శ్రీతేజ్ ను పరామర్శించా.. కానీ పబ్లిసిటీ చేసుకోలేదంతే

అదే సమయంలో నటుడు జగపతి బాబు ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాను ఇప్పటికే ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించినట్లు తెలిపారు.

Update: 2024-12-23 04:48 GMT

పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతున్నాడు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నాడు.

అయితే తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చారు. దీంతో అనేక మంది సినీ సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ విషయంపై రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కరోజు పోలీస్‌ స్టేషన్‌ కు పోయిన హీరో ఇంటి దగ్గర క్యూ కట్టేశారని వ్యాఖ్యానించారు.

తల్లి చనిపోయి, 20 రోజులుగా ఓ పిల్లాడు చావుబతుకుల మధ్య ఉంటే సినీ ప్రముఖులు ఒక్కరైనా ఆస్పత్రికి వెళ్లారా? అని అసెంబ్లీలో ప్రశ్నిస్తూ మండిపడ్డారు. అసలు వారేం ఆలోచిస్తున్నారో తనకైతే తెలియదని అన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

అదే సమయంలో నటుడు జగపతి బాబు ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాను ఇప్పటికే ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించినట్లు తెలిపారు. షూటింగ్ ముగించుకుని సిటీకి రాగానే సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన శ్రీతేజ్‌ ను చూడాల‌ని అనిపించి ఆస్పత్రికి వెళ్లానని తెలిపారు. శ్రీతేజ్ తండ్రిని, చెల్లెలిని ప‌ల‌క‌రించానని చెప్పారు.

శ్రీతేజ్ ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంద‌ని, తొంద‌ర‌లోనే అత‌డు కోలుకుంటాడ‌ని భ‌రోసా ఇచ్చి వ‌చ్చానని అన్నారు. అంద‌రి కంటే ఎక్కువ‌గా ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యింది కనుక, స‌పోర్ట్ ఇవ్వాల‌నే హాస్పిట‌ల్‌ కు వెళ్లానని తెలిపారు. కానీ ప‌బ్లిసిటీ చేయ‌లేదని, అందుకే తాను వెళ్లింది ఎవ‌రికి తెలియ‌దని జ‌గ‌ప‌తి బాబు.. వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.

ఎవరూ పరామర్శించలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో తాను క్లారిటీ ఇస్తున్నట్లు పరోక్షంగా తెలిపారు జగపతి బాబు. అయితే ఇప్పటికే అల్లు అరవింద్, సుకుమార్ కూడా ఆస్పత్రికి వెళ్లారు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాక వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఎవరూ వెళ్లి పరామర్శించలేదని రేవంత్ రెడ్డి అన్నట్లు ఉన్నారు. అయితే జగపతి బాబే ఇండస్ట్రీ నుంచి వెళ్లి పరామర్శించిన తొలి వ్యక్తిగా తెలుస్తోంది.


Tags:    

Similar News