సిరి వెన్నెల లేకపోతే... బాలూ మాట

Update: 2021-12-01 11:02 GMT
సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సాహితీ శిఖరం. ఆయన ఎంచుకున్న మార్గం. సినీ గీతాలను రచించడం. మరి సినీ కవిగా ఆయన మారకపోయి ఉంటే ఏమయ్యేవారు అంటే కచ్చితంగా ఆయన మహా కవి అయ్యేవారు అందులో రెండవ మాటకు అవకాశమే లేదు. ఎందుకంటే ఆయనలోని సాహితీ ప్రకర్ష ఎంతో గొప్పది. ఆయన చిన్ననాటి నుంచే అద్భుతమైన కవిత్వాన్ని సృజించారు. ఆయన సినీ రంగానికి రాక ముందే ఎన్నో కవితలను, కధలను రాసి తన సత్తా చాటుకున్నారు. జగమంత కుటుంబం నాది అని అలనాడే రాసి రంజింపచేసిన కలమది.

అయితే సినిమా రంగానికి వచ్చి ఆయన ఏమైనా కోల్పోయాడా అంటే సాహితీవేత్తలు అనే మాట అయితే చాలానే కోల్పోయాడు అనే. ఆయన లాంటి పండితుడికి వాణిజ్యపరమైన చిత్ర సీమలో ప్రతిభను చూపించేందుకు సంపూర్ణమైన అవకాశాలు లేవన్నదే సాహితీకారుల మాట. ఒక దేవులపల్లి. శ్రీశ్రీ లాంటి స్థాయి కలిగిన సిరి వెన్నెల తన సాహిత్యాన్ని అంతా సినిమా పాటల రూపంలో పెట్టేశారు. అయితే అది కూడా చాలా తక్కువ.

ఆయనలో ఇంకా నిబిడీకృతమైన కవితా సంపద ఎంతో ఉంది. దాన్ని బయటకు తీసే అవకాశం కానీ వాడే పరిస్థితి కానీ సినీ గీతాలు ఎక్కువగా ఇవ్వలేదు. అదే ఆయన కవిగా బయట ఉంటే ఎన్నో కావ్యాలను, ప్రబంధాలనే ఆవిష్కరించేవారు అంటారు. అయితే ఆయన బలమైన సినిమా మాధ్యమాన్ని నమ్ముకుని తన ప్రతిభను వీలైనంత ఎక్కువగానే చూపించారు. ఈ సందర్భంగా అమర గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీబీ చాలా సందర్భాలలో సిరివెన్నెల గురించి అన్న మాటలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

తెలుగు సినిమా పాట రచనా స్థాయి బాగా తగ్గిపోతున్న స్థితిలో సిరి వెన్నెల వచ్చారని, ఆయన రాకతో తన గళానికి పెద్ద బలం చేకూరిందని చెప్పుకున్నారు. తాను చిత్ర సీమలో నిలదొక్కుకునేనాటికి అలనాటి కవులు అంతా రాయడం తగ్గించారని, దాంతో తనకు మంచి పాటలు, సాహితీ విలువలు ఉన్న పాటలు పాడే అవకాశాలు లేవా రావా అని భావిస్తున్న తరుణంలో సిరి వెన్నెల వచ్చి అద్భుతమైన సాహిత్యంతో సినిమా పాటను సుసంపన్నం చేశారని బాలూ ఆనాడే కొనియాడారు. సిరి వెన్నెల పాటలను అత్యధిక భాగం తానే పాడడం ద్వారా తన కీర్తిని పెంచుకున్నానని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఆరిపోతున్న తెలుగు సినీ సాహితీ వైభవానికి చేయి అడ్దుపెట్టి సరికొత్త వెలుగులను జిలుగులు అద్దడానికే సీతారామశాస్త్రి పుట్టాడు అనుకోవాలి. ఆయన రాకతో తెలుగు సినిమా పరవశించింది. ఆయనతోనే తన ప్రాభవమంతా అనుకుని కొన్ని దశాబ్దాల పాటు ఉర్రూతలూగింది. దటీజ్ సీతారామశాస్త్రి.
Tags:    

Similar News