మూవీ రివ్యూ: 'గీత గోవిందం'

Update: 2018-08-15 09:05 GMT
చిత్రం: 'గీత గోవిందం'

నటీనటులు: విజయ్ దేవరకొండ - రష్మిక మందానా - సుబ్బరాజు - నాగబాబు - వెన్నెల కిషోర్ - నిత్యా మీనన్ - అను ఇమ్మాన్యుయెల్ - రాహుల్ రామకృష్ణ - అభయ్ బేతిగంటి - అన్నపూర్ణ తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: మణికందన్
నిర్మాత: బన్నీ వాస్
రచన - దర్శకత్వం: పరశురామ్

‘అర్జున్ రెడ్డి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ నుంచి తర్వాత వస్తున్న ‘గీత గోవిందం’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఆహ్లాదకరమైన ప్రోమోలతో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ‘గీత గోవిందం’ ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.

కథ:

విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) చదువు పూర్తి చేసి ఒక కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్న కుర్రాడు. అతను గీత (రష్మిక మందానా) అనే అమ్మాయిని గుడిలో చూసి ప్రేమలో పడతాడు. తర్వాత అదే అమ్మాయి ఒక రోజు అతడితో బస్సులో కలిసి ప్రయాణం చేస్తుంది. ఐతే అక్కడ అనుకోకుండా విజయ్ చేసిన ఓ తప్పుతో గీత అతడిని అపార్థం చేసుకుంటుంది. అతడిపై ద్వేషం పెంచుకుంటుంది. తర్వాత అనూహ్య పరిస్థితుల్లో గీత-గోవింద్ మధ్య బంధుత్వం కలుస్తుంది. వీళ్లిద్దరూ కలిసి కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఈ స్థితిలో వీరి ప్రయాణం ఎలా సాగిందన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కథ అన్నిసార్లూ కొత్తగా.. బలంగా లేకపోయినా.. కథనంతో మ్యాజిక్ చేయగలిగే నైపుణ్యం ఉంటే ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చనడానికి చాలా రుజువులే ఉన్నాయి. ఈ తరం యువ దర్శకులు ఎక్కువగా చేస్తున్నది ఇదే. ఐతే అన్నిసార్లూ ఈ ప్రయత్నం ఫలించకపోవచ్చు. ఇలాంటి ప్రయత్నాలు చేసినపుడు ఓ మోస్తరుగా ఉన్న కథాకథనాల్ని.. సన్నివేశాల్ని కొంచెం పైకి లేపి ప్రేక్షకులకు ఎంగేజ్ చేయగలిగే లీడ్ యాక్టర్స్ దొరకడం కీలకం. పరశురామ్ కు విజయ్ దేవరకొండ రూపంలో అలాంటి హీరోనే దొరికాడు. అర్జున్ రెడ్డి పాత్రను నరనరానా జీర్ణించుకుని తెలుగులో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ యాక్టింగ్ తో ఆ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయిన విజయ్ దేవరకొండ.. ‘గీత గోవిందం’లో దానికి పూర్తి భిన్నంగా లైటర్ వీన్ లో చాలా సాధారణంగా సాగిపోయే గోవిందం పాత్రలోకి పరిణామం చెందిన తీరుకు ఫిదా కాకుండా ఉండలేం. తనకే సొంతమైన టిపికల్ కామెడీ టైమింగ్ తో అతను పండించిన వినోదమే ‘గీత గోవిందం’కు అతి పెద్ద ఆకర్షణ. మిగతా విషయాల సంగతెలా ఉన్నా.. విజయ్ పాత్రను సరిగ్గా తీర్చిదిద్దడంలోనే పరశురామ్ సగం విజయం సాధించాడు. మిగతా పని విజయ్ చూసుకున్నాడు. పలుచనైన కథ.. ఏమంత బలంగా లేని కాన్ఫ్లిక్ట్ పాయింట్.. రిపిటీటివ్ గా అనిపించే సన్నివేశాలు.. అక్కడక్కడా సాగతీత.. ఇలాంటి కంప్లైంట్లు ఉన్నప్పటికీ ‘గీత గోవిందం’ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. యువ ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతుంది.

తానో శృంగార పురుషుడినని హీరోయిన్ అపార్థం చేసుకుంటుంటే.. ‘‘మీరనుకుంటున్నట్లు ఆ విషయంలో నేను ఛాంపియన్ కాదు మేడం.. నిజానికి నాకు అందులో బేసిక్స్ కూడా తెలియవు’’ అని విజయ్ అంటాడు ఒక సీన్లో. ‘అర్జున్ రెడ్డి’లో సెక్స్ మానియాక్ లాగా కనిపించే విజయ్ పాత్రను చూసిన దృష్టితో ఇందులో అతను అమాయకంగా ఆ డైలాగ్ అంటుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది? మరో సీన్లో ‘కార్యం’ అంటే ఏంటని మార్వాడీ షాపు వాడిని అడిగితే.. అతను తనకు తెలుగు రాదని.. హిందీ మే బోల్ అని అంటాడు. దానికి బదులుగా.. ‘‘తెలుగే అర్థం కాకుండా ఉంటే.. నీకు హిందీలో ఏం బోలాలిరా’’ అంటాడు విజయ్. ఇలాంటి సన్నివేశాల్లో.. ఆ డైలాగులు చెప్పే తీరులో విజయ్ కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘అర్జున్ రెడ్డి’లో అతడిని అంత అగ్రెసివ్ గా చూసి.. ఇందులో భయం భయంగా అమాయకంగా కనిపించే పాత్రలో చూడటమే కొత్తగా అనిపిస్తుంది. నిజానికి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఇలాంటి పాత్రకు విజయ్ సూటవుతాడని ఎవ్వరూ అనుకుని ఉండరు. కానీ పరశురామ్ అతడిని నమ్మితే.. విజయ్ ఆ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఈజీగా ఈ పాత్రలోకి ట్రాన్స్ ఫామ్ అయిపోయాడు. ముందే అన్నట్లుగా విజయ్ పాత్ర.. అతడి నటనే సినిమాకు పెద్ద బలం. యూత్ ఈజీగా కనెక్టయ్యే ఆ పాత్ర వాళ్లకు కావాల్సినంత వినోదం పంచుతుంది.

ఇక కథాకథనాల విషయానికి వస్తే.. పరశురామ్ చాలా చిన్న లైన్ పట్టుకుని సినిమాను లాగించేశాడు. అతను కథ కంటే కూడా క్యారెక్టరైజేషన్ల మీద బాగా పని చేశాడు. అమాయకుడైన హీరోను హీరోయిన్ ఒక రోగ్ అనుకుంటుంది. కానీ అతను అలాంటి వాడు కాదని తెలుసుకుని తనను ప్రేమించడం నేపథ్యంలో సాగే కథ ఇది. హీరోను హీరోయిన్ అపార్థం చేసుకోవడానికి దారి తీసే సీన్ కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. కానీ అది మొత్తం సినిమాను నడిపించేంత బలమైన సీన్ అయితే కాదు. కానీ దాని గురించి పెద్దగా ఆలోచించనివ్వకుండా కథనం సరదాగా.. వేగంగా సాగిపోతుంది. హీరో హీరోయిన్ల మధ్య క్లాష్ తర్వాత ప్రథమార్ధంలో వచ్చే సీన్లు చాలా హిలేరియస్ గా సాగిపోతాయి. సినిమాకు ప్రధాన ఆకర్షణ ఆ సన్నివేశాలే. ఈ సన్నివేశాల్లో విజయ్ కొత్తగా కనిపిస్తాడు. ప్రతి సీన్లోనూ అతను ఎంటర్టైన్ చేస్తాడు. ప్రథమార్ధమంతా ప్రధానంగా యూత్ ను టార్గెట్ చేసిన దర్శకుడు.. ద్వితీయార్దంలో తన బలమైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను జోడించాడు.

ఐతే ద్వితీయార్ధంలో హీరోయిన్ సమస్యను అతడి అన్నయ్య డీల్ చేయడానికి సంబంధించిన సన్నివేశాల్లో అసలు లాజిక్ లేకపోవడంతో అవి సాధారణంగా తయారయ్యాయి. కథను ముందుకు నడిపించడానికి వేరే విషయాలేమీ లేక సింపుల్ గా తేలిపోయే విషయాన్ని సాగదీయడంతో ‘గీత గోవిందం’ కొంచెం గాడి తప్పుతుంది. ఒకే ఒక్క సంఘటనతో హీరో విషయంలో హీరోయిన్ వెంటనే అభిప్రాయం మార్చుకుని అతడి ప్రేమలో పడిపోవడం అంత సహేతుకంగా అనిపించదు. సినిమాను హడావుడిగా సినిమాను ముగింపు దశకు తీసుకెళ్లిపోయిన భావన కలుగుతుంది. హీరో హీరోయిన్ దూరం కావడానికి చూపించిన కారణాలు కూడా సమంజసంగా అనిపించవు. ఐతే ఈ దశలో వెన్నెల కిషోర్ వచ్చి ట్రాక్ తప్పుతున్న సినిమాను మళ్లీ గాడిలో పెట్టాడు. తనకు బాగా అలవాటైన ‘టెంపరరీ పెళ్లికొడుకు’ పాత్రలో కిషోర్ మరోసారి అదరగొట్టేశాడు. అన్నపూర్ణతో కలిసి అతను పండించిన కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. సినిమాను లైటర్ వీన్ లో ముగించడం కోసం కొంచెం లాజిక్ కు దూరంగానే వెళ్లాడు పరశురామ్. అది బాగానే వర్కవుటైంది. ప్రేక్షకులు చిరునవ్వులతో.. మంచి ఫీలింగ్ తో థియేటర్ల నుంచి బయటికి వస్తారు. ఓవరాల్ గా కొన్ని కంప్లైంట్లు ఉన్నప్పటికీ పెద్దగా బోర్ కొట్టించకుండా.. వినోదాత్మకంగా సాగిపోయే ‘గీత గోవిందం’ విజయ్ అభిమానులకు.. యువతకు బాగానే నచ్చే అవకాశముంది.

నటీనటులు:

విజయ్ దేవరకొండ మరోసారి మెస్మరైజ్ చేశాడు. తాను ఎంతటి విలక్షణ నటుడినో అతను రుజువు చేశాడు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఇంతటి సాఫ్ట్ క్యారెక్టర్ చేస్తూ.. అందులో ఒదిగిపోయిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. విజయ్ మార్కు కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తడి పాత్ర యువ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేస్తుంది. ఈ సినిమాతో మిగతా వాళ్లు కూడా అతడిని ఇష్టపడతారు. విజయ్ ఎమోషనల్ సీన్లలోనూ ఆకట్టుకున్నాడు. రష్మిక మందానా కూడా బాగానే చేసింది. కానీ ఒక దశ దాటాక ఆమె హావభావాలు రిపిటీటివ్ గా అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్లలో రష్మిక బాగా చేసింది. కొన్ని సన్నివేశాల్లో అందంగా కనిపించే రష్మిక.. కొన్ని సీన్లలో అంత బాగా అనిపించదు. అక్కడక్కడా మేకప్ - కాస్ట్యూమ్స్ తేడా కొట్టేయడమే అందుక్కారణం. వెన్నెల కిషోర్ ఉన్న కాసేపట్లోనూ మెరుపులు మెరిపించాడు. రాహుల్ రామకృష్ణ కూడా నవ్వించాడు. అన్నపూర్ణ కూడా తనదైన ముద్ర వేసింది. సుబ్బరాజు.. నాగబాబు.. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతికవర్గం:

గోపీసుందర్ పాటలు బాగున్నాయి. ఇంకేం ఇంకేం కావాలే.. అక్షరం చదవకుండా.. పాటలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఐతే పాటలు ఆడియోలో ఉన్నంత బాగా తెరమీద లేవు. ముఖ్యంగా ‘ఇంకేం కావాలే..’ పాట చిత్రీకరణ సాధారణంగా అనిపిస్తుంది. ఆ పాటను సరిగా ఉపయోగించుకోలేదు. మణికందన్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా అంతా కలర్ ఫుల్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ పరశురామ్.. ఓకే అనిపించాడు. అతడి గత సినిమాలతో పోలిస్తే ఇందులో కథ బలహీనమే. కానీ ప్రధాన పాత్రల్ని తీర్చిదిద్దడంలో అతడి ప్రత్యేకత కనిపిస్తుంది. ఈసారి అతను యూత్ ఫుల్ ఆలోచనలతో యువతకు నచ్చేలా సన్నివేశాల్ని నడిపించడం ద్వారా ఆ వర్గం ప్రేక్షకులకు చేరువయ్యాడు. విజయ్ దేవరకొండను అతను బాగా ఉపయోగించుకున్నాడు. అతడిని కొత్తగా చూపించి మెప్పించడం ద్వారా మార్కులు కొట్టేశాడు.

చివరగా: గీత గోవిందం.. వినోదంతో 'విజయం'

రేటింగ్-3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

Tags:    

Similar News