అప్పుడు మీరు చేసిన పని ఇప్పుడు జీవిత చేస్తే తప్పయ్యిందా?

Update: 2019-10-23 10:33 GMT
మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ అధ్యక్షుడు వీకే నరేష్‌ కు వ్యతిరేకంగా జనరల్‌ సెక్రటరీ జీవిత మరియు అసోషియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ పలువురు మొన్న ఆదివారం ఫ్రెండ్లీ మీటింగ్‌ ను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. మా అధ్యక్షుడి హోదాలో నేను మీటింగ్స్‌ నిర్వహించాల్సి ఉండగా మీరు ఎలా మీటింగ్‌ పెడతారు అంటూ అధ్యక్షుడు నరేష్‌ మీడియా ముందుకు వచ్చి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయమై పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్టపరమైన చర్యలకు సిద్దం అవుతానంటూ హెచ్చరించాడు.

నరేష్‌ వ్యాఖ్యలపై స్పందించేందుకు జనరల్‌ సెక్రటరీ జీవిత.. సభ్యులు హేమ మరియు జయలక్ష్మిలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా హేమ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. అధ్యక్షుడు నరేష్‌ పై హేమ సంచలన వ్యాఖ్యలు చేయడంతో మా వివాదం మరింత ముదిరినట్లయ్యింది. మా మొదటి జనరల్‌ బాడీ మీటింగ్‌ లో చాలా గొడవలు జరిగాయి. ఆ సమయంలో ఆయనకు ఇష్టం వచ్చిన వారిని మీటింగ్‌ కు తీసుకు వచ్చారు. ఆయన అనుకున్నవి చెప్పారు. ఆ సమయంలోనే చాలా మంది వ్యతిరేకించారు.

గతంలో శివాజీ రాజా గారు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నరేష్‌ గారు జనరల్‌ సెక్రటరీగా ఉన్నారు. ఆ సమయంలో జనరల్‌ సెక్రటరీ హోదాలో నేను మీటింగ్‌ పెట్టేందుకు అర్హుడిని.. నాకు ఆ అధికారం ఉంది అంటూ మీరు అన్నారు. మీరు ఆఫీస్‌కు తాళం వేసుకుని వెళ్లారు. అప్పుడు మీరు చేసిందేమీ తప్పు కాదు. కాని ఇప్పుడు జనరల్‌ సెక్రటరీ అయిన జీవిత గారు ఫ్రెండ్లీ మీటింగ్‌ పెడితే మాత్రం తప్పు అయ్యిందా అంటూ ప్రశ్నించారు. మీకు గతంలో ఉన్న హక్కు ఇప్పుడు జీవిత గారికి ఎందుకు ఉండదు అంటూ హేమ ఫైర్‌ అయ్యింది.

మాపై పరువు నష్టం దావాలు వేసేందుకు.. మీటింగ్‌ కు సభ్యులు హాజరు కాకుండా మెసేజ్‌ లు పంపించడం.. వారిని హెచ్చరించడానికి మాత్రం ఉన్న సమయం మీటింగ్‌ కు రావడానికి మాత్రం ఉండదా. ఇప్పటి వరకు మీపై గౌరవంతో మాట్లాడం.. అదే గౌరవంతో మేము పెట్టిన మీటింగ్‌ గురించి వివరణ ఇస్తున్నామని హేమ చెప్పుకొచ్చింది. హేమ వ్యాఖ్యలపై మా ప్రెసిడెంట్‌ నరేష్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.
Tags:    

Similar News