ఫేక్ క‌లెక్ష‌న్ల‌కు ఆన్ లైన్ చెక్ ఎప్పుడు?

Update: 2020-02-11 04:30 GMT
2020 సంక్రాంతికి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశాయి. ఆ క్ర‌మంలోనే బ్ర‌హ్మాండ‌మైన క‌లెక్ష‌న్లు సాధించాం అంటూ ఎవ‌రికి వారు సెల్ఫ్‌ డ‌బ్బా కొట్టుకున్నారు. ఇండ‌స్ట్రీ హిట్ .. ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటూ పోస్ట‌ర్లు వేసుకున్నారు. స‌రిలేరు నీకెవ్వ‌రు- అల వైకుంఠ‌పుర‌ములో టీమ్ లు క‌లెక్ష‌న్ల ఫిగ‌ర్ల‌తో పాటు పోస్ట‌ర్ల‌ను వేశాయి. మా సినిమా ఇంత గ్రాస్ వ‌సూలు చేసింద‌ని.. 100 కోట్ల‌ షేర్ క‌లెక్ట్ చేసింద‌ని బోలెడంత ప్ర‌చారం ఊద‌రగొట్టేశారు.

అయితే అందులో నిజం ఎంత‌? అన్న‌ది మాత్రం సామాన్యుల‌కు అర్థం కాని వ్య‌వ‌హారం. క‌నీసం  సినిమాలు తీసే నిర్మాత‌ల‌కు అయినా వాస్త‌వ క‌లెక్ష‌న్ల వివ‌రం తెలుసా? ఏరియా వైజ్ పంపిణీదారుల వ‌ర‌కూ అయినా క్లారిటీ ఉందా? అంటే ఏమో ఎవ‌రికి తెలుసు? అనుకునే ప‌రిస్థితి ఉంది. హీరోల అభిమానులు సోష‌ల్ మీడియాల్లో క‌లెక్ష‌న్ల విష‌యంలో భ‌జ‌న చేసేందుకు త‌ప్ప వాస్త‌వం ఏమిటో ఎవ‌రికీ తెలీని స‌న్నివేశం నెల‌కొంది. అయితే ఈ ప‌రిస్థితి ఇప్పుడే కాదు.. ప్ర‌తిసారీ చూస్తున్న‌దే. స్టార్ హీరోలు న‌టించే భారీ సినిమాలు రిలీజైతే క‌లెక్ష‌న్లు రికార్డులు అంటూ పోస్ట‌ర్లు ముద్రిస్తూ ఒరిజిన‌ల్ ఫిగ‌ర్స్ ఏవీ చెప్ప‌కుండా క‌న్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక జీఎస్టీ అధికారుల‌కు స‌వ్యంగా ప‌న్నులు క‌ట్టేస్తున్నారా? అన్న‌దానిపైనా ఎవ‌రికీ ఏ క్లారిటీ లేనేలేదు.

అయితే ఈ ప‌రిస్థితికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఇంత‌కుముందు సీరియ‌స్ గా ఓ నిర్ణ‌యం తీసుకుంద‌న్న ప్ర‌చారం సాగింది. ప్ర‌భుత్వమే ఆన్ లైన్ టికెటింగ్ వెబ్ సైట్ ని అభివృద్ధి చేసి తెగే టిక్కెట్లు ఎన్ని అన్న‌ది తేల్చ‌నుంద‌ని.. అలాగే టిక్కెట్టు ధ‌ర అదుపు త‌ప్ప‌కుండా కేర్ తీసుకోనుంద‌ని ప్ర‌చార‌మైంది. అందుకోసం ఓ మంత్రి గారి త‌న‌యుడే బ‌రిలోకి దిగి వెబ్ సైట్ ని డెవ‌ల‌ప్ చేయిస్తున్నార‌ని ప్ర‌చారం సాగింది. అయితే ఏమైందో కానీ ఇటీవ‌ల‌ దాని గురించిన ఎలాంటి స‌మాచారం లేదు. ఇక ఫేక్ క‌లెక్ష‌న్ల‌కు చెక్ పెట్టేందుకు యాక్టివ్ నిర్మాత‌ల గిల్డ్ (పెద్ద నిర్మాత‌లు) క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంద‌ని .. ఇక‌పై పోస్ట‌ర్ల‌పై గ్రాస్ వ‌సూళ్ల వివ‌రం త‌ప్ప షేర్ గురించి లెక్క‌లు ముద్రించాల్సిన అవ‌స‌రం లేద‌ని రూల్ పాస్ చేసింద‌ని చెబుతున్నారు. అయితే క‌లెక్ష‌న్ల వ్య‌వ‌హారంలో కేవ‌లం కొద్ది మంది నిర్మాత‌ల నియంత్ర‌ణ అన్న‌ది ఎంత‌వ‌ర‌కూ క‌రెక్ట్‌? భారీ సినిమాలు తీసేది వీళ్లే కాబ‌ట్టి త‌మ‌కు అనుకూలంగానే గ్రాస్ లెక్క‌లు చూప‌ర‌ని గ్యారెంటీ ఏదైనా ఉందా? అంటూ సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ``ఫేక్ ని ప్ర‌చారం చేసేది నేనే.. నియంత్రించేది నేనే! స‌ర్వాంత‌ర్యామి!!`` అన్న చందంగా ఒక‌రి గుప్పిట్లోకి సీన్ వెళ్లిపోతేనో? అంటూ డౌట్లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక ఈ వ్య‌వ‌హారంలో  నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు సి.కల్యాణ్ ప్ర‌మేయం ఏమీ ఉండ‌దా? అంటూ నిర్మాత‌ల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News