ఒక్కడును మించిన హిట్ కొడ‌తా -గుణశేఖర్

Update: 2015-10-06 17:30 GMT
అనుష్క టైటిల్‌ పాత్రలో రానా - అల్లు అర్జున్‌ కీలకపాత్రల్లో గుణ టీవమ్‌ వర్క్స్‌ పతాకంపై స్టార్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ స్వీయనిర్మాణ దర్శకత్వంలో రూపొందించిన 3డి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ సినిమా 'రుద్రమదేవి'. ఈ నెల 9న రిలీజ్‌ సందర్భంగా గుణశేఖర్‌ మీడియాతో కొన్ని మాటలు పంచుకున్నారు. తుపాకీ.కాం తో మాట్లాడుతూ...

రుద్రమదేవి ఆర్థిక ఇబ్బందుల గురించి ఎక్కువగా ప్రచారమైంది.. 3డి వల్లే ఇబ్బందులు వచ్చాయా? రిలీజ్‌ ఆలస్యానికి కారణం?

 ఈ సినిమాకి 3డి విషయంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. 3డికి సరిపడినంత సాంకేతిక నిపుణులు లేరు. దానివల్ల అనుకున్నది అనుకున్నట్టే రాలేదు. దాంతో చాలా ఆలస్యమైంది. అయితే మీరంతా అనుకున్నట్టే ఆర్థిక కష్టాలేవీ లేవు. శ్రమ పరంగా ఎక్కువ కష్టించాల్సొచ్చింది అంతే. అసలే 3డి స్టీరియో స్కోపిక్‌ సినిమా అవ్వడం వల్ల ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త పడాల్సి వచ్చింది. రిలీజ్‌ తేదీ పలుమార్లు వాయిదా పడింది అంటే అది ఆర్థిక కారణాల వల్ల అని అంతా ప్రచారం చేశారు. కానీ అదేం లేదు. టెక్నాలజీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. 3డిలో చిక్కుల్ని అధిగమించలేకే ఆ ఆలస్యం. మొత్తానికి అనుకున్నది సాధించాం.

రుద్రమదేవి కథ కమర్షియల్‌ గా వర్కవుటవుతుందని ఎలా అనిపించింది?

వాస్తవంగా ఈ సినిమాని గోన గన్నారెడ్డి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో తీస్తే అది కమర్షియల్‌గా వర్కవుటవుతుందని కొందరు నిర్మాతలు సలహాలిచ్చారు. కానీ నాకు రుద్రమదేవి కథ మాత్రమే కనిపించింది. ఇంకా చెప్పాలంటే రుద్రమదేవి వీరత్వం, సెన్సిబిలిటీస్‌ కనిపించాయి. ఈ చిత్రం ఒక్కడును మించిన కమర్షియల్‌ సినిమా. రుద్రమ కాలిబర్‌ ని నమ్మి నేనే నిర్మాతగా సినిమాని ప్రారంభించాను. పెద్ద పెద్ద స్టూడియోల ఓనర్లు తీయాల్సిన చిత్రాన్ని నేను తీసే సాహసం చేశాను. నన్ను నేను అంత బలంగా నమ్మి చేశాను. టెక్నాలజీ పరంగానూ ఎంతో అప్‌ డేట్‌ అయ్యాను.

రుద్రమదేవి  చేయాలన్న ఆలోచన ఎప్పటిది?

ఆంధ్రా యూనివర్శిటీలో 8వ తరగతి చదివేప్పుడు తెలుగు నాండిటేల్‌ లో రుద్రమదేవి పాఠం చదువుకున్నా. అది జ్ఞాపకాల్లో నిక్షిప్తమై ఉంది. చెన్నయ్‌ లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా ఉన్నప్పుడు బ్రేవ్‌ హార్ట్‌ అనే హాలీవుడ్‌ సినిమా చూశాను. అలాంటివి మనకు అరుదుగా వస్తాయి. 1960-70ల కాలం తర్వాత మనకి కొత్త జోనర్‌ సినిమాలు తగ్గిపోయాయి. అందుకే ఓ డిఫరెంట్‌ జోనర్‌ లో సినిమా తీయాలి అనుకున్నప్పుడు రుద్రమదేవి తీయాలనుకున్నా.

3డి టెక్నాలజీ పై శిక్షణ పొందారని విన్నాం

3డి విద్య కోసం లండన్‌ లో క్రాస్‌ కోర్స్‌ నేర్చుకున్నా. జర్మనీ వెళ్లి ట్రయల్‌ షూట్‌ చేశాను. ముందే పక్కాగా అవగాహన తెచ్చుకున్నాకే సెట్స్‌ కెళ్లాం.

బాహుబలి తర్వాత మార్కెట్‌ రేంజు పెరిగింది. మీకు అది ప్లస్సయ్యిందా?

అలాగే రుద్రమదేవి బాహుబలి కంటే ముందే మొదలైంది.. ముందే బిజినెస్‌ పూర్తయింది. రుద్రమదేవిని నమ్మి ముందుకొచ్చిన దేవుళ్లకు కమిటై సినిమాని అమ్మేశాను. కానీ బాహుబలి తర్వాత మార్కెట్‌ రేంజు పెరిగింది. ఇప్పుడు వేరొకరికి అమ్ముకుంటే భారీ లాభాలొచ్చేవే. కానీ కమిట్‌ మెంట్‌ వల్లే ముందు ఎవరికి అమ్మానో వారికి సినిమాని ఇచ్చాను . బాహుబలి ప్రభావంతో హిందీ వెర్షన్‌ కి బిజినెస్‌ బాగా అయ్యింది. బాహుబలి దేశంలో మోస్ట్‌ ఎక్స్‌ పెన్సివ్‌ మూవీ అంటూ ప్రచారమైంది. అయితే మా సినిమా టెక్నికల్లీ హైలీ మూవీ.

రుద్రమదేవిగా అనుష్కనే మొదటి ఆప్షన్‌ గా అనుకున్నారా?

రుద్రమదేవి అనుకోగానే ఆ పాత్రలో ఎవరు సరిపోతారు? అని వెతికాను. అనుష్క అయితే అరుంధతి ప్రభావం ఉంటుందని ఆలోచించా. కానీ చివరికి ప్రజల నుంచి అనుష్క అయితేనే బావుంటుందని స్పందన వచ్చింది. అలాగే గోనగన్నారెడ్డి పాత్ర కోసం మహేష్‌ - ఎన్టీఆర్‌ ఎవరినీ సంప్రదించలేదు. ఇద్దరికీ ముందునుంచి కథ తెలుసు. ఆసక్తి ఉందని చెప్పారు. కలిసి ఎప్పటికప్పుడు మాట్లాడుకునేవాళ్లం. అయితే ఈలోగానే మీడియాలో ప్రచారం అయిపోయింది. ఆ తర్వాత బన్ని తనంతట తానుగానే ఆసక్తి ఉందని ముందుకు వచ్చాడు. బన్ని ఓ మూవీ లవర్‌. నేను ఈ ప్రాజెక్టులో ఉంటాను. ఎలా ఉపయోగించుకుంటారో మీ ఇష్టం అని అన్నాడు. వరుడు లాంటి ఫ్లాప్‌ నిచ్చినా నా పనితనంపై నమ్మకంతో ఆ అవకాశం ఇచ్చాడు. రేసుగుర్రం లాంటి హిట్‌ కొట్టాక.. ఫోన్‌కాల్‌ దూరంలో ఉన్నా.. పిలిస్తే చాలు అన్నాడంటే అది బన్ని గొప్పతనం. బన్ని ఓ చట్రంను దాటి, ఇమేజ్‌ ని వదిలి ఈ పాత్రలో నటించాడు.

స్టీరియోస్కోపిక్‌ 3డి ప్రత్యేకత?

స్టీరియోస్కోపిక్‌ 3డి సినిమా అంటే తీసేప్పుడే 3డిలో చేయాలి. మామూలుగా 2డి సినిమాల్ని 3డిలకు మార్చడంలా ఇక్కడ కుదరదు. 3డికి రెండు కెమెరాలు ఒకేసారి పనిచేస్తాయి. ఎడమ కన్ను - కుడి కన్ను .. రెండిటికి రెండు లెన్సులు వేయాలి. రెండు ఫ్రేముల్ని మెర్జ్‌ చేసి ఒకేసారి చిత్రీకరిస్తారు. 2డి నుంచి 3డి కన్వర్షన్‌ చేసిన దానికంటే ఇలా తీసిన 3డి హైలీ క్వాలిటీతో కనిపిస్తుంది.

రుద్రమదేవి జీవితం అంతా ఒకే సినిమాగా చూపించారా?

రుద్రమదేవి పుట్టు నుంచి విక్టరీలో ప్రధాన ఘట్టం వరకూ చిత్రీకరించి ఆపాం. 13వ శతాబ్ధం (800 సంవత్సరాల క్రితం హిస్టరీ) కాలం నాటి పరిస్థితుల్ని, సౌత్‌ లో సింహభాగాన్ని పాలించిన కాకతీయుల చరిత్రను, రుద్రమదేవి వీరత్వాన్ని ఈ సినిమాలో చూపించాను. 2.38 నిమిషాల నిడివిలో కాకతీయుల చరిత్ర చెప్పలేం.

ఈ పయనం సాహసం అనిపించలేదా?

ఎవిఎం స్టూడియో - పద్మాలయ స్టూడియో లాంటి సంస్థలు తీయాల్సిన సినిమా ఇది. నేనొక సాధారణ టెక్నీషియన్‌ ని. రుద్రమదేవి కథ డ్రైవ్‌ చేయడం వల్లే ఈ సినిమా తీశాను. ఇళయరాజా - శ్రీకర్‌ ప్రసాద్‌ - ప్రకాష్‌ రాజ్‌ - అనుష్క - రానా - బన్ని ..అందరి సపోర్టుతో ముందుకెళ్లా.

3డి కష్టాలు వచ్చినప్పుడు వదిలేయాలని అనుకోలేదా?

ఈ సినిమా 3డి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు 3డి వదిలేయమని కొందరు సలహా ఇచ్చారు. గతంలో నేను కేవలం బాలలతో రామాయణం తీసినప్పుడు... ఎందుకూ అన్నారు. కానీ తీసి చూపించా. అది చూసే చిరంజీవి చూడాలనుంది అవకాశం ఇచ్చారు. ఇప్పుడూ అంతే.. సాహసమే అయినా నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి సినిమా తీసి రిలీజ్‌ చేస్తున్నా..

...అంటూ గుణశేఖర్‌ ఇంటర్వ్యూ ముగించారు.
Tags:    

Similar News