తమన్నా .. శ్రుతి ఛాన్సుల వెనుక అంత కథ నడిచిందా?

Update: 2021-11-11 11:33 GMT
తమన్నా .. శ్రుతి హాసన్ ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. తరచూ తాము ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటామనీ, ఇక ఏదైనా ఫంక్షన్లో ఇద్దరం కలిస్తే అక్కడి సందడి రెట్టింపు అవుతుందని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు కూడా. ఇటు తమన్నా అటు శ్రుతిహాసన్ ఇద్దరూ కూడా తెలుగుతో పాటు తమిళ .. హిందీ సినిమాలు చేస్తున్నవారే. గ్లామర్ పరంగా .. యాక్టింగ్ పరంగా ఎవరికి ఉండవలసిన క్రేజ్ వారికి ఉంది. ఎవరికి ఉండవలసిన మార్కెట్ వారికి ఉంది. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఈ ఇద్దరి విషయంలో ఒక తమాషా జరిగింది.

చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ 'భోళా శంకర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన శ్రుతి హాసన్ ను సంప్రదించాడు. మెగాస్టార్ తో కలిసి నటించే ఛాన్స్ మళ్లీ మళ్లీ రాదని తెలిసినా, డేట్లు సర్దుబాటు చేయలేని కారణంగా శ్రుతి హాసన్ ఈ ప్రాజెక్టును వదులుకోవలసి వచ్చింది. దాంతో ఆల్రెడీ చిరంజీవితో ఇంతకుముందు 'సైరా'లో చేసిన తమన్నాను తీసుకుంటే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారు. 'సైరా'లో తమన్నా చేసినప్పటికీ .. అది చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం వలన చిరంజీవికి దూరంగానే ఆమె పాత్ర సంచరిస్తుంది.

అదే 'భోళా శంకర్' అయితే మాస్ కంటెంట్ మస్తుగా ఉండే సినిమా. అందువలన ఆయనతో అదరగొట్టే స్టెప్పులు వేయాలనే తన ముచ్చటను తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాదు ఈ సినిమా షూటింగు మొదలయ్యేవరకూ తాను వేచి ఉండలేను సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టమని ట్విట్టర్ ద్వారా ఆమె మెహర్ రమేశ్ ను కోరింది కూడా. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. నిజానికి ఈ సమయంలో శ్రుతి హాసన్ బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా చేయవలసింది.

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రాయలసీమ నేపథ్యంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ముందుగా తమన్నాను సంప్రదించారు. దాదాపు ఆమెనే ఖాయం అన్నట్టుగా చర్చలు జరిగాయి. కానీ పారితోషికం విషయంలో తేడా రావడం వలన తమన్నా నో చెప్పేసిందట. దాంతో తనకి బాగా పరిచయమున్న శ్రుతి హాసన్ ను గోపీచంద్ ఒప్పించినట్టు చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ గోపీచంద్ మలినేని తనకి రెండు హిట్లు ఇచ్చిన కారణంగానే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఇలా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఎక్సేంజ్ చేసుకున్నట్టుగా ఒకరి సినిమా ఒకరికి సెట్ కావడం విశేషమే.
Tags:    

Similar News