అంటే.. ఓటీటీలో స్పందన ఎలా ఉంది..?

Update: 2022-07-14 05:30 GMT
నేచురల్ స్టార్ నాని మరియు నజ్రియా నజీమ్ ఫహాద్ జంటగా నటించిన చిత్రం 'అంటే.. సుందరానికి'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేకపోయింది. దీంతో అనుకున్న సమయం కంటే కాస్త ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది.

ఇటీవల కాలంలో సినిమాలన్నీ నెల తిరక్కుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో.. 'అంటే సుందరానికీ' మూవీ కూడా ముందుగానే వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ ఈ విషయాన్ని ఖండించారు. అవన్నీ నిజం కాదని.. అంత త్వరగా ఓటీలోకి రాదని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ నాని సినిమా నాలుగు వారాల్లోనే డిజిటల్ వేదిక మీదకొచ్చింది.

ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో 'అంటే సుందరానికి' సినిమా జూలై 10న తెలుగు తమిళ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబడింది.  ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమాపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

నాని చాలా రోజుల తర్వాత మరోసారి తన కామెడీ యాంగిల్‌ తో అలరించాడని.. హీరోహీరోయిన్‌ల మధ్య కెమెస్ట్రీ బాగా సెట్ అయిందని ఓటీటీ ప్రేక్షకులు అంటున్నారు. కాకపోతే నాని - నజ్రీయా మధ్య కాస్తంత రొమాంటిక్ సన్నివేశాలు చూపించి ఉంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు.

సినిమా ప్రారంభమైన చాలా సేపటి వరకు హీరోహీరోయిన్ ట్రాక్ ప్రవేశించకపోవడంతో ఆసక్తికరంగా అనిపించలేదని భావిస్తున్నారు. ఓ వర్గం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సినిమా కథనం కాస్త గందరగోళంగా ఉందని.. ఇంటర్వెల్ సమయానికి కాస్త ఓకే అనిపించినా కథలోకి ఇన్వాల్వ్ చేయలేకపోతోందని అభిప్రాయ పడుతున్నారు.

నటీనటులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారని ప్రశంసిస్తున్నారు. కొన్ని సీన్స్ ను మరీ సాగదీయడంతో ఒకింత బోరింగ్‌ గా అనిపించాయని.. నిడివిపై దృష్టిపెట్టాల్సిందని చెబుతున్నారు. ఎమోషన్స్‌ పండించినా.. క్లైమాక్స్ ఇంకా బాగా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు.

ఓటీటీలో సినిమాను వీక్షించిన ప్రేక్షకులు చాలా డిటైలింగ్‌ గా సినిమా గురించి చర్చించుకుంటున్నారు. కాకపోతే ఓటీటీలో బోరింగ్ సీన్స్ ని స్కిప్ చేసే వెసులుబాటు ఉండటంతో.. బాగానే ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ వారంలో రెండో స్థానంలో నిలిచింది.

'అంటే సుందరానికి' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ రోల్ లో కనిపించగా.. నరేష్ - రోహిణి - అజుగల్ పెర్మ్యూల్ - నదియా - తన్వీ రామ్ - హర్ష వర్ధన్ - రాహుల్ రామకృష్ణ - శ్రీకాంత్ అయ్యంగార్ - పృథ్వీరాజ్ - వెంకటేష్ మహా తదితరులు ఇతర పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా.. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.
Tags:    

Similar News