కల్యాణితో విడాకుల వెనుక అసలు విషయాన్ని చెప్పిన మాజీ భర్త

Update: 2022-07-21 16:30 GMT
దర్శకుడు సూర్య కిరణ్.. నటి కల్యాణిల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరి మధ్య మొదలైన ప్రేమాయణం అంతకంతకూ పెరిగి.. పెద్దదై.. ఇద్దరూ పెళ్లి చేసుకోవటం.. దాదాపు పదిహేనేళ్ల వరకు కలిసి ఉన్న వీరిద్దరూ.. హటాత్తుగా విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన వైనం షాకింగ్ గా మారటమేకాదు.. అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ వీరిద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారు? అన్న సందేహం కలిగినా.. వీరిద్దరూ ఓపెన్ అయ్యింది లేదు.

తాజాగా సూర్యకిరణ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలతో పాటు.. కల్యాణితో విడాకుల ఎపిసోడ్ గురించి ఓపెన్ అయ్యారు. విడాకుల పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయంతో పాటు.. విడాకుల కేసు విచారణ సందర్భంగా కోర్టులో చోటు చేసుకున్న అంశాల్ని ప్రస్తావించారు. విడిపోయినప్పటికి తన మాజీ భార్య కల్యాణిపై ఉన్న ప్రేమాభిమానాల్ని చెప్పుకునే ప్రయత్నం చేశారని చెప్పాలి.

తమ పదిహేనేళ్ల దాంపత్య జీవితంలో ఎప్పుడూ ఎలాంటి అభిప్రాయ బేధాలు రాలేదని.. గొడవలే లేవన్నారు. తామెంతో అన్యోన్యంగా ఉండేవాళ్లమని.. తాను చూసిన మంచి అమ్మాయిల్లో కల్యాణి ఒకరన్నారు. అవిడ చాలా మంచి అమ్మాయి అని.. సొంత ప్రొడక్షన్ తో తీసిన సినిమాలతో ఆస్తులు పోవటం.. అప్పుల పాలు కావటంతోనే ఆమె తనకు దూరమైనట్లుగా చెప్పుకున్నారు.

విడాకుల కేసు విచారణ వేళలో విడిపోవటానికి కారణం ఏమిటన్న న్యాయమూర్తి ప్రశ్నకు కల్యాణి ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు. 'విడాకుల కోసం జడ్జి ఛాంబర్ లో కలిశాం. ఆయన నన్ను చూపిస్తూ.. ఈయన కొడతారా? తిడతారా? మీ అత్తింటి వారు ఇబ్బంది పెడుతున్నారా' అంటూ కల్యాణిని అడిగారు. దానికి ఆమె అలాంటిదేమీ లేదని చెప్పారు. మరెందుకు విడాకులు? అని అడిగితే మౌనంగా ఉన్నారు. మరి.. మీరు విడిపోతే పిల్లల బాధ్యత ఎవరిది? అని అడిగినప్పుడు.. నేనే మాకు పిల్లలు లేరని చెప్పరన్నారు. పిల్లలు లేకపోవటమే విడాకులకు కారణమా? అని అడిగితే నేనే అవునని చెప్పినట్లు చెప్పారు.

విడాకుల తీసుకున్న తర్వాత కోర్టు నుంచి బయటకు వచ్చే వేళలో.. కల్యాణితో మాట్లాడుతూ.. కాస్త వెయిట్ చేస్తే అప్పులు తీరిపోయిన తర్వాత మళ్లీ మనం పెళ్లి చేసుకుందామని చెప్పినట్లుగా చెప్పారు.

తానుఅప్పులు పాలైన వేళ.. అప్పుల వాళ్లు వచ్చి.. తనను డబ్బులు అడిగి ఇబ్బంది పెడతారన్న భయంతోనే విడాకులు తీసుకొని ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల తర్వాత భార్యతో విడాకుల వెనకున్న కారణాన్ని సూర్య కిరణ్ ఓపెన్ కావటంతో.. విడాకుల మీద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్లైంది. మరి.. దీనికి కల్యాణి ఎలా రియాక్టు అవుతారో?
Tags:    

Similar News