శ‌ర్వా గాయం ఎంత పెద్ద‌దో చెప్పిన వైద్యులు!

Update: 2019-06-18 09:41 GMT
'96` సినిమా షూటింగ్ లో శ‌ర్వానంద్  భుజానికి గాయం కావ‌టం తెలిసిదే. స్కై డైవింగ్ శిక్ష‌ణ తీసుకుంటున్న వేళ‌.. శ‌ర్వా భుజానికి.. కాలికి గాయమైంది. ఆ వెంట‌నే థాయ్ లాండ్ నుంచి హైద‌రాబాద్ చేరుకున్న ఆయ‌న ప్ర‌ముఖ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ గురువారెడ్డికి చెందిన స‌న్ షైన్ ఆసుప‌త్రిలో చేరారు. శ‌ర్వాకు డాక్ట‌ర్ గుర‌వారెడ్డే స్వ‌యంగా స‌ర్జ‌రీ చేశారు.

శ‌ర్వా గాయం తీవ్ర‌త‌ను గురువారెడ్డి చెప్పుకొచ్చారు. భుజానికి జ‌రిగిన ఆప‌రేష‌న్ నాలుగు గంట‌ల పాటు ఎందుకు జ‌రిగింది?  ఆ త‌ర్వాత జ‌రిగిన ప్లాస్టిక్ స‌ర్జ‌రీ ఐదు గంట‌ల పాటు ఎందుకు జ‌రిగింద‌న్న విష‌యాన్ని వివ‌రించారు. శ‌ర్వాతో త‌న‌కు ప‌దిహేనేళ్ల అనుభ‌వం ఉంద‌ని.. త‌మ కుటుంబ స‌భ్యుడిగా తాను భావిస్తాన‌ని చెప్పారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు థాయ్ లాండ్ లో జ‌రిగిన ప్ర‌మాదంలో షోల్డ‌ర్ బోన్ ఫ్యాక్చ‌ర్ అయ్యింద‌న్నారు. ఆ ఫ్యాక్చ‌ర్ ఐదారు ముక్క‌లుగా అయ్యింద‌ని.. త‌మ టీంలోని డాక్ట‌ర్ క‌మ‌లాక‌ర్.. డాక్ట‌ర్ సుబ్ర‌మ‌ణ్యం.. డాక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్.. ప్లాస్టిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ భ‌వానీ.. ఎన‌స్తీషియా డాక్ట‌ర్ గిరితో స‌హా తాను కూడా ఆప‌రేష‌న్లో పాల్గొన్న‌ట్లు చెప్పారు.

బోన్ ఫ్యాక్చ‌ర్ నాలుగైదు ముక్క‌లు కావ‌టం వ‌ల్ల చాలా స‌మ‌యం తీసుకుంద‌న్నారు. స‌ర్జ‌రీని స‌క్సెస్ ఫుల్ గా పూర్తి చేశామ‌ని.. కుడి భుజం కావ‌టంతో స్టిఫ్ గా ఉంటుంద‌ని.. మామూలు కావ‌టానికి కొంత కాలం ప‌డుతుంద‌ని.. రెండు నెల‌లు ఫిజియోథెర‌పీ చేస్తామ‌న్నారు. కాలిలో చిన్న ఫ్రాక్చ‌ర్ అయ్యింద‌ని.. దాని గురించి కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఐసీయూ నుంచి రూంకు షిఫ్ట్ చేశామ‌ని.. రెండు రోజుల్లో ఇంటికి డిశ్చార్జ్ చేసిన‌ట్లుగా చెప్పారు. గుర‌వారెడ్డి మాట‌ల్ని చూస్తే.. ప్ర‌మాదం చిన్న‌దిగా కనిపించినా.. ఎముక‌లు విరిగిన తీరు మాత్రం ఇబ్బందిక‌రంగా ఉండ‌టం వ‌ల్లే స‌ర్జ‌రీ ఆల‌స్య‌మైంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఈ లెక్క‌న శ‌ర్వా పూర్తిస్థాయిలో ఫిట్ కావాలంటే త‌క్కువ‌లో త‌క్కువ మూడు.. నాలుగు నెల‌ల‌కు పైనే ప‌డుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News