పోలీస్ సినిమాలు తీయడంలో తమిళ దర్శకుడు హరిది ప్రత్యేకమైన శైలి. ‘సామి’.. ‘సింగం’ లాంటి సినిమాలు చూస్తే అతడి స్టైలేంటో అర్థమవుతుంది. అతడి పోలీస్ క్యారెక్టర్లు చాలా పవర్ ఫుల్‌గా ఉంటాయి. ఆ సినిమాలు ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో సాగిపోతుంటాయి. హీరోయిజాన్ని ఇష్టపడే మాస్ ప్రేక్షకులకు అవి కనువిందే అని చెప్పాలి. ‘సామి’తో పోలీస్ స్టోరీల్లో కొత్త ట్రెండ్ కు తెరతీసిన హరి.. ఆ తర్వాత ‘సింగం’ సిరీస్ తో మరింతగా ప్రేక్షకుల్ని అలరించాడు. ఈ సిరీస్ లో మూడు సినిమాలు తీశాడతను. నాలుగో సినిమా కూడా ఉంటుందని ప్రకటించాడు కానీ.. సింగం-3 ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. అలాగని ఆ కథనేమీ అతను పక్కన పడేయలేదట.
సూర్యతో సింగం-4గా తీయాలనుకున్న కథనే విక్రమ్ హీరోగా ‘సామి’ సీక్వెల్ ‘సామి స్క్వేర్’గా మలిచినట్లు హరి వెల్లడించాడు. విక్రమ్ శైలికి తగ్గట్లుగా ఈ కథను మార్చినట్లు చెప్పాడు. కానీ కథ మాత్రం అదేనట. ఇక్కడే అతను మరో విశేషం కూడా వెల్లడించాడు. దశాబ్దంన్నర కిందట వచ్చిన ‘సామి’కి సీక్వెల్ తీయడం కోసం రాసుకున్న కథతోనే.. ఆ తర్వాత అనుకోకుండా ‘సింగం’గా తీసినట్లు అతను తెలిపాడు. ఆ రకంగా చెల్లుకు చెల్లు అయిపోయిందన్నమాట. ‘సామి’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టయింది. దాన్నే తెలుగులో ‘లక్ష్మీనరసింహా’గా తీశారు. ‘సామి’లో విక్రమ్ సరసన త్రిష నటిస్తే.. ఈసారి అతడికి జోడీగా కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్ కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.సెప్టెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.