మెగాస్టార్ 154 మూవీలో అంత ఇంపార్టెంట్ రోల్ ఉందా?

Update: 2021-11-11 05:30 GMT
కథల విషయంలో చిరంజీవిని ఒప్పించడం అంత తేలిక కాదు. కథలు వినడంలోనూ .. తన సినిమాల నుంచి అభిమానులు ఎలాంటి అంశాలను ఆశిస్తారు అనే విషయంలోను ఆయనకి పూర్తి అవగాహన ఉంది. కథ బాగున్నట్టుగా అనిపిస్తోంది .. కానీ ఎక్కడో ఏదో తక్కువ పడుతున్నట్టుగా అనిపిస్తోందని అనిపించినప్పుడు ఆయన సీనియర్ రైటర్స్ ను రంగంలోకి దింపేసి అన్నీ సెట్ చేయిస్తుంటారు. కథపై ఎంతో కసరత్తు జరిగి .. అన్ని వైపుల నుంచి క్లారిటీ వచ్చిన తరువాతనే ఆయన సెట్స్ పైకి వెళుతుంటారు. అలాంటిది ఈ సారి ఆయన వరుసగా .. తన సహజమైన ధోరణికి భిన్నంగా మూడు భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టేశారు.

తమిళ దర్శకుడు మోహన్ రాజాతో కలిసి 'గాడ్ ఫాదర్' గా ఆయన సెట్స్ పైకి వెళ్లారు. ఆ సినిమా షూటింగు పుంజుకుంటూ ఉండగానే 'భోళా శంకర్' ప్రాజెక్టును పట్టాలెక్కించారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా తమన్నా నటిస్తుండగా .. చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్ కనిపించనుంది. తమిళంలో కొంతకాలం క్రితం అజిత్ చేసిన 'వేదాళం' సినిమాకి ఇది రీమేక్. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఈ నెల 15వ తేదీ నుంచి మొదలుకానుంది.

ఇక మరో వైపున చిరంజీవి 154వ సినిమాకి సంబంధించిన సన్నాహాలను దర్శకుడు బాబీ చకచకా పూర్తి చేస్తున్నాడు. సముద్ర తీరంలోని జాలరుల గూడానికి సంబంధించిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఫస్టు పోస్టర్ లో చిరంజీవి బోట్ పై నుంచుని ఇచ్చిన మాస్ లుక్ అందుకు బలాన్ని చేకూర్చుతోంది. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో అభిమానులకు ఇంకా క్లారిటీ రావలసి ఉంది. 'వాల్తేర్ వీర్రాజు' .. 'వాల్తేర్ వాసు' .. 'వాల్తేర్ శీను' అనేవి టైటిల్స్ గా వినిపిస్తున్నాయి. ఇందులో ఏది సెట్ అయింది అనే విషయమే తేలాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో ఒక ముఖ్యమైన గెస్టు రోల్ ఉందనీ .. స్టార్ హీరోతో ఆ పాత్ర చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా ఒక వార్త బయటికి వచ్చింది. అప్పటి నుంచి ఆ పాత్ర కోసం పవన్ ను సంప్రదిస్తున్నారనీ .. అల్లు అర్జున్ ను అనుకుంటున్నారనీ .. రవితేజ దాదాపు ఖాయమైపోయినట్టేనంటూ రోజుకో హీరో పేరు తెరపైకి వస్తోంది. ఇంతా చేస్తే అసలు అంతటి ఇంపార్టెంట్ రోల్ ఆ సినిమాలో ఉందా? లేదా? అనే విషయంలోనే స్పష్టత లేదు. ఒకవేళ ఉంటే వీరిలో ఎవరైతే ఆ పాత్రకి సరిపోతారా అని చిరంజీవినే ఆలోచనలో పడేసే స్థాయిలో ఈ ప్రచారం జరిగిపోతోంది. ఈ విషయంపై బాబీ స్పందించకపోతే, ఇలా రోజుకో హీరో ఈ జాబితాలో చేరిపోతూనే ఉంటాడు మరి.



Tags:    

Similar News