ఉలిక్కిప‌డ్డ ఫిల్మ్‌న‌గ‌రం

Update: 2016-07-24 09:54 GMT
వీకెండ్ మూడ్‌ లో ఉన్న తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ (ఎఫ్‌.ఎన్‌.సి.సి)లో నిర్మాణంలో ఉన్న ఓ భ‌వ‌నం ఆదివారం  ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. దాంతో ఇద్ద‌రి ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి. ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. సినిమా సెల‌బ్రిటీల హ‌డావుడితో నిత్యం రద్దీగా ఉండే ఎఫ్‌.ఎన్‌.సి.సిలో ఇలాంటి ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం అంద‌రినీ ఉలికిపాటుకి గురిచేసింది.

ఎఫ్‌.ఎన్‌.సి.సిలో నిత్యం సినిమాకి సంబంధంచిన కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుంటాయి. ఏదైనా ఓ పెద్ద కార్య‌క్ర‌మం ఉన్న స‌మ‌యంలో ఇలాంటిది జ‌రిగుంటే పెను ప్ర‌మాదమే సంభ‌వించేద‌ని, అదృష్ట‌వ‌శాత్తూ అలాంటిదేమీ లేని స‌మ‌యంలో భ‌వ‌నం కూలిపోయింద‌ని పరిశ్ర‌మ వ‌ర్గాలు మాట్లాడుకొంటున్నాయి. ఎఫ్‌.ఎన్‌.సి.సి నిర్మాణం ఎప్పుడో జ‌రిగిపోయింది. అయితే అక్క‌డి ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని ఇటీవ‌ల అద‌నంగా మ‌రికొన్ని భవ‌నాల్ని నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఆ భ‌వ‌న‌మే ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయింది. త‌మ సొంత కార్యాల‌యంలా భావించే ఎఫ్.ఎన్‌.సి.సి.లో ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డంతో సినిమా సెల‌బ్రిటీలంతా ఒక్క‌సారి హ‌తాశుల‌య్యారు. అక్క‌డికి వెళ్లి స్వ‌యంగా ప‌రిస్థితిని అడిగి తెలుసుకొంటున్నారు.
Tags:    

Similar News