జ్ఞాన‌వేల్ తెలివిత‌క్కువ ప‌ని?!

Update: 2018-10-09 17:20 GMT
విజ‌య్ దేవ‌ర‌కొండ `నోటా` ఫ‌లితం మార్కెట్ వ‌ర్గాల‌కు మింగుడుప‌డ‌నిది. అర్జున్‌ రెడ్డి - గీత గోవిందం వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో బ్లాక్‌ బ‌స్ట‌ర్ ఇస్తాడ‌ని న‌మ్మారంతా. కానీ అందుకు పూర్తి విరుద్ధ‌మైన ఫ‌లితాన్ని చ‌వి చూడాల్సొచ్చింది. `నోటా` చిత్రం న‌మ్మినందుకు పంపిణీదారుల మాడు ప‌గ‌ల‌గొట్టింది. ఈ మాట అంటున్న‌ది ఎవ‌రో కాదు. ప్ర‌త్య‌క్షంగా ఫ‌లితాన్ని ప‌రిశీలించిన ప్ర‌ముఖ పంపిణీదారుడు విశ్వేశ్వ‌ర‌రావు. ఇక సొంతంగా రిలీజ్ చేయాల‌న్న ఆలోచ‌న‌తో నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా వేసిన స్కెచ్ పార‌లేదు. అది అత‌డిని నిలువునా ముంచింది అన్న‌ది అట్నుంచి వినిపిస్తున్న మాట‌.

వాస్త‌వానికి దేవ‌ర‌కొండ క్రేజుతో `నోటా` చిత్రానికి ఏపీ - నైజాం - సీడెడ్ హ‌క్కుల కోసం రిలీజ్ ముందు తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. ఏపీ - 12కోట్లు - నైజాం -4కోట్లు - సీడెడ్ - 2కోట్లు మొత్తం 18 కోట్ల మేర రైట్స్‌ కి చెల్లిస్తామ‌ని పంపిణీదారులు ముందుకొచ్చారు. కేవ‌లం 12కోట్ల బ‌డ్జెట్‌ తో తీసిన ఈ సినిమాకి అది పెద్ద ఆఫ‌ర్. కానీ అదేదీ కాద‌ని ఇరు తెలుగు రాష్ట్రాల్లో జ్ఞాన‌వేల్ సొంతంగానే రిలీజ్ చేశాడు. యు.వి.క్రియేష‌న్స్ - సునీల్ నారంగ్ సాయంతో వోన్ రిలీజ్ చేసుకుని అడ్డంగా బుక్క‌య్యాడని విశ్వేశ్వ‌ర‌రావు ఓ ప్ర‌ముఖ ఆంగ్ల మీడియాకి తెలిపారు.

డిజిట‌ల్ స్క్రీనింగ్స్ - రెంట‌ల్స్ - ప‌బ్లిసిటీ అంటూ చాలానే ఖ‌ర్చే చేశారు జ్ఞాన‌వేల్‌. ఇక ఇరు రాష్ట్రాల్లో సినిమా ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. దీంతో తీవ్ర న‌ష్టాన్నే జ్ఞాన‌వేల్ ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.. అంటూ విశ్లేషించారు ఆయ‌న‌. ఈ సినిమా 4కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసి ఉండొచ్చ‌ని త‌న జ్ఞానాన్ని ఉప‌యోగించి వెల్ల‌డించారు. ఇక అక్టోబ‌ర్ 11న ఎన్టీఆర్ న‌టించిన `అర‌వింద స‌మేత‌` రిలీజ్‌ కి వ‌స్తోంది కాబ‌ట్టి ఆ ప్ర‌భావంతో ఇక `నోటా` ప‌రిస్థితేంటో.. అని అన్నారాయ‌న‌. అయితే అన్నిసార్లు ఒకే ఫ‌లితం ఆశించ‌డం క‌రెక్ట్ కాదేమో! కొన్నిసార్లు కొన్నిటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది.
Tags:    

Similar News