ఏడు ఆటల షో వర్క్ అవుట్ కాలేదే

Update: 2018-01-11 16:55 GMT
అజ్ఞాతవాసికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రోజుకు ఏడు ఆటల చొప్పున అనుమతి ఇచ్చింది అని తెలిసినప్పుడు పవన్ ఫాన్స్ ఆనందానికి అంతే లేదు. నాలుగు ఆటలతోనే రికార్డులు ఖాయం అనుకుంటే ఇక ఏడు ఆటలతో బాహుబలిని బాదేయటం ఖాయం అనుకున్నారు. కాని మొదటి రోజు ఒంటి గంటకు వేసిన షోనే మొత్తం తారుమారు చేసేసింది. పూర్తిగా డివైడ్ టాక్ తో రన్ అవుతున్న అజ్ఞాతవాసికి రానున్న టైం  చాలా టఫ్ గా మారనుంది. ఇక 11వ తేది నుంచే అర్ధ రాత్రి దాటాక ఏడు షోలు వేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ఒక్క థియేటర్ సుముఖంగా లేకపోవడం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. సెకండ్ షోకే వసూళ్లు  అంతంతమాత్రంగా ఉన్న నేపధ్యంలో నిద్ర చెడగొట్టుకుని మరీ అర్ధ రాత్రి థియేటర్లకు వచ్చేంత సీన్ ప్రస్తుతానికి లేదు. చలి కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు కాబట్టి అదే పనిగా సినిమాల కోసం పబ్లిక్ వేళ కాని వేళ వచ్చేందుకు సుముఖంగా లేరు.

వాస్తవం చెప్పాలంటే ఏడు షోలకు పర్మిషన్ అడగటం వల్ల వచ్చిన ఉపయోగం ఏమి లేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా మరొక కామెంట్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అయ్యిందని - నాలుగు ఆటలకే ఫుల్ కావడం గగనమైన నేపధ్యంలో ఏడు ఆటలకు జనం విరగబడి వస్తారని ఏ లెక్కలో అనుకున్నారో అని మూవీ యూనిట్ పై చురకలు వేస్తున్నారు. ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకోబోతున్నారు బాలయ్య అండ్ సూర్య. జైసింహ - గ్యాంగ్ కు ఊహించిన దాని కన్నా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక అంచనా. పవన్ మూవీ వీక్ కావడంతో రేపు వచ్చే రెండు సినిమాల్లో ఏది బాగుంటే దాని వైపు అజ్ఞాతవాసి ఇప్పటి దాకా చూడని వాళ్ళు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది.ఎలా ఉన్నా పవన్ సినిమా చూడాలి అనే వర్గంతో ఏ సమస్యా లేదు. ఓ నాలుగు రోజుల అడ్వాన్సు బుకింగ్ బాగా జరిగింది కాబట్టి కొంత వరకు నయం అంటున్నారు అజ్ఞాతవాసి బయ్యర్స్. కౌంటర్ బుకింగ్ జరిగే సింగల్ స్క్రీన్స్ దగ్గర మాత్రం అజ్ఞాతవాసి విపరీతమైన డ్రాప్ చూపిస్తున్నాడు. ఇలా ఏడు ఆటల ఎత్తుగడ ఏడు సముద్రాల్లో కలిసిపోయింది.
Tags:    

Similar News