'మా' పై హేమ మైండ్ గేమ్‌!

Update: 2019-03-09 13:52 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌తో ర‌క్తి క‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. శివాజీ రాజా ప్యానెల్ - న‌రేష్ ప్యానెల్ మ‌ధ్య పోటాపోటీ నెల‌కొంది. ఆ క్ర‌మంలోనే ప్ర‌త్య‌ర్థుల‌పై ఒక‌రికొక‌రు ఫిర్యాదులు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఆ ఇద్దరి మ‌ధ్య‌లో శ్రీ‌రెడ్డి ఎంట్రీ గురించి తెలిసిందే. ఈ అమ్మ‌డు అనూహ్యం గా తెర‌పైకి వ‌చ్చి శివాజీ రాజా బృందానికి స‌పోర్టుగా నిలిచింది. న‌రేష్ ప్యానెల్ లో మంచి వాళ్లు లేర‌ని విమ‌ర్శించింది. తాజాగా ఈ ఎన్నిక‌ల్లో న‌టి హేమ పాత్ర ఎంత‌వ‌ర‌కూ అన్న‌ది రివీలైంది.

ఇప్ప‌టికే శివాజీ రాజా ప్యానెల్ లో మ‌హిళ‌ల‌కు స‌రైన ప్రాధాన్య‌త‌నివ్వ‌లేద‌న్న విమ‌ర్శ ఉంది. ఒక‌రిద్ద‌రు ఈసీ స‌భ్యులుగా ఉన్నా.. మ‌హిళామ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవీ లేవు. న‌రేష్ ప్యానెల్ లో జీవిత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బ‌రిలో దిగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా న‌టి హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ బరిలో నిల‌వ‌డం ఫిలింన‌గ‌ర్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ ఆదివారం జ‌ర‌గ‌నున్న‌ ఎన్నికల్లో హేమ‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే గ‌త సీజన్‌లో శివాజీ రాజా వెంటే నిలిచిన హేమ ఆ క‌మిటీలో ఈసీ మెంబ‌ర్ గా యాక్టివ్ గా ప‌లు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించారు. కానీ ఈసారి శివాజీ రాజా ప్యానెల్ త‌ర‌పున కాకుండా స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. అందుకు కార‌ణాలేంటి? అని ప్ర‌శ్నిస్తే .. త‌న‌కు ఆ ప్యానెల్ లో స‌రైన ప్రాధాన్య‌త ల‌భించ‌లేద‌ని అందుకే స్వాతంత్ర్యం గా పోటీ చేస్తున్నాన‌ని హేమ తెలిపారు.

ఎలా పోటీ చేసినా తాను మా స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు నిల‌బ‌డ‌తాన‌ని అన్నారు. మ‌హిళా స‌భ్యుల మ‌ద్ధ‌తు త‌న‌కే ఉంటుంద‌ని అన్నారు. రెండు ఉపాధ్యక్ష పదవులకు పోటీ పడుతున్న వారిలో హేమతో పాటు బెనర్జీ - హరనాథబాబు - మాణిక్ - ఎస్వీ కృష్ణారెడ్డి ఉన్నారు. దాదాపు 800 మంది స‌భ్యులున్న మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నిక‌ల‌పై అంద‌రి క‌ళ్లు ఉన్నాయి. ఆదివారం సాయంత్రానికి రిజ‌ల్ట్ ఏంటో తేలిపోనుంది. ఇక ఎవ‌రు అధ్య‌క్షుడు అయినా వారితో క‌లిసి ప‌ని చేసేందుకే హేమ ఇలాంటి తెలివైన ఎత్తుగ‌డ వేసింద‌ని అంతా ముచ్చ‌టించుకుంటున్నారు. హేమ మైండ్ గేమ్ మామూలుగా లేదే అంటూ కితాబిచ్చేస్తున్నారు!

Tags:    

Similar News