అమ్మ, నాన్న... తర్వాత చిరంజీవి

Update: 2015-08-24 04:20 GMT
తన లాంటి అభిమానులందరికీ అమ్మ, నాన్న తర్వాత అత్యంత ఇష్టమైంది చిరంజీవి అని చెప్పాడు డైరెక్టర్ హరీష్ శంకర్. సుబ్రమణ్యం ఫర్ సేల్ ఆడియో  ఫంక్షన్ సందర్భంగా ఖుషి సినిమాలో డైలాగుల్ని గుర్తుకు తెస్తూ ఆసక్తికర ముచ్చట్లు చెప్పాడు హరీష్. అతనేమన్నాడంటే..

‘‘ఖుషి సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది.  అందులో భూమికను పవన్ కళ్యాణ్ నీకెవరంటే ఇష్టం అనడుగుతాడు. దానికి ‘చిరంజీవి’ అని బదులిస్తుంది. ఐతే ఆ సీన్ లో తర్వాతి రెండు నిమిషాలు డైలాగులేంటో ఎవరికీ అర్థం కావు. ఎందుకంటే అంతగా అరుపులు, కేకలు. అక్కడొచ్చే డైలాగుల  కోసమే నేను కూడా రెండోసారి సినిమా చూశా. అమ్మ, నాన్న, చిరంజీవి అంటే అందరికీ ఇష్టమే అంటాడు పవన్. అది వంద శాతం నిజం.  నాకు కూడా అమ్మ, నాన్న తర్వాత అత్యంత ఇష్టమైంది చిరంజీవి. నేనే కాదు.. అభిమానులందరం చిరంజీవిని గుండెల్లో పెట్టుకున్నాం. సుబ్రమణ్యం ఫర్ సేల్ కోసం మెగాస్టార్ పాట ఏదైనా రీమిక్స్ చేద్దామని చూస్తే.. ఏదో తేల్చుకోలేకపోయాం. చివరికి బాగా ఆలోచించి గువ్వా గోరింక పాట రీమిక్స్ చేశాం. చాలామంది అడుగుతున్నారు.. సాయిధరమ్ ను చిరంజీవిలా, పవన్ కళ్యాణ్ లా చూపించడానికి ఎక్స్ ట్రా కేర్ ఏమైనా తీసుకున్నావా అని. కానీ నేను చేసిందేమీ లేదు. ఎందుకంటే తేజు అలాగే ఉన్నాడు. మేనమామ పోలికలు మేనల్లుడికి రాక ఇంకెవరికి వస్తాయి. అది జీన్స్. అది సైన్స్. నాకు కూడా మా మేనమామ పోలికలొచ్చాయి. కానా మా మావయ్య మెగాస్టార్ కాదు కాబట్టి ఎవరికీ తెలియదు.

గబ్బర్ సింగ్ సిట్టింగ్స్ జరుగుతుండగా.. తేజును చూశాను. ఎవరీ అబ్బాయి భలే ఉన్నాడే అనుకున్నా. తర్వాత అతడి గురించి తెలిసింది. ఒక్కో స్క్రిప్టు ఒక్కో హీరోను వెదుక్కుంటుందంటారు. అలా సుబ్రమణ్యం ఫర్ సేల్ తేజును వెతుక్కుంది. సాయిధరమ్ తన ఎనర్జీతో నాకు ఎనర్జీ ఇచ్చాడు. మామూలుగా అన్న డైరెక్టర్ అయితే తమ్ముడు తనను హీరోగా పెట్టి సినిమా తీయమంటాడు. ఐతే మా తమ్ముడు నన్నలా అడగలేదు. ఐతే ఈ సినిమాతో ఓ హీరో నా తమ్ముడయ్యాడు. అతనే సాయిధరమ్. నేనేదో అతణ్ని స్టార్ ను చేయబోతున్నానని అందరూ అనుకుంటున్నారు. కానీ అతనో స్టార్ అని తెలిసే తనతో సినిమా చేశా. ఇదీ వాస్తవం. రెజీనా ఈ సినిమాతో తాను స్టూడెంటులాగా చాలా నేర్చుకున్నానని చెప్పింది.  వాస్తవం ఏంటంటే.. మాస్టార్లు బాగా చదివే స్టూడెంట్ల వెనకే పడతారు. నేను కూడా రెజీనా వెంట పడ్డా. తను చాలా మంచి స్టూడెంట్. డిస్టింక్షన్లో పాసైంది. సాయిధరమ్, రెజీనా ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డారు. గువ్వా గోరింకా పాట షూటింగ్ జరిగినన్నాళ్లూ రెండు మూడు గంటలే నిద్రపోయారు. అదీ వాళ్ల డెడికేషన్’’ అన్నాడు.
Tags:    

Similar News