మూవీ రివ్యూ : ఎక్కడికి పోతావు చిన్నవాడా

Update: 2016-11-18 09:00 GMT
చిత్రం : ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’

నటీనటులు: నిఖిల్ - హెబ్బా పటేల్ - నందిత శ్వేత - వెన్నెల కిషోర్ - సత్య – రాజా రవీంద్ర – తనికెళ్ల భరణి – అన్నపూర్ణ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాణం: మేఘన ఆర్ట్స్
కథ - స్క్రీన్ ప్లే- దర్శకత్వం: వీఐ ఆనంద్

‘స్వామి రారా’ నుంచి విభిన్నమైన సినిమాలతో మంచి విజయాలందుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ కథానాయకుడు నిఖిల్. గత ఏడాది ‘శంకరాభరణం’ అతడి జోరుకు బ్రేక్ వేసింది. ఐతే ఈసారి ‘టైగర్’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ చేసిన ‘ఎక్కడికి  పోతావు చిన్నవాడా’ మళ్లీ అతణ్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించేలా కనిపించింది. మొదట్నుంచి ప్రామిసింగ్ గా కనిపిస్తున్న ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.

కథ:

అర్జున్ (నిఖిల్) చదువుకునే రోజుల్లోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయితో పెళ్లికి కూడా సిద్ధమవుతాడు. కానీ పెళ్లి రోజు ఆ అమ్మాయి చెప్పిన చోటికి రాదు. తర్వాత ఆమె అతడికి కనిపించదు. ఇలా జరిగిన నాలుగేళ్లకు దయ్యం పట్టిన తన స్నేహితుడి వెంట బలవంతంగా కేరళకు వెళ్తాడు అర్జున్. అక్కడే అతడికి అమల (హెబ్బా పటేట్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. మూడు రోజుల ప్రయాణంలో ఇద్దరూ దగ్గరవుతారు. కానీ మరుసటి రోజు ఆ అమ్మాయి హఠాత్తుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మళ్లీ హైదరాబాద్ వచ్చాక అదే అమ్మాయిని కలిస్తే తన పేరు నిత్య అని చెబుతుంది. అర్జున్ అంటే ఎవరో తెలియట్లే మాట్లాడుతుంది. మరి ఆమె అలా ఎందుకు చెబుతుంది.. ఈమె నిత్య అయితే.. అమల ఎవరు? ఇంతకీ అర్జున్ ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి ఎవరు.. ఆమె ఏమైంది..? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెరమీదే తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ప్రోమోలవీ చూస్తే ఇదేదో సైంటిఫిక్ అప్రోచ్ ఉన్న ఫాంటసీ థ్రిల్లర్ అన్న అభిప్రాయం కలిగి ఉండొచ్చు. ఐతే వాస్తవానికి సినిమాలో సైన్స్ ఏమీ లేదు. ఇది ఆత్మలు.. దయ్యాల నేపథ్యంలో సాగే మామూలు ఫాంటసీ థ్రిల్లర్. మనకు అలవాటైన దయ్యం కథతోనే దర్శకుడు వీఐ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఐతే పాత కథనే కొత్తగా చెప్పడంలో అతను విజయవంతమయ్యాడు. బలమైన కథ.. బోలెడన్ని మలుపులు.. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే.. కంటెంట్ ఉన్న క్యారెక్టర్లు.. అన్నీ కలిపి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ను ఎంగేజింగ్ థ్రిల్లర్ గా మలిచాడు ఆనంద్. నరేషన్ అక్కడక్కడా కొంచెం నెమ్మదిగా అనిపించినా.. అప్ అండ్ డౌన్స్ ఉన్నా.. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో ఆనంద్ అండ్ టీమ్ విజయవంతమైంది.

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’కు ప్రధాన ఆకర్షణ ఇందులోని మలుపులే. కథ టేకాఫ్ అవ్వడానికి కొంచెం సమయం పట్టినా తొలిసారి కథలో ట్విస్టు ఇచ్చినప్పటి నుంచి ప్రేక్షకుడికి ఎప్పటికప్పుడు ప్రశ్నలు సంధించడంలో.. ఉత్కంఠ రేపడంలో.. మళ్లీ కొత్త కొత్త ట్విస్టులతో కథను మలుపు తిప్పుతూ.. ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురి చేస్తూ.. చివరిదాకా ఆసక్తిని నిలిపి ఉంచడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. అవ్వడానికి థ్రిల్లర్ మూవీనే అయినా.. ఇందులో సమయానుకూలంగా కామెడీని పండించడం వల్ల చాలా వరకు బోర్ కొట్టకుండా సాగిపోతుంది. వెన్నెల కిషోర్ కామెడీ ప్రథమార్ధానికి ప్రధాన ఆకర్షణ. ఆ పాత్ర ఇంట్రడక్షన్ నుంచి చమక్కులు విసురుతూనే ఉంటుంది.

కేరళ ఎపిసోడ్లో వినోదం పాళ్లు తగ్గి.. కొంచెం సాగతీతగా అనిపిస్తుంది. ఐతే ఇంటర్వెల్ ముందు ట్విస్టు ప్రేక్షకుడిని సీరియస్ మూడ్ లోకి తీసుకెళ్తుంది. ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ద్వితీయార్ధంలో కొంతసేపటి వరకు సినిమా రెగ్యులర్ హార్రర్ కామెడీల తరహాలో సాగుతుంది. వెన్నెల కిషోర్.. సత్య పాత్రలు కడుపుబ్బ నవ్వించినా.. కథ రొటీన్ ట్రాక్ లో నడుస్తుండటం నిరాశ పరుస్తుంది. ఐతే మళ్లీ ఒక ట్విస్టుతో మళ్లీ కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. ఆరంభంలో మొదలై… బ్రేక్ అయిన కథను మళ్లీ కలిపిన తీరు ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడి ప్రతిభ ఇక్కడే అర్థమవుతుంది. గతానికి.. వర్తమానానికి పావురాల సన్నివేశంతో లింక్ కలపడం.. దర్శకుడు చిన్న చిన్న విషయాల్ని ఎంతగా పట్టించుకున్నాడో తెలియజేస్తుంది.

సాధారణంగా ఆత్మలు దయ్యాల నేపథ్యంలో సాగే సినిమాల్లో దయ్యాన్ని వదలగొట్టడం అన్నది టాస్క్ అవుతుంది. కానీ ఇందులో దయ్యాన్ని వదిలించబోతుంటే ఆపడానికి ప్రయత్నం జరగడం అన్నది కొత్త పాయింట్. ఐతే ఈ కొత్త పాయింట్ ను క్లైమాక్స్ సరిగా డీల్ చేయలేకపోయాడు ఆనంద్. ప్రి క్లైమాక్సులో ట్విస్టుతో థ్రిల్ అయ్యాక క్లైమాక్స్ మరింత ఎగ్జైటింగ్ గా ఉండాలని కోరుకుంటాం. కానీ చాలా మామూలుగా ముగించేశాడు దర్శకుడు. కంక్లూజన్ అంత గొప్పగా లేదు. లాజిక్ తో సంబంధం లేకుండా కథను నడిపించడానికి ఫాంటసీ సినిమాల్లో ఉండే అడ్వాంటేజీని ఇందులో బాగానే వాడుకున్నారు. ఐతే హీరో తొలిసారి ప్రేమించిన అమ్మాయి ఆత్మే పార్వతి (నందిత) ఒంట్లో ఉందని.. నిత్య (హెబ్బా)కు తెలియకపోయినా.. ఆమె అంతా తెలిసినట్లు ఓ సన్నివేశంలో మాట్లాడటంలో లాజిక్ కనిపించదు. మధ్యలో ఒక సన్నివేశం ఎడిటింగ్ లో ఎగిరిపోయిందో ఏమో కానీ.. ఈ సన్నివేశంలో లాజిక్ మిస్సయింది.

మొదట్లో సైన్స్.. సైన్స్ అనే హీరో ఆ తర్వాత ఆ ఊసే ఎత్తకుండా అందరిలో ఒకడిలా మారిపోవడం బాలేదు. ‘కార్తికేయ’ తరహాలోనే ఇందులోనూ సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుందని ఆశించినా నిరాశ తప్పదు. నిడివి ఇంకో పావు గంట తగ్గించి ఉంటే సినిమా క్రిస్ప్ గా అనిపించేది. అక్కడక్కడా కొంచెం సాగతీత ఉన్నా.. క్లైమాక్స్ నిరాశ పరిచినా.. ఓవరాల్ గా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఎంగేజ్ చేస్తుంది. ట్విస్టులతో థ్రిల్ చేస్తూ.. కామెడీతో కవ్విస్తూ.. మంచి అనుభూతినే మిగులుస్తుంది  

నటీనటులు:

నిఖిల్ నటన కంటే ముందు సినిమాల ఎంపికలో అతడి అభిరుచి గురించి మాట్లాడుకోవాలి. నిఖిల్ సినిమా అంటే కొత్తగా ఉంటుంది అన్న పేరును నిలబెట్టుకుంటూ మరో వైవిధ్యమైన కథను ఎంచుకున్నందుకు.. దానికి పూర్తి న్యాయం చేసినందుకు అతణ్ని అభినందించాలి. అర్జున్ పాత్ర విషయంలో అతనెంతో శ్రద్ధ తీసుకున్నాడు. ఇందులో ఫ్లాష్ బ్యాక్.. వర్తమానానికి మధ్యలో నాలుగేళ్ల విరామం ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లో లుక్ దగ్గర్నుంచి.. నటన వరకు అతను చూపించిన వైవిధ్యం మెచ్చుకోదగ్గది. ఆత్మవిశ్వాసంతో.. పాత్రకు తగ్గట్లుగా నటించాడు నిఖిల్. గత కొన్నేళ్లలో నిఖిల్ లో వచ్చిన మెచ్యూరిటీ ఎమోషనల్ సన్నివేశాల్లో కనిపిస్తుంది. నిఖిల్ మరోసారి దూకుడు తగ్గించుకుని కుదురుగా నటించాడు. ఐతే అతడి పాత్రే కొంచెం అక్కడక్కడా నిలకడ తప్పింది. సినిమాలో ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లున్నారు. వారిలో నందితకు అందర్లోకి ఎక్కువ మార్కులు పడతాయి. తెలుగులో తొలిసారి నటించిన ఈ తమిళమ్మాయి గ్లామర్ పరంగా అంతగా ఆకట్టుకోకున్నా.. నటనలో మాత్రం అదరగొట్టింది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకు ఆమె మంచి ఛాయిస్. హెబ్బా పాత్ర కూడా కీలకమైంది. ఆమె యాక్టింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. హెబ్బా గ్లామర్ షో మాత్రం కుర్రాళ్లకు కిక్కిస్తుంది. అవికాకు కూడా కీలకమైన పాత్రే దక్కింది. ఐతే ఆమె తన టాలెంట్ చూపించడానికి పెద్దగా అవకాశం దక్కలేదు. వెన్నెల కిషోర్.. సత్య.. ఇద్దరూ మంచి వినోదం పండించారు. మిగతా వాళ్లవి పరిమితమైన పాత్రలు.

సాంకేతిక వర్గం:

దర్శకుడి ప్రయత్నానికి సాంకేతిక నిపుణుల నుంచి మంచి సహకారమే లభించింది. సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాకు సాంకేతికంగా ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. కథకు తగ్గట్లు ఎంచుకున్న లొకేషన్లు.. వాటిని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమా అంతటా కెమెరా పనితనం కనిపిస్తుంది. ముఖ్యంగా కేరళ ఎపిసోడ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆర్ట్ వర్క్ కూడా బాగా కుదిరింది. బాగా ఖర్చు పెట్టారు. శేఖర్ చంద్ర బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు బలంగా నిలిచాడు. కొన్ని చోట్ల మాత్రం లౌడ్ నెస్ ఎక్కువైంది. పాటల్లో చిరునామా తన చిరునామా.. వెంటాడుతుంది. మిగతా పాటలు పర్వాలేదు. అబ్బూరి రవి మాటలు సందర్భోచితంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. బడ్జెట్ పరంగా పరిమితులున్నా.. సినిమాలో రిచ్ నెస్ ఏమీ తగ్గలేదు. మంచి క్వాలిటీ కనిపిస్తుంది అంతటా. ఇలాంటి కథకు సపోర్ట్ చేసినందుకు నిర్మాతను అభినందించాలి. ఇక ‘టైగర్’ సినిమా దర్శకుడు వీఐ ఆనంద్.. తెలుగులో తన రెండో ప్రయత్నంలో ఆశ్చర్యపరిచాడు. ‘టైగర్’కు దీనికి అసలు పోలికే ఉండదు. మామూలు కథనే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా చెప్పడంలో అతను విజయవంతమయ్యాడు. ఇది దర్శకుడి ముద్రను చూపించే సినిమా.

చివరగా: ఎక్కడికి పోతావు చిన్నవాడా.. థ్రిల్లింగ్ అండ్ ఎంటర్టైనింగ్!

రేటింగ్- 3.25/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News