ఇంతకీ ఈ సినిమా ఎవరికి నచ్చినట్లు?

Update: 2018-10-31 01:30 GMT
బాగున్న సినిమాను నెగెటివ్ రివ్యూలు ఏమీ చేయలేవు. అలాగే బాలేని సినిమాను పాజిటివ్ రివ్యూలు హిట్ కూడా చేయలేవు. ఈ విషయాన్ని ఇండస్ట్రీ జనాలే ఒప్పుకుంటారు. ఐతే ఈ రోజుల్లో థియేటరుకు వెళ్లి సినిమా చూడటం అనేది ఖరీదైన వ్యవహారంగా మారిపోవడం.. పైగా డబ్బు కంటే కూడా సమయం చాలా విలువైందిగా మారిపోయిన నేపథ్యంలో జనాలు సినిమా ఎలా ఉందో తెలుసుకుని కానీ థియేటర్లకు కదలట్లేదు. అందుకే రివ్యూల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటికి ప్రాధాన్యం పెరిగింది. ఐతే బాలేని సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇస్తే.. ఆ చిత్ర బృందానికి అది రుచించదు. అందుకు బాధ కలగడం.. అసహనం రావడం సహజం. కానీ వాస్తవాన్ని గ్రహించి కొంచెం పరిణతితో.. హుందాతనంతో వ్యవహరించడం అవసరం. ఎవరి పని వాళ్లు చేయాలి. ఎవరి వృత్తి వాళ్లది. సినిమా తీసే వాళ్లు సినిమా తీస్తే.. రివ్యూలు రాసేవాళ్లు రివ్యూలు రాస్తారు. ఈ వాస్తవం గుర్తించకుండా.. సినిమాను జనాలు తిరస్కిరించాక రివ్యూయర్ల మీద పడి ఏడిస్తే ఏం లాభం? కానీ ఈ మధ్య కొందరు ఫిలిం మేకర్లకు.. ఆర్టిస్టులకు సమీక్షకుల్ని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది.

ఐతే ఈ విమర్శల విషయంలో కూడా కొందరు హుందాగానే వ్యవహరించారు. కానీ ‘వీర భోగ వసంత రాయలు’ అనే సినిమా తీసిన యువ దర్శకుడు ఇంద్రసేన మాత్రం పూర్తిగా అదుపు తప్పాడు. సమీక్షకుల్ని ఎలా పడితే అలా తిట్టేశాడు. ఆ మాటకొస్తే సినిమా నచ్చని వాళ్లందరినీ విమర్శించాడు. మీకు సినిమా అర్థం కాలేదు.. మీ స్థాయి ఇంతే అన్నట్లుగా మాట్లాడాడు. రివ్యూయర్లను తిట్టాడు ఓకే. నెగెటివ్ రివ్యూలు రాసిన వాళ్లందరికీ నిజంగానే సినిమా అర్థం కాలేదు.. నచ్చలేదు అనుకుందాం? ఇంద్రసేన ‘ఇంటర్ స్టెల్లార్’ తరహాలో ఒక మోస్ట్ ఇంటలెక్చువల్ మూవీనే తీశాడనుకుందాం. మరి ఈ సినిమా ఎవరికి నచ్చినట్లు? ఎవరు దీన్ని ఆదరిస్తున్నట్లు? మామూలుగా యుఎస్ ఆడియన్స్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పోలిస్తే ఓ మెట్టు పైన ఉంటారని.. ఇంటిలిజెంట్ థ్రిల్లర్లను ఆదరిస్తారని అంటారు. మరి అక్కడ ‘వీర భోగ వసంత రాయలు’ 2-3 వేల డాలర్లు మాత్రమే ఎందుకు వసూలు చేసినట్లు? అక్కడి ప్రేక్షకులు ఎందుకు తిరస్కరించినట్లు?

ఇదే విషయం ఒక నెటిజన్ ఇంద్రసేనను ప్రశ్నిస్తే.. రివ్యూయర్లతో పాటు ఎన్నారై ఆడియన్స్ ను కూడా కలిపి విమర్శించాడు. రీజనల్ ఆడియన్స్ కి సినిమా బాగా ఎక్కుతోందన్నాడు. కానీ ఇక్కడా వసూళ్లు లేవు. థియేటర్లు ఖాళీ అయిపోయి షోలే ఆపేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ‘వీర భోగ వసంత రాయలు’ సినిమా సమీక్షకులకు.. ప్రేక్షకులకు అర్థం కాదని అనడం ద్వారా ఇదేదో ‘ఇంటర్ స్టెల్లార్’ అన్నట్లు పోజు కొట్టడమే విడ్డూరం. ‘వీర భోగ వసంత రాయలు’కి అంత దృశ్యం లేదు. నిజానికి సినిమాలో కథ అర్థం కాకపోవడమంటూ ఏమీ లేదు. అసలు కథ ఎటు పోతోంది.. ఏ సన్నివేశం ఎందుకొస్తోంది.. ఏ డైలాగ్ పరమార్థం ఏంటి అన్నదే అర్థం కాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు. ఆ ‘అర్థం కాకపోవడాన్ని’ దర్శకుడు మరోలా అర్థం చేసుకుంటే ఏం చేస్తాం? ఈ విషయాలు పక్కన పెడితే.. ట్విట్టర్లో రివ్యూయర్లు.. ప్రేక్షకులపై తన ఫ్రస్టేషన్ అంతా చూపించేసిన అనంతరం ఇంద్రసేన.. నేను హిమాలయాల వైపు వెళ్తున్నా అన్నాడు. దానికి ఒక నెటిజన్.. ‘అండర్ గ్రౌండా అన్నా’ అని కామెంట్ చేశాడు. దానికి ఇంద్రసేన ఇచ్చిన జవాబు.. ‘అండర్ గ్రౌండ్ ఏంట్రా హౌలే.. హిమాలయాలంటే టాప్ ఆఫ్ ద వరల్డ్’. సోషల్ మీడియా అనేది ఒక సముద్రం. అక్కడ ఎవరెవరో ఏదేదో అంటారు. దానికి ఊరుకోకుండా ఒక దర్శకుడు ఇలాంటి జవాబు ఇచ్చాడంటే.. అతడి మెచ్యూరిటీ గురించి ఇంకేం మాట్లాడతాం?


Tags:    

Similar News