మూవీ రివ్యూ : వీడు గోల్డ్ ఎహే

Update: 2016-10-07 09:04 GMT
చిత్రం : ‘వీడు గోల్డ్ ఎహే’

నటీనటులు: సునీల్ - సుష్మా రాజ్ - రిచా పనాయ్ - జయసుధ - అరవింద్ కృష్ణ - చరణ్ దీప్ - పృథ్వీ - నరేష్ - బెనర్జీ - షకలక శంకర్ తదితరులు
సంగీతం: సాగర్ ఎం.శర్మ
ఛాయాగ్రహణం: దేవరాజ్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
రచన - దర్శకత్వం: వీరూ పోట్ల

హీరోగా హిట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు సునీల్. అందాల రాముడు.. మర్యాద రామన్న.. పూలరంగడు లాంటి సక్సెస్ ల తర్వాత అతడికి వరుసగా పరాజయలే ఎదురయ్యాయి. పైగా తనకు నప్పని రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేస్తున్నాడంటూ విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో వీరూ పోట్ల దర్శకత్వంలో చేసిన ‘ఈడు గోల్డ్ ఎహే’ కొంచెం కొత్తగా ఉండటంతో పాటు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తి తనకు మంచి విజయాన్ని కూడా అందిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు సునీల్. మరి అతడి నమ్మకాన్ని ఈ చిత్రం ఎంతవరకు నిలబెట్టిందో చూద్దాం పదండి.

కథ:

బంగార్రాజు (సునీల్) ఒక అమాయక చక్రవర్తి. మంచివాడు. ఎవరేమన్నా పడతాడు. అస్సలు కోపం రాదు. ఐతే అతడు ఎవరి దగ్గర పనిలో చేరితే వాళ్ల పని మటాష్ అన్న ముద్ర పడుతుంది. అతడి వల్ల దెబ్బ తిన్న యజమాని సిటీలో ఉద్యోగం ఉందని చెప్పి ఊరి నుంచి పంపించేస్తాడు. అక్కడ కూడా బంగార్రాజకు ఇబ్బందులు తప్పవు. ఐతే అనుకోకుండా పరిచయమైన ఓ పెద్దావిడ అతణ్ని కొడుకులాగా ఆదరిస్తుంది. ఆమె కొడుకు దగ్గరే ఉద్యోగంలోనూ చేరతాడు బంగార్రాజు. ఐతే అంతా సాఫీగా సాగిపోతున్న టైంలో బంగార్రాజు లాగే ఉండే సునీల్ వర్మ అనే వ్యక్తి.. మహదేవ్ అనే పెద్ద మాఫియా డాన్ ఇంట్లోకి వెళ్లి అతడి దగ్గరున్న వజ్రాల విగ్రహాన్ని దొంగిలిస్తాడు. దీంతో అతడి గ్యాంగ్.. సునీ్ వర్మతో పని ఉన్న వ్యక్తులు బంగార్రాజు వెంట పడటం మొదలుపెడతారు. వీళ్లందరి వల్ల బంగార్రాజు పెద్ద చిక్కుల్లో ఇరుక్కుంటాడు. మరి ఈ పరిస్థితుల నుంచి అతను ఎలా బయటపడ్డాడు.. అసలు బంగార్రాజు లాగా ఉన్న సునీల్ వర్మ ఎవరు.. ఏంటి అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

సునీల్ మొన్నటిదాకా చేసిన సినిమాలతో రెండు కంప్లైంట్లు. ఒకటి వాటిలో కొత్తదనం లేకపోవడం.. సునీల్ వేసే మాస్ హీరో వేషాలు ఎబ్బెట్టుగా ఉండటం. సునీల్ గత సినిమాలతో పోలిస్తే ఈ రెండు విషయాల్లో ‘ఈడు గోల్డ్ ఎహే’ కొంచెం మెరుగే. ఐతే ఇది చాలా కొత్తగా ఉంటుందని.. అదిరిపోయే ట్విస్టులతో భలే థ్రిల్ ఇస్తుందని.. నవ్వుల్లో ముంచెత్తేస్తుందని చేసిన ప్రచారం మాత్రం వాస్తవం కాదు. వీరూ పోట్ల ఇంతకుముందు తీసిన మూడు సినిమాల కంటే వీక్.. సునీల్ గత కొన్ని సినిమాలతో పోలిస్తే బెటర్.. అంతకుమించి ఏమీ కాదు.

వీరూ పోట్లలో మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. అతడి కామెడీ టైమింగ్ బాగుంటుంది. మాటలతో మంచి వినోదం పండిస్తాడు. ఐతే అతడి కథలు అంత సీరియస్ గా ఉండవు. లాజిక్కుల గురించి కూడా పెద్దగా పట్టించుకోడు. ప్రతి సీన్లోనూ వినోదం పంచుతూ.. ప్రేక్షకుడు మిగతా విషయాల గురించి పట్టించుకోనివ్వకుండా టైంపాస్ చేయిస్తూ కథనాన్ని నడిపించడం అతడి శైలి. ‘ఈడు గోల్డ్ ఎహే’ విషయంలోనూ అలాంటి ప్రయత్నమే చేశాడు. ఐతే కథాకథనాల విషయంలో మరీ లైట్ తీసుకున్నాడతను. మరీ రొటీన్ గా అనిపించే కథకు.. బిగి లేని కథనం తోడవడంతో ప్రేక్షకుడు సినిమాలో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం లేకపోయింది. లాజిక్ అంటూ లేకుండా సన్నివేశాల్ని ఇష్టానుసారం నడిపించేయడంతో వచ్చింది సమస్య.

హీరో పాత్రలోనే బలం లేకపోవడం.. అది ఒక దశా దిశా లేకుండా సాగిపోవడంతో ఆ పాత్రతో ప్రేక్షకుడు కనెక్టవడు. కథకు కీలకమైన లాఫింగ్ బుద్ధ విగ్రహాలకు సంబంధించిన కాన్సెప్టే చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. విగ్రహాల ఖరీదు 900 కోట్లని చెబుతారు కానీ.. విలన్ ఇంట్లో ఉన్నవాళ్లందరినీ మస్కా కొట్టించి దాన్ని కొట్టుకుపోయే తీరు చూస్తేనే ఈ కథను సీరియస్ గా నడిపే ఉద్దేశం లేదని అర్థమవుతుంది. అలాగే తనను చిన్న ఇబ్బంది నుంచి తప్పించాడని వెంటనే హీరోను జయసుధ నువ్వు నా పెద్ద కొడుకు అనేయడం.. ఇతను ఓ ఎమోషన్ తెచ్చేసుకుని ఆమె ఇంట్లో సెటిలైపోవడం.. ఆమె కోసం ఆ తర్వాత వీరోచిత పోరాటాలు చేయడం కూడా అతిగా అనిపిస్తుంది. ఈ ఎమోషన్ అంతా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది.

హీరో ట్రాప్ లో చిక్కుకోవడం.. ‘మర్యాద రామన్న’లా ఉన్న సునీల్.. ‘పూలరంగడు’ క్లైమాక్స్ సునీల్ లాగా మారిపోయి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడం.. ఇవన్నీ కూడా కొంచెం కృత్రిమంగానే అనిపిస్తాయి. ఐతే ‘ఈడు గోల్డ్ ఎహే’ ఏ తరహా సినిమా అన్నది మొదట్లోనే ఓ ఐడియా వచ్చేస్తుంది కాబట్టి.. ఈ లాజిక్కుల గురించి ఆలోచించకుండా కామెడీని ఎంజాయ్ చేయగలిగితే ఏదో అలా టైంపాస్ అవుతుంది. పృథ్వీ.. షకలక శంకర్.. వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్లను అవసరానికి వీరూ బాగా వాడుకున్నాడు. కామెడీలో సైతం లాజిక్ సంగతి వదిలేస్తే బాగానే నవ్వుకోవచ్చు. వీరూ పంచ్ డైలాగులు బాగానే పేలాయి. కథాకథనాలు ఎలా ఉన్నా అక్కడక్కడా కామెడీ వర్కవుట్ కావడంతో ప్రథమార్ధం సోసోగా నడిచిపోతుంది. హీరోయిన్లతో రొమాంటిక్ ట్రాక్ కూడా పేలవమే కానీ.. వాళ్ల అందాల ప్రదర్శన ఓ వర్గం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం వీక్ గా అనిపిస్తుంది. రొటీనే అయినా పంచ్ డైలాగులతో సాగే ఫామ్ హౌస్ కామెడీ మినహా ద్వితీయార్ధంలో చెప్పుకోదగ్గ విశేషం లేద.  యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నా సగటు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. ఇక చివర్లో ఇచ్చే ట్విస్టు దిమ్మదిరిగిపోయే స్థాయిలో ఏమీ లేదు. ఆ ట్విస్టు చూసి షాకవడం సంగతలా ఉంచితే తుస్సుమన్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ లో హీరో రెచ్చిపోవడం.. ఆ ఫైటింగ్ అంతా రొటీనే. ఓవరాల్ గా ‘ఈడు గోల్డ్ ఎహే’ మరో సగటు కమర్షియల్ సినిమా. నిడివి తక్కువ కావడం సినిమాకు ప్లస్. లాజిక్కులతో సంబంధం లేకుండా సాగే కమర్షియల్ సినిమాలకు అలవాటు పడ్డవాళ్లను ఇది మెప్పించవచ్చు. అంతకుమించి ఆశిస్తే నిరాశ తప్పదు.

నటీనటులు:

సునీల్ గత సినిమాలతో పోలిస్తే ఇందులో బిల్డప్పులు బాగా తగ్గించుకున్నాడు. మాస్ హీరో ఇమేజ్ కోసం తాపత్రయ పడకుండా మామూలుగా నటించడానికి ప్రయత్నించాడు. అలాగని పూర్తి కామెడీ పాత్రలోకి మారలేదు. రెంటికి మధ్య తరహాలో చేశాడు. సునీల్ నుంచి ఆశించే మాత్రం అతడి పాత్ర ద్వారా పండలేదు. అతడి పెర్ఫామెన్స్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. హీరోయిన్లిద్దరూ గ్లామర్ షో చేయడానికి పోటీ పడ్డారు. ఇద్దరిలో సుష్మా రాజ్ ఎక్కువ స్కోర్ చేసింది. చిన్న స్థాయి మాస్ మసాలా సినిమాలకు ఆమె బాగానే సూటయ్యేలా ఉంది. రిచా పనాయ్ పర్వాలేదు. హీరోయిన్లిద్దరికీ పాత్రల పరంగా పెద్ద ప్రాధాన్యం లేదు. నటన అంతంతమాత్రమే. అరవింద్ కృష్ణ నెగెటివ్ రోల్ లో పెద్దగా ఆకట్టుకోలేదు. పృథ్వీ.. షకలక శంకర్ తమ పరిధిలో బాగానే నవ్వించారు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

టెక్నీషియన్స్ కు ఇందులో పెద్దగా రోల్ ఏమీ లేదు. మణిశర్మ తనయుడు సాగర్ ఎం.శర్మ సంగీతం చాలా మామూలుగా అనిపిస్తుంది. ఇందులో సంగీతానికి అసలు ప్రాధాన్యమే లేదు. పాటలేవీ కూడా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. దేవరాజ్ ఛాయాగ్రహణం పర్వాలేదు. కమర్షియల్ సినిమాలకూ అందరూ చేసేలాగే అతనూ చేశాడు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. వీరూ పోట్ల ఈసారి స్క్రిప్టు విషయంలో పెద్దగా కసరత్తు చేసినట్లు లేదు. ఇంతకుముందు మామూలు కథలనే ఆసక్తికర కథనంతో నడిపించిన వీరూ.. ఈసారి అంతా పైపైన నడిపించేశాడు. మాటల్లో అక్కడక్కడా అతడి చతురత కనిపిస్తుంది. ఐతే ప్రాసల కోసం పంచ్ ల కోసం కొన్నిచోట్ల ప్రయాస స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత భారీ అవమానం బాహుబలి భార్య దేవసేనకు కూడా జరిగి ఉండదు.. దీనికి నిరసనగా పెద్దోళ్లందరూ తమ అవార్డుల్ని వెనక్కిచ్చేయాలి.. లాంటి ట్రెండీ డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇప్పటిదాకా ఎబోవ్ యావరేజ్ సినిమాలు తీస్తూ వచ్చిన వీరూ.. ‘వీడు గోల్డ్ ఎహే’తో బిలో యావరేజ్ స్థాయికి పడిపోయాడు.

చివరగా: వీడు మామూలోడే ఎహే

రేటింగ్: 2.5/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News