'హృదయం'తో అందరి దృష్టిని ఆకర్షించిన సూపర్ స్టార్ తనయుడు..!

Update: 2022-01-29 10:30 GMT
సినీ ఇండస్ట్రీలో నెపోటిజం అనేది కామన్. నిజానికి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కేవలం లాంచింగ్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత సొంత టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని.. సినిమా కోసం కష్టపడిన వారు మాత్రమే చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోగలుగుతారు. అవేమీ లేకపోతే మాత్రం ఎంత పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడియన్స్ అలాంటి వారిని రెండు మూడు సినిమాలకు పరిమితం చేస్తారు.

టాలీవుడ్ లో మాదిరిగానే మాలీవుడ్ లో కూడా అనేక మంది స్టార్స్ తమ వారసులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తండ్రి బాటలోనే నడుస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ కూడా హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోడానికి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు.

చైల్డ్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో అలరించిన ప్రణవ్ మోహన్ లాల్.. 2918లో 'ఆది' అనే కమర్షియల్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. గతేడాది చివర్లో వచ్చిన 'మరాక్కర్: అరేబియన్ సింహం' చిత్రంలో మోహన్ లాల్ టీనేజ్ పాత్రను ప్రణవ్ పోషించాడు. ఈ క్రమంలో లేటెస్టుగా 'హృదయం' సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఎమర్జింగ్ స్టార్ గా అవతరించాడు ప్రణవ్.

వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన 'హృదయం' చిత్రంలో ప్రణవ్ మోహన్ లాల్ సరసన 'హలో' ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ - దర్శన రాజేంద్రన్ హీరోయిన్లుగా నటించారు. వైశాఖ్ సుబ్రహ్మణియన్ ఈ సినిమాను నిర్మించారు. వివిధ దశల్లో ఒక యువకుడి జీవిత ప్రయాణాన్ని నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా.. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వైవిధ్యమైన లవ్ స్టోరీతో యూత్ ని టార్గెట్ చేస్తూ రూపొందించిన 'హృదయం' సినిమా తొలి రోజు నుంచే అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలో మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అరుణ్ నీలకంఠన్ అనే పాత్రలో నటించిన ప్రణవ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

'హృదయం' సినిమా రీమేక్ హక్కుల కోసం ఇతర పరిశ్రమలకు చెందిన పలువురు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తన నాలుగో సినిమాతో ప్రణవ్ మోహన్ లాల్ స్టార్ స్టేటస్ అందుకున్నారని చెప్పాలి. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రణవ్.. రాబోయే రోజుల్లో తన తండ్రి బాటలోనే మలయాళంతో పాటుగా మిగతా మూడు దక్షిణాది భాషల్లో సినిమాలను విడుదల చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News