ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టం: కొరటాల

Update: 2022-04-27 15:30 GMT
మెగా అభిమానులంతా ఇప్పుడు 'ఆచార్య' సినిమా కోసం ఎంతో ఆసక్తితో .. ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి నిర్మించారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, చరణ్ -  పూజ హెగ్డే జంటగా కనిపించనున్నారు. చిరంజీవి -  చరణ్ ఇద్దరూ కూడా నక్సలైట్లుగా ఈ సినిమాలో నటించారు. 'ధర్మస్థలి' అనే ఒక ప్రదేశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఇద్దరు వ్యక్తులు చేసే పోరాటం ఇది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ' మీకు బాగా నచ్చిన సినిమాలేమిటి?' అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో కొరటాలకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. 'సాగరసంగమం' అంటే నాకు చాలా ఇష్టం. కళ పట్ల అంకితభావం ..  ప్రేమ పట్ల త్యాగం .. జీవితానికి గల పరమార్థం .. ఇవన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. చాలా అద్భుతమైన స్క్రిప్ట్ ఇది. అందువల్లనే ఈ రోజుకీ ఈ సినిమాను చూడగలుగుతున్నాము .. ఆస్వాదించగలుగుతున్నాము. ఇది క్లాసికల్ మూవీ అయినప్పటికీ కమర్షియల్ అంశాలు పుష్కలంగా కనిపిస్తాయి.

అలాగే  శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'భారతీయుడు' సినిమా అంటే కూడా నాకు చాలా ఇష్టం. అవినీతిని సహించలేని కథానాయకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అవినీతికి పాల్పడింది కన్నకొడుకైనా  సరే శిక్షను అనుభవించవలసిందే అనే ఒక తండ్రి కథ.

ఇది కూడా చాలా గొప్ప స్క్రిప్ట్. అందువల్లనే ఇప్పటికీ ఈ సినిమాను గురించి మాట్లాడుకుంటున్నారు. స్క్రిప్ట్ విషయంలో ఆ సినిమాల ప్రభావం నాపై ఉంటుంది. అందుకే స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడను" అని చెప్పుకొచ్చారు.

దర్శకుడిగా 'మిర్చి' సినిమాతో పరిచయమైన కొరటాల, ఆ తరువాత ఒకదానికి మించి మరొకటి గా హిట్స్ ఇస్తూ వెళుతున్నాడు. ఇంతవరకూ ఆయనకి ఫ్లాప్ అనేది తెలియదు. అందుకు కారణం ఆయన తయారు చేసుకునే కథాకథనాలు .. పాత్రలను డిజైన్ చేసే తీరు అనే చెప్పాలి.

'ఆచార్య' సినిమాకి కూడా అవే ప్రధానమైన బలంగా నిలవనున్నాయి. ఆ తరువాత  సినిమాను ఆయన ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ఇది కూడా భారీ ప్రాజెక్టేనని ఆయన  చెప్పడంతో, అందరిలో మరింతగా ఆసక్తి పెరుగుతోంది. తొలి ఆటతోనే ఈ సినిమా రికార్డుల వేట మొదలుపెడుతుందేమో  చూడాలి.
Tags:    

Similar News