు త‌గ్గినా త‌న‌దైన మార్కు మ్యూజిక్ తో `పుష్ప‌` సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌డం విశేషం.
Tags:    

Similar News