బాబోయ్.. ఒక్క పాటకు ఐదు సెట్లా?

Update: 2015-09-18 11:30 GMT
హీరో ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచైనా వస్తుండొచ్చు.. అతడికిదే తొలి సినిమా కావచ్చు.. అయినప్పటికీ ఒక్క పాటకి ఐదు సెట్లు వేయడం అవసరమా? ఇదే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. అక్కినేని యువ తరంగం అఖిల్ అరంగేట్ర సినిమాలో అతడి ఇంట్రడక్షన్ సాంగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఏకంగా ఐదు సెట్లు వేయడం విశేషం. ఈ సంగతి ఎవరో మాట్లాడుకుంటున్నది కాదు. స్వయంగా నిర్మాత నితిన్ ఈ మేరకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చాడు. ఈ ఆదివారం ‘అఖిల్’ ఆడియో ఫంక్షన్ గచ్చిబౌలి స్టేడియంలో భారీగా చేయబోతున్న సంగతి చెబుతూ.. ఇంట్రడక్షన్ సాంగ్ విశేషాలు వెల్లడించాడు నితిన్. అన్నపూర్ణ స్టూడియోలో కళ్లు చెదిరే రీతిలో వేసిన ఐదు భారీ సెట్లలో అఖిల్ ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేస్తున్నట్లు చెప్పాడు.

వినాయక్ ఎప్పుడూ ఇంతే మరి. అతడి తొలి సినిమా ‘ఆది’ నుంచి పాటల్లో భారీ సెట్టింగులు కనిపిస్తాయి. బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన ‘అల్లుడు శీను’తో వినాయక్ సెట్టింగుల పిచ్చి పతాక స్థాయికి చేరింది. అందులో ప్రతి పాటకూ సెట్టింగులే సెట్టింగులు. అవి కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఇప్పుడు అఖిల్ సినిమాకు బడ్జెట్ మరింతగా సపోర్ట్ చేస్తుండటంతో ఒక్కో పాటకు ఐదు సెట్లు వేయించేస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ఫారిన్ లో చేయడం వల్ల నితిన్ కు ఖర్చు తడిసి మోపెడైంది. ఐతే దానికి తగ్గట్లే బిజినెస్ కూడా జరిగే అవకాశాలుండటంతో కొంచెం ధీమాగా ఉన్నాడు నితిన్. ఐతే బడ్జెట్ హద్దులు దాటిపోవడం వల్ల పెద్దగా లాభాలు మిగిలే పరిస్థితి మాత్రం లేనట్లే. ‘అఖిల్’ బడ్జెట్ రూ.35-40 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం.
Tags:    

Similar News