పవన్ అభిమానులతో రాజీకొచ్చాడు..

Update: 2017-03-04 11:00 GMT
స్టార్ హీరోల వీరాభిమానులతో వచ్చిన ఇబ్బంది ఇదే. ఎవరైనా వారితో సున్నం పెట్టుకుంటే అంతే సంగతులు. ముందు వెనుకలు ఆలోచించకుండా అవతల వాళ్లపై పడిపోతారు. పవన్ కళ్యాణ్ అభిమానులు.. అల్లు అర్జున్ మీద చూపిస్తున్న వ్యతిరేకత అలాంటిదే. తాను చేసిన ‘చెప్పను బ్రదర్’ కామెంట్లపై వివరణ ఇచ్చినా.. మెగా వేడుకల్లో పవన్ ఫ్యాన్స్ చేసే అల్లరి వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వివరిస్తూ.. హితవు చెప్పే ప్రయత్నం చేసినా పవర్ స్టార్ అభిమానులు ఏం మారలేదు. మెగా వేడుకల్లో అల్లరి కొనసాగించారు. బన్నీ మీద వ్యతిరేకతను కొనసాగించారు. తాజాగా ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ కు ఎలా డిజ్ లైక్స్ కొట్టారో కూడా తెలిసిందే.

ఈ క్రమంలో ‘దువ్వాడ జగన్నాథం’ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ కు కావాల్సిన వాడని కూడా మరిచిపోయారు. హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ను పవన్ ఇచ్చిన విషయమూ పక్కనబెట్టేశారు. తన సినిమా మీద చూపించిన వ్యతిరేకత హరీష్ శంకర్ కు కూడా కోపం తెప్పించేసింది. నిప్పులు చిమ్ముతూ.. అంటూ శ్రీ శ్రీ కవితను కోట్ చేస్తూ ఈ టీజర్ ను వ్యతిరేకించిన వాళ్లకు పరోక్షంగా చురకలంటించాడు హరీష్. దీంతో పవన్ అభిమానులకు మండిపోయింది. హరీష్ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ పోయింది. అతడినీ తిట్టడం మొదలుపెట్టారు. ఐతే పవన్ అభిమానుల్ని కెలికితే మరింతగా రెచ్చిపోతారని అర్థం చేసుకున్న హరీష్.. రాజీకొచ్చేశాడు. ‘కాటమరాయుడు’ గురించి ఒక పాజిటివ్ ట్వీట్ పెట్టాడు. మిర్రా మిర్రా మీసం పాట గురించి స్పందిస్తూ.. రికార్డులన్నీ పవన్ కైవసం కాబోతున్నాయన్నాడు. దీంతో పవన్ అభిమానులు శాంతించారు. హరీష్ తో భాయి భాయి అంటూ చేతులు కలిపేశారు. ఆ విధంగా పవన్ అభిమానులతో శత్రుత్వానికి ఆదిలోనే తెరదించాడు హరీష్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News