యంగ్ హీరోకి ఎవ‌రి అండా లేదా?

Update: 2019-08-14 06:08 GMT
వెర్స‌టైల్ స్టార్ శ‌ర్వానంద్ న‌టించిన `రణ‌రంగం` ఈ గురువారం (ఆగ‌స్టు 15) ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. హైద‌రాబాద్ లో జ‌రిగిన ప్రీరిలీజ్ వేడుక‌లో నితిన్ ముఖ్య అతిధిగా పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌లో క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ గురించి మాట్లాడుతూ యంగ్ హీరో నితిన్ ఓ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను చేశారు. ``ఇండ‌స్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరో శ‌ర్వానంద్. అత‌డంటే నాకు ఎంతో ఇష్టం. త‌నో టెర్రిఫిక్ యాక్ట‌ర్`` అంటూ పొగిడేశారు.

నిజ‌మే ప‌రిశ్ర‌మ‌లో ఏ అండా లేకుండానే శ‌ర్వానంద్ న‌టుడు అయ్యారు. చిన్నా చిత‌కా పాత్ర‌ల‌తో మొద‌లై అంచెలంచెలుగా త‌నని తాను ఆవిష్క‌రించుకున్న‌ తీరు అస‌మానం. ఒక మామూలు న‌టుడు హీరోగా ఎదిగాడు. ఇప్పుడు త‌న‌కంటూ ఓ మార్కెట్ ని సృష్టించుకున్నాడు. ఎదిగే క్ర‌మంలోనే స్నేహితులైన చ‌ర‌ణ్.. నితిన్ స‌హా ప‌లువురు అత‌డికి బాస‌ట‌గా నిలిచారు. శ‌ర్వానంద్ హార్డ్ వ‌ర్క్.. డెడికేష‌న్ గురించి మెగాస్టార్ చిరంజీవి ప‌లు వేదిక‌ల‌పై ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి న‌టించిన శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో శ‌ర్వానంద్ ఒక చిన్న అతిధి పాత్ర‌లో న‌టించిన సంగ‌తిని గుర్తు చేసుకోవాల్సిన  సంద‌ర్భమిది. అందుకే నితిన్ అన్న మాట‌లు అభిమానుల‌కు వెంట‌నే క‌నెక్ట‌య్యాయి.

న‌వ‌త‌రం హీరోల్లో వైవిధ్యం ఉన్న స్క్రిప్టుల్ని ఎంచుకుని ప్ర‌యోగాలు చేసే అరుదైన‌ హీరోగానూ శ‌ర్వానంద్ కి గుర్తింపు ఉంది. కొంత ఎదిగాక‌ సొంతంగా సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్న అనుభవం కూడా త‌న‌కు ఉంది. కెరీర్ లో అన్నిర‌కాల ఒడిదుడుకుల్ని త‌ట్టుకుని ఇప్ప‌టికి హీరోగా నిల‌దొక్కుకోగ‌లిగారు శ‌ర్వా. మునుముందు అత‌డు స‌క్సెస్ స్ట్రీక్ ని కొన‌సాగించే హీరోగా మార్కెట్ వ‌ర్గాల‌కు న‌మ్మ‌కం తేగ‌ల‌గ‌డం ఆస‌క్తిక‌రం.
Tags:    

Similar News