'గని' మల్టీ స్టారర్ అనే అనుకోవాలి: అల్లు అరవింద్

Update: 2022-04-07 04:52 GMT
'గని' సినిమాకి అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. " కష్టాలు ఎక్కువగా ఉంటే సినిమా కష్టాలు అంటూ ఉంటాము గదా. ఈ సినిమా కోసం పడిన కష్టాలను సినిమా కష్టాలుగా  చెప్పుకోవచ్చు. కరోనా సమయంలో షూటింగు ఆగిపోవడం .. పెద్ద పెద్ద సెట్లు మళ్లీ వేయవలసి రావడం .. ఈ కష్టాలన్నీ నేను చూస్తూనే వచ్చాను. ఇన్ని కష్టాలను తట్టుకుని తొణక్కుండా .. బెణక్కుండా ఈ సినిమాను రిలీజ్  చేస్తున్న నిర్మాతలను అభినందించవలసిందే.

ఈ సినిమాకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను గురించి మాత్రమే చెప్పుకోవలసి వస్తే, కిరణ్ అండ్ వరుణ్ గురించి  చెప్పుకోవాలి. ఈ సినిమాను గురించి ఆలోచన చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకూ ఈ ఇద్దరూ ఈ సినిమాను అట్టిపెట్టుకున్నారు. ఈ సినిమా కోసం ఈ క్షణం వరకూ పోరాడుతూనే ఉన్న వాళ్లిద్దరినీ ప్రశంసిస్తున్నాను. కిరణ్ ఏ చిన్న సలహా ఎంత చిన్నవాడు ఇచ్చినా తీసుకుని ఆలోచన చేస్తాడు. పెద్దవాళ్లతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తాడు. నేను కెప్టెన్ ని అనే గర్వం ఆయనలో ఎంతమాత్రం లేదు.

 ఒక రకంగా వరుణ్ ఈ సినిమాకి నిర్మాత అని కూడా అనొచ్చు. ఎందుకంటే హీరోగా తన పని పూర్తికాగానే వెళ్లిపోకుండా నిర్మాతలతో కలిసి ట్రావెల్ చేశాడు. నిజానికి వరుణ్ కి ఒంట్లో బాగోలేదు .. నిన్నంతా బెడ్ పైనే ఉన్నాడు.

ఈవెంట్ కి వస్తావా అని అడిగితే, 'మావా .. సినిమా .. పాక్కుంటైనా వస్తాను' అన్నాడు. ఉపేంద్ర విషయానికి వస్తే స్క్రీన్ పై డామినేట్ చేశాడు. ఈ సినిమా మొత్తంలో ఆయన ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక సునీల్ శెట్టి విషయానికి వస్తే, ఆయన ఏజ్ కి  .. ఎనర్జీకి పొంతనే లేదు.

ఈ సినిమాను నేను మల్టీ  స్టారర్ అనొచ్చు. ఎందుకంటే అంతా ఇంతకుముందు హీరోలుగా చేసినవాళ్లే. కాకపోతే ఈ రోజున వరుణ్ కి సపోర్టుగా నిలబడ్డారు. సయీ మంజ్రేకర్ ఈ సినిమాలో చాలా బ్యూటి ఫుల్ గా కనిపిస్తుంది. తమన్ తన మాయను ఈ సినిమాలో కూడా చూపించాడు.

నేను రష్ చూశాను ఓ లెవెల్లో ఉంది .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మళ్లీ చూశాను .. అది వేరే లెవెల్. ఇక రామజోగయ్యశాస్త్రి పాటలు .. అబ్బూరి రవి మాటలు చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాకి దగ్గర్లో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయని తెలుసు .. తెలిసి కూడా ఈ డేట్ ను ఫిక్స్ చేశాము" అంటూ ఈ సినిమాపై తనకి గల నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Tags:    

Similar News