దుల్కర్ 'యుద్ధంతో' రాసిన ప్రేమకథ...!

Update: 2020-07-28 07:10 GMT
మలయాళంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న దుల్కర్ సల్మాన్ 'మహానటి' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ కూడా అయ్యాయి. ఈ క్రమంలో వచ్చిన 'కనులు కనులను దోచాయంటే' చిత్రం ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అప్పటి నుంచి దుల్కర్ సల్మాన్ నేరుగా ఓ తెలుగు సినిమా చేయాలని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు దుల్కర్ సల్మాన్ బర్త్ డేని పురస్కరించుకొని తెలుగులో నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. ‘అందాల రాక్షసి’ ‘పడి పడి లేచే మనసు’లాంటి మనసుని హత్తుకొనే చిత్రాలను తెరకెక్కించిన హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ ఓ సినిమా చేయబోతున్నాడు.

వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంకా దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు. నేను దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా 'లెఫ్టినెంట్' రామ్ 'యుద్ధంతో' రాసిన ప్రేమకథ.. అంటూ అనౌన్సమెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా హను రాఘవపూడి శైలిలో వార్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దుల్కర్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగుతో పాటు మలయాళం మరియు తమిళ్‌ లో కూడా రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటున్న ఈ సినిమా కరోనా పరిస్థితులు కంట్రోల్ లోకి వస్తే స్టార్ట్ అవుతుందని సమాచారం.
Tags:    

Similar News