ఎన్నికలొచ్చాయి.. సినిమా వాళ్లకు పండగే

Update: 2018-11-13 08:17 GMT
నిజానికి ఎన్నికలు వచ్చాయంటే అందరికీ పండగే. ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచి అంతటా సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో చాలామందికి మంచి గిరాకీ ఉంటుంది. చేయడానికి చాలా పనులుంటాయి. సంపాదించడానికి చాలా మార్గాలుంటాయి. బయటి జనాలే కాదు.. సినిమా వాళ్లకు కూడా ఈ సమయంలో బోలెడంత పని దొరుకుతుంది. ప్రచార కార్యక్రమాల్లో వారి పాత్ర చాలా కీలకం. పార్టీల కోసం ప్రచార గీతాలు రూపొందించడం మొదలుకుని.. ఎన్నో పనులుంటాయి. సినీ రంగంలో దాదాపుగా ప్రతి విభాగానికీ ఈ సమయంలో పని దొరుకుతుంది. కొంచెం ఖాళీ ఉన్న దర్శకులు సైతం ఈ సమయంలో పార్టీల కోసం ప్రచార వీడియోలు రూపొందిస్తుంటారు. అందరూ తెర వెనుక ఉండి పనులు కానిస్తుంటారు.

గీత రచయితలకు ఈ సమమంలో మామూలు డిమాండ్ ఉండదు. అలాగే సంగీత దర్శకులకు కూడా చేతి నిండా పని ఉంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయి డిజిటల్ ప్రచారం చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఇందుకోసం సినిమా వాళ్ల సాయం బాగానే తీసుకుంటున్నాయి వివిధ పార్టీలు. షార్ట్ ఫిలిమ్స్ తీసే ఛోటా మోటా ఫిలిం మేకర్స్ కూడా ఎన్నికల సీజన్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాదు.. నియోజకవర్గాల స్థాయిలోనూ సినిమా వాళ్లు పాటలు.. వీడియోలు రూపొందిస్తుండటం విశేషం. ఇక ఈ సమయంలో జర్నలిస్టులకు కూడా మాంచి డిమాండే ఉంటుంది. ఈసారి తెలంగాణ ఎన్నికలు ముందే జరుగుతుండటంతో ఇప్పటి నుంచే సందడి మొదలైపోయింది. మధ్యలో కొన్ని నెలల విరామం తర్వాత.. సార్వత్రిక ఎన్నికలు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇంకో ఆరు నెలల పాటు వీళ్లందరికీ చేతి నిండా పనే.
Tags:    

Similar News